రద్దు చేయాల్సిందే

ABN , First Publish Date - 2022-01-21T06:27:47+05:30 IST

రివర్స్‌ పీఆర్సీపై జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు రెండో రోజూ మండిపడ్డారు.

రద్దు చేయాల్సిందే
కలెక్టరేట్‌ ముట్టడికి తరలివచ్చి, పోలీసులు అడ్డుకోవడంతో లక్ష్మీ టాకీస్‌ సెంటర్లో బైఠాయించిన ఉపాధ్యాయులు

చీకటి జీవోలను ఉపసంహరించే వరకూ పోరుబాటలోనే

కలెక్టరేట్‌ ముట్టడికి కదిలిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు

ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన 

జిల్లా నలుమూలల నుంచి రాక

దారి పొడవునా అడ్డుకున్న పోలీసులు

బారికేడ్లు పడగొట్టి మరీ ముందుకు..

అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిండిపోయిన బందరు పోలీస్‌ స్టేషన్లు

గూడూరు, గుడ్లవల్లేరు స్టేషన్లకు తరలింపు


రివర్స్‌ పీఆర్సీపై జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు రెండో రోజూ మండిపడ్డారు. చీకటి జీవోలను రద్దు చేసేవరకు తాము పోరుబాటలోనే సాగుతామని నినదించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతాల్లో కోత పెడుతూ ప్రభుత్వం ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి పెద్ద ఎత్తున కదలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు లాఠీలతో చెల్లాచెదురు చేశారు. అయినా కొందరు ముందుకు దూసుకురాగా, దొరికినవారిని దొరికినట్టు అరెస్టు చేసి వ్యాన్లు, బస్సులు ఎక్కించారు. ప్రభుత్వ తీరుపై నిరసనకారులు మండిపడ్డారు. ఆయా పోలీస్‌ స్టేషన్లలోనే నిరసనను కొనసాగించారు. 


(ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం) : రివర్స్‌ పీఆర్సీని నిరసిస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు కలెక్టరేట్‌ ముట్టడికి ఉదయం ఏడు గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేలాదిగా మచిలీపట్నంకు తరలివచ్చారు. మరోవైపు పోలీసులు కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున సిబ్బందిని మోహరించారు. కలెక్టరేట్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు. గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌, అవనిగడ్డ, పెడనతోపాటు, విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి మచిలీపట్నంకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాకుండా అడ్డుకున్నారు. మచిలీపట్నంలోని లక్ష్మీటాకీస్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌కు ఒక్క ఉద్యోగిని కూడా పోలీసులు వెళ్లనీయలేదు. లక్ష్మీటాకీస్‌ సెంటర్‌, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం,  ధర్నాచౌక్‌,  కలెక్టరేట్‌ ప్రధాన గేటు, కలెక్టరేట్‌కు చేరుకునే అన్ని మార్గాల వద్ద పోలీసులు బారికే డ్లను ఏర్పాటు చేశారు. ధర్నాచౌక్‌ వద్దకు చేరుకున్న ఉపాధ్యాయులను వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. లక్ష్మీటాకీస్‌ సెంటరు వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీసులు నిలిపివేయడంతో వారంతా వివిధ మార్గాల్లో కలెక్టరేట్‌కు చేరుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారిని గుడివాడవైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు, ఆటోలు, పోలీస్‌ వాహనాల్లో నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. ఈ సమయంలో పోలీసులు, టీచర్లు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో స్వయంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ రంగంలోకి దిగి, పోలీసు అధికారులకు తగిన సూచనలు చేశారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని మచిలీపట్నంలోని పోలీసు స్టేషన్లకు, సమీపంలోని గూడూరు, గుడ్లవల్లేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.


ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు

వైసీపీ ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తుందని ఆశించామని, పీఆర్సీని ఊహించని విధంగా పెంచుతారని అనుకున్నామని, కానీ గతంలో ఏ ప్రభుత్వమూ వ్యవహరించని తీరులో ఈ ప్రభుత్వం ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేస్తోందని ఫ్యాప్టో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే, వారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ చెప్పారని, తీరా ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. పీఆర్సీని కరువు భత్యం కంటే తక్కువగా ఇచ్చిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, ఉద్యోగుల జీతాలకు కోతపెడుతూ ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. 


మోసం.. దగా..

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఫ్యాప్టో నాయకులు మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 20 శాతం కరువుభత్యం ఇస్తే, తాను 27 శాతం ఇస్తానని జగన్‌ డప్పాలు కొట్టారని, ఇప్పుడు పెంచకపోగా, 2019 జూలై నుంచి 2020 మార్చి వరకు ఉద్యోగులు అదనంగా కరువుభత్యం తీసుకున్నారని, దానిని తిరిగి చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇవ్వకుండా, ఐఆర్‌ అధికంగా తీసుకున్నారు.. తిరిగి చెల్లించండి అంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, చీఫ్‌ సెక్రటరీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారని, రాష్ట్ర ఆదాయం ఎక్కడ తగ్గిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కాలంలో మీరు ఏ ధరలు తగ్గించారని ఉద్యోగుల జీతాలు తగ్గిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఒక వైపు మీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్ర ఆదాయం రూ.86 వేల కోట్లకు పెరిగిందని చెబుతుంటే, మీరేమో ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెడుతున్నారంటూ ఫ్యాప్టో నాయకులు విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు చేబ్రోలు శరత్‌చంద్ర,  తమ్ము నాగరాజు, ఎ.సుందరయ్య, జె.లెనిన్‌బాబు, రంగారావు, డి.కనకారావు, భగీరథి, కొమ్ము ప్రసాద్‌,  దారపు శ్రీనివాసరావు,  పాండురంగ వరప్రసాద్‌,  జి.వి.రామారావు తదితరులతోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 


పోలీస్‌ స్టేషన్లలో నిరసనలు

 నాగాయలంక : కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను వక్కపట్లవారిపాలెం వంతెన వద్ద పోలీసులు అరెస్టు చేయడంతో వారంతా స్టేషన్‌లోనే నిరసన తెలిపారు. గుడ్లవల్లేరు మండలంలో మరికొందరు ఉపాధ్యాయులను అక్కడి పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మచిలీపట్నం ఉపాధ్యాయులను అరెస్టు చేసి గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. వారందరినీ గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు.



Updated Date - 2022-01-21T06:27:47+05:30 IST