జీవో 317ను రద్దు చేయాలి.. గళమెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2022-01-17T19:55:32+05:30 IST

జీవో 317పై ఉద్యోగ, ఉపాధ్యాయులు పలు ప్రాంతాల్లో నిరసన గళమెత్తారు. జీవో రద్దు కోరుతూ వేసిన ముగ్గులు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి

జీవో 317ను రద్దు చేయాలి.. గళమెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

(న్యూస్‌నెట్‌వర్క్‌ ‘ఆంధ్రజ్యోతి’): జీవో 317పై ఉద్యోగ, ఉపాధ్యాయులు పలు ప్రాంతాల్లో నిరసన గళమెత్తారు. జీవో రద్దు కోరుతూ వేసిన ముగ్గులు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని లోకల్‌, ఉపాధ్యాయుల గ్రూపులతో పాటు ఫేస్‌బుక్‌ పేజీల్లో ఈ రంగవల్లులు ఆదివారం దర్శనమిచ్చాయి. కాగా, ఇవి ఏ జిల్లాలో వేసిన ముగ్గులో తెలియదుగానీ.. నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జీవోను రద్దు చేసి పండుగ పూట తీపి కబురు చెప్పండి, సీఎం గారూ.. జర మా మొర ఆలకించండి సారూ.. అంటూ రంగవల్లులకు జతచేసిన క్యాప్షన్లు ఆలోచింప జేస్తున్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇక ఉపాధ్యాయ దంపతులకు ఓకే చోట పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రగతి భవన్‌ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.  కేసీఆర్‌కు తమ సమస్యను వివరించేందుకు వచ్చామని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. వారిని అరెస్టు చేసి తరలించారు. కాగా, స్పౌజ్‌ కేటగిరీ టీచర్లను ఒకే జిల్లాకు కేటాయించాలని కోరుతూ మహిళా ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ముగ్గులు వేసి నిరసన తెలిపారు.

Updated Date - 2022-01-17T19:55:32+05:30 IST