పోరుబాట

ABN , First Publish Date - 2022-01-21T05:54:26+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హక్కుల్ని హరిస్తూ అర్ధరాత్రి జారీచేసిన పీఆర్‌సీ జీవోలని రద్దు చేయాల్సిందేనని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు.

పోరుబాట

సర్కారుపై ఉద్యోగుల సమరం

ఫ్యాఫ్టో ముట్టడితో దద్దరిల్లిన కలెక్టరేట్‌

భారీగా హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయులు

ఈ పీఆర్‌సీ మాకొద్దంటూ నినాదాలు

చీకటి జీవోల్ని రద్దుచేసే వరకు ఉద్యమం

మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందే..

ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్‌

 

గుంటూరు(విద్య), జనవరి20: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హక్కుల్ని హరిస్తూ అర్ధరాత్రి జారీచేసిన పీఆర్‌సీ జీవోలని రద్దు చేయాల్సిందేనని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెలువరించిన పీఆర్‌సీ జీవోలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు గుంటూరులో గురువారం నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడికి  భారీసంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు  హాజరయ్యారు. ఉదయం 9.45కు ప్రారంభమైన కలెక్టరేట్‌ ముట్డడి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్‌కు ఇరువైపుల అరకిలోమీటరు మేర కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రభుత్వం ప్రకటించిన చీకటి జీవోల్ని రద్దుచేసే వరకు ఆందోళన విరమించేది లేదని ఫా్యాప్టో నాయకులు జోసఫ్‌ సుధీర్‌బాబు స్పష్టం చేశారు. అశితోష్‌మిశ్రా కమిటీ రిపోర్టు ప్రకారం ఐఆర్‌ కంటే మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం పీఆర్‌సీ అమలు చేస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు. పెన్షనర్లకు  కూడా అన్యాయం జరగుతుందన్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఎ.తిరుమలేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిల డీఏలు ఇస్తూ జీతం పెరిగిందని ఉద్యోగులను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలు పొందటం ఉద్యోగుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి షేక్‌ ఫైజుల్లా ప్రసంగిస్తూ ప్రభుత్వం ప్రకటించిన  పీఆర్‌సీతో ఎవరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. 30శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ అమలు, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని స్పష్టం చేశారు.  మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట మాట్లాడడం ప్రభుత్వానికి రివాజుగా మారిందన్నారు. ఉద్యోగులను, పెన్షనర్లను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు.  ఫ్యాప్టో కోశాధికారి శౌరిరాయలు మాట్లాడుతూ అధికారుల సిఫార్సులు రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కో చైర్మన్‌ ఎం.కళాధర్‌, డి.పెదబాబు, ఎం.శ్రీనివాస్‌, జి.వేళాంగిణిరాజు, ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు పి.ప్రేమ్‌కుమార్‌,  యు.చంద్రజిత్‌యాదవ్‌, కె.బసవలింగారావు, కె.నరసింహారావు, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కె.వీరాంజనేయులు, బి.మదన్‌మోహన్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి.ప్రభుదాస్‌, ఎన్జీవో అసోసియేషన్‌ నాయకులు సుకుమార్‌ తదితరులు  మాట్లాడుతూ క్యాంటం పెన్షన్‌ యధావిఽధిగా అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో దాదాపు అయిదువేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల పాల్గొన్నారని సంఘాల నాయకులు వెల్లడించారు. ఆందోళన చేస్తున్న ఫ్యాప్టో నాయకుల సుధీర్‌బాబు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఇతర నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు.

Updated Date - 2022-01-21T05:54:26+05:30 IST