అవసరం నేర్పిన పాఠాలు!

ABN , First Publish Date - 2020-08-13T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు, కాలేజీలు మూతపడి ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. అయితే స్కూల్లో బ్లాక్‌బోర్డు మీద పాఠాలు చెప్పడం కన్నా, ఆన్‌లైన్‌ పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం టీచర్లకు ఛాలెంజ్‌గా మారింది...

అవసరం నేర్పిన పాఠాలు!

లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు, కాలేజీలు మూతపడి ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి. అయితే స్కూల్లో బ్లాక్‌బోర్డు మీద పాఠాలు చెప్పడం కన్నా, ఆన్‌లైన్‌ పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం టీచర్లకు ఛాలెంజ్‌గా మారింది. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా పాఠాలు బోధిస్తున్న టీచర్లు ఈ కష్టకాలంలో రకరకాల సృజనాత్మక ఆలోచనలు చేస్తున్నారు. దుస్తుల హ్యాంగర్లు, ఫ్రిజ్‌ ట్రేలనే బోధనా సాధనాలుగా వాడుతూ, వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. 


బ్లాక్‌బోర్డ్‌ మీద రాసి, వివరించే సబ్జెక్టులు ఆన్‌లైన్‌ తరగుతుల్లో విద్యార్ధులకు అర్థమయ్యేలా చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేని ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ తరగతులు బోధించడం కత్తి మీద సాములాగా మారింది! లెక్కలు చేసి చూపించాలన్నా, ఫార్ములాలు అర్థమయ్యేలా వివరించాలన్నా వాటిని రాసి, వివరించక తప్పదు. అందుకోసం పేపరు లేదా బ్లాక్‌బోర్డు మీద రాస్తూ, అదంతా సెల్‌ఫోన్‌ వీడియోకు చిక్కేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందుకోసం సెల్‌ఫోన్‌కు ఏదో ఒక వస్తువు స్టాండ్‌లా ఆధారం కావాలి. ఇందుకోసం ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచించారు.  ఇటీవల ఆ టీచర్లు, వారి బోధనా విధానాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేయడం మొదలుపెట్టాయి.




హ్యాంగర్లతో ట్రైపాడ్‌!

పుణెకు చెందిన మౌమిత అనే ఓ ఉపాధ్యాయురాలు తన ‘లింక్డిన్‌’ ఎకౌంట్‌లో ఓ బోధనా వీడియోను షేర్‌ చేశారు. దాన్లో ఆమె దుస్తులు వేలాడదీసుకునే హ్యాంగర్‌ను వస్త్రంతో తయారైన తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి ట్రైపాడ్‌గా ఉపయోగించారు. వేలాడే హ్యాంగర్‌ మధ్యలో సెల్‌ఫోన్‌ అమర్చి, ఎదురుగా ఉన్న బ్లాక్‌బోర్డు మీద రాస్తూ, లైవ్‌ వీడియో ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పారు. తను ఎంచుకున్న వినూత్న బోఽధనా విధానాన్ని వివరిస్తూ ‘‘నా దగ్గర ట్రైపాడ్‌ లేదు. అందుకే ఆన్‌లైన్‌ తరగతులు బోధించడం కోసం ఈ సులువైన విధానాన్ని ఎంచుకున్నాను’’ అంటూ ఆమె లింక్డిన్‌ అకౌంట్‌లో పోస్ట్‌ పెట్టి, బోధనావృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.


ఫ్రిజ్‌ ట్రేతో...

లెక్కలు పేపరు మీద రాసి వివరిస్తే, పిల్లలకు తేలికగా అర్థమవుతాయి. అయితే అదంతా లైవ్‌ వీడియోలో స్పష్టంగా కనిపించేలా క్యాప్చర్‌ చేయడం కష్టం. అందుకే ఓ ఉపాధ్యాయురాలు టేబుల్‌ మీద రెండు డబ్బాలను ఉంచి, వాటి మీద పారదర్శకమైన ఫ్రిజ్‌ ట్రేను ఉంచారు. దాని మీద సెల్‌ఫోన్‌ ఉంచి, అడుగున ఉంచిన పేపరు మీద రాస్తూ లెక్కలను వివరించారు. ఇదంతా సెల్‌ఫోన్‌ లైవ్‌ వీడియో ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా చేయగలిగారామె. ఈ ఉపాధ్యాయురాలికి సంబంధించిన ఫొటో ఒకటి ఇటీవల ఒకరి ట్విట్టర్‌ అకౌంట్‌లో హల్‌చల్‌ సృష్టించింది. ‘‘ఒక టీచరు రిఫ్రిజిరేటర్‌ ట్రే సహాయంతో ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నారు’’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ ట్విట్టర్‌ పోస్ట్‌ను చూసి పలువురు, టీచర్ల వృత్తినిబద్ధతను కొనియాడుతూ కామెంట్లు పెట్టడం విశేషం. ఇలా దేశవ్యాప్తంగా ఎంతమంది టీచర్లు ఎన్ని సృజనాత్మక ఆలోచనలు చేస్తున్నారో కదా!


Updated Date - 2020-08-13T05:30:00+05:30 IST