బడిలో గరిట తిప్పిన ఉపాధ్యాయులు!

ABN , First Publish Date - 2021-12-07T07:53:11+05:30 IST

బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమ్మె చేయడంతో పిల్లలకు భోజనం పెట్టేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు గరిట తిప్పాల్సి వచ్చింది.

బడిలో గరిట తిప్పిన ఉపాధ్యాయులు!

  • సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమ్మె 
  • రూ.2.33 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ 


సిరిసిల్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమ్మె చేయడంతో పిల్లలకు భోజనం పెట్టేందుకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు గరిట తిప్పాల్సి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సోమవారం సమ్మె చేశారు. జిల్లాలో 499 ప్రభుత్వ పాఠశాలల్లో 38,800 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. సమ్మెతో సగం పాఠశాలల్లో భోజనం నిలిచిపోయింది. కొందరు విద్యార్థులు ఇళ్ల నుంచి బాక్స్‌లు తెచ్చుకున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు వంటలు చేశారు. మరికొన్ని పాఠశాలల్లో ఇతర వ్యక్తుల ద్వారా వంటలు చేయించారు.


జిల్లాలో ఏజెన్సీలకు 3 నెలలుగా రూ.2.33 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అప్పులు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనాన్ని అందించలేమని నిర్వాహకులు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో సమ్మెలోకి దిగారు. సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. బిల్లులు చెల్లించాలని, కనీస వేతనాల అమలు,  ప్రభుత్వమే గ్యాస్‌ సిలిండర్‌, గుడ్లు సరఫరా చేయాలని, వంట చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల్లాగే సరుకులు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-12-07T07:53:11+05:30 IST