కరోనాతో ఉపాధ్యాయుల మృత్యుఘోష..!

ABN , First Publish Date - 2021-05-11T06:33:14+05:30 IST

కరోనా దెబ్బకు ఉపాధ్యాయ లోకం మృత్యుఘోష పెడుతోంది. వైరస్‌ వారి కుటుంబాల్లో కరోనా ఆరనిశోకం నింపుతోంది.

కరోనాతో ఉపాధ్యాయుల మృత్యుఘోష..!

 

నిత్యం ఒకరిద్దరు వైర్‌సకు బలవుతున్న వైనం..

గతేడాది కంటే సెకెండ్‌ వేవ్‌లో అత్యధికం

ఇప్పటి వరకూ అధికారిక లెక్కల మేరకు 25 మంది..

అనధికారిక సంఖ్య 100కి చేరువలోనే..

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా చేర్చాలంటూ నేతల డిమాండ్‌

పెడచెవిన పెట్టిన ప్రభుత్వం


అనంతపురం విద్య, మే 10 : కరోనా దెబ్బకు ఉపాధ్యాయ లోకం మృత్యుఘోష పెడుతోంది. వైరస్‌ వారి కుటుంబాల్లో కరోనా ఆరనిశోకం నింపుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది వచ్చిన సెకెండ్‌ వేవ్‌లో టీచర్ల మరణాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, సీఆర్టీలు భారీగా మృత్యువాత పడుతున్నారు. అధికారిక లెక్కల మేరకు 2020లో 10 మంది మరణిస్తే.. ఈ ఏడాది మే 9వ తేదీ నాటికి 15 మంది చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 100 మందికి చేరువలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది అంతా వ్యాప్తి చెందడంతోపాటు, అవగాహన రావడంతో పెద్దగా నామోషీగా భావించడం లేదు. గతేడాది చాలామంది కరోనా సోకినా బయట పెట్టకపోగా... అది సోకి మరణించినా.. వారి వివరాలు బహిర్గతం చేయలేదు. గత రెండళ్లలో కరోనా గురువుల కుటుంబాల్లో కన్నీటి సుడులు నింపిందనడంలో సందేహం లేదు.


అల్పకాలంలోనే.. అత్యధికంగా..

ప్రభుత్వం నాడు-నేడు, ఇతర పనులకు టీచర్లను, ప్రధానోపాధ్యాయులను వినియోగించడంతో భారీగా కరోనా బారినపడి, మరణిస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మయ్య (హెచ్‌ఎం, ఆమిద్యాల స్కూల్‌), ఆంజనేయులు (ప్రైమరీ హెచ్‌ఎం, ఎంపీపీ స్కూల్‌, హిందూపురం), నాగభూషణశర్మ (జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం, పరిగి), భాస్కర్‌రెడ్డి (హెచ్‌ఎం, పెద్దగువ్వలపల్లి), నారాయణస్వామి (ప్రైమరీ హెచ్‌ఎం, కంచిసముద్రం), శ్రీనివాసరావు (హెచ్‌ఎం, గొట్లూరు) మరణించారు. స్కూల్‌ అసిస్టెంట్లు, సెకెండరీ గ్రేడ్‌ టీచర్లు సైతం భారీగా ప్రాణాలు కోల్పోయారు. రామ్మోహన్‌ (ముదిరెడ్డిపల్లి జడ్పీహెచ్‌ఎస్‌), చంద్రమహేష్‌ (యగ్నిశెట్టిపల్లి ప్రైమరీ స్కూల్‌), బాలకృష్ణ (ఎనుమలపల్లి జడ్పీహెచ్‌ ఎస్‌), ఈశ్వర్‌రెడ్డి, (పెద్దయక్కలూరు జడ్పీహెచ్‌ఎ్‌స), సోమనాథ్‌ (పాల్తూరు జడ్పీహెచ్‌ఎ్‌స), జయరాజ్‌ (చుక్కలూరు క్రాస్‌), శ్రీనివాసులు (ఆర్‌.అనంతపురం ప్రైమరీ స్కూల్‌), చిన్నిక్రిష్ణ (ఎంపీపీఎస్‌ స్కూల్‌, నామాల), ప్రసాద్‌రెడ్డి (ఎంపీపీఎస్‌, ఎన్పీకుంట) మరణించారు. ఇవి అధికారి లెక్కలు మాత్రమే. పరిగి కేజీబీవీలో సీఆర్టీ సరళతోపాటు మరికొందరు ఉద్యోగులు, టీచర్లు చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే... జాబితా భారీగా ఉంటుంది. రెండళ్లుగా ఉపాధ్యాయుల మరణాలు.. వారి కుటుంబాల్లో అంధకారం నింపాయి.


ఆ విన్నపాలు వీనేవారేరీ..?

ఆది నుంచీ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు పలు డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. గతేడాది నాడు-నేడు ప్రారంభంలోనే వద్దని వారించారు. కొవిడ్‌ నేపథ్యంలో టీచర్లు, ప్రధానోపాధ్యాయులను మినహాయించాలని విన్నవించారు. అయి నా.. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. ఆ నిర్ణయం వల్లే టీచర్లు, ప్రధానోపాధ్యాయులు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సైతం రెండోదశ నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టారు. సెకెండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో సైతం ప్రభుత్వం అదే ధోరణితో ముందుకెళ్తుండటంపై విమర్శలు వ స్తున్నాయి. నాడు-నేడు పనులు చాలవన్న ట్లు.. జగనన్న విద్యా కానుకల మెటీరియల్‌ సేకరణ, ఇతర పనులకు సైతం పురమాయించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


దీనికితోడు ఇతర శాఖలతో పోలిస్తే విద్యాశాఖలో భారీగా మృత్యువాత పడ్డారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయకపోవటమే ఇందుకు కారణమని టీచర్లు, సంఘాలు చెబుతున్నాయి. తమను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలనీ, టీచర్లు అందరికీ టీకాలు వేయించాలని డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంకా ఎంతమంది గురువులను తమ నుంచి దూరం చేస్తుందోనంటూ నిట్టూరుస్తున్నారు.


టీచర్లకు కొవిడ్‌ విధులు తగదు: ఫ్యాప్టో

అనంతపురం విద్య, మే 10: జిల్లాలోని పెనుకొండలో టీచర్లు, ప్రధానోపాధ్యాయులకు కొవిడ్‌ విధులు వేయటం తగదనీ, వెంటనే రద్దు చేయాలని ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, ప్రధానకార్యదర్శి సూర్యుడు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గతనెల 30 వరకూ పాఠశాలలు నిర్వహించడం వల్ల చాలామంది టీచర్లు కొవిడ్‌ బారిన పడ్డారన్నారు. ఇప్పటివరకూ 20 మంది వరకూ మరణించారన్నారు. ఈ నెలలో పదవీ విరమణ చేస్తున్న వారిని, 55 ఏళ్లు పైబడిన టీచర్లను కొవిడ్‌ సెంటర్లలో నోడల్‌ ఆఫీసర్లుగా, అవగాహన కమిటీ బాధ్యులుగా నియమించడం దారుణమన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి టీచర్లకు ఆన్‌లైన్‌ క్లాసులతోపాటు వాటిలో పాల్గొంటున్నారన్నారు. ఇలాంటి సమయంలో.. టీచర్లను విధుల్లో నియమించడం సబబుకాదనీ, ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-05-11T06:33:14+05:30 IST