టీకాల్లేని ఉత్సవ్‌

ABN , First Publish Date - 2021-04-14T05:40:11+05:30 IST

కల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి కరోనాను టీకాతోనే తుదముట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయించాలని సూచించింది.

టీకాల్లేని ఉత్సవ్‌

90 వేల మందికి వ్యాక్సినేషన్ల లక్ష్యం

డోస్‌లు నిల్‌


కడప, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి కరోనాను టీకాతోనే తుదముట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది. టీకాపై అవగాహన, వీలైనంత మందికి వ్యాక్సినేషన్‌ వేసేందుకు మూడురోజుల పాటు నిర్వహించిన టీకా ఉత్సవ్‌ వ్యాక్సిన్‌ లేక జిల్లాలో తుస్‌్‌స..మనిపించింది. ఈనెల 11, 12, 13 తేదీల్లో టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం టీకా పండుగగా నామకరణం చేసింది. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. రోజుకు 30 వేల మందికి వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా మూడు రోజుల్లో 90 వేల మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళిక రూపొందించింది. అయితే 9, 10 తేదీల్లో అందుబాటులో ఉన్న టీకాలు వేశారు. ఇక వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడంతో టీకా పండుగ అనుకున్న లక్ష్యం సాధించలేకపోయిందని చెబుతున్నారు. 


కరోనా కల్లోలం

జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. జనం కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం, కట్టడి కోసం అధికార యంత్రాంగం గతంలో మాదిరి చర్యలు చేపట్టకపోవడంతో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేవలం 13 రోజుల వ్యవధిలోనే 1641 కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 334 మందిలో వైరస్‌ నిర్ధారణ అయింది. కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషనే. 45 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ వ్యాక్సినేషన్‌ వేయిస్తున్నారు. జిల్లాలో 45 సంవత్సరాలు పైబడ్డ వారు 7.50 లక్షల మంది ఉన్నారు. జనవరి 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 2.40 లక్షల మందికి టీకా వేశారు. కొందరికి రెండో డోస్‌ పూర్తి అయింది. మిగిలిన 5.10 లక్షల మందికి టీకా వేయాల్సి ఉంది. టీకా ఉత్సవ్‌లో భాగంగా మూడు రోజుల్లో 90 వేల మందికి టీకా వేయాలని నిర్ణయించారు. రెగ్యులర్‌గా ఉండే రిమ్స్‌, జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైవేటు ఆసుపత్రులే  కాకుండా రోజూ ఒకచోట అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసి జిల్లాను రెండు రూట్లుగా విభజించి 12 మంది ప్రోగ్రాం ఆఫీసర్లను కూడా నియమించారు. ప్రతిరోజూ టీకా పండుగ రోజున స్టాకు పంపుతామని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే డోస్‌లు సరిపడా సరఫరా కాకపోవడంతో టీకా పండుగ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్‌ మార్గమని వైద్యులు చెబుతున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా వ్యాక్సినేషన్‌ సరఫరా కావడం లేదు. తొలినాళ్లలో వ్యాక్సిన్‌ పట్ల జనం విముఖత చూపేవారు. ఇటీవల కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇది మంచి పరిణామమని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాకు అవసరమైన డోస్‌ పంపిస్తే వైర్‌సకు అడ్డుకట్ట వేయవచ్చు.


నేటి నుంచి వ్యాక్సినేషన్‌  

- అనిల్‌కుమార్‌, డీఎంహెచ్‌వో

వ్యాక్సిన్‌ స్టాకు లేకపోవడంతో టీకా ఉత్సవ్‌లో భాగంగా వ్యాక్సిన్‌ వేయలేకపోయాం. జిల్లాకు 40 వేల డోస్‌లు స్టాకు వచ్చింది. బుధవారం నుంచి వ్యాక్సినేషన్‌ మొదలవుతుంది. అనుకున్న లక్ష్యం పూర్తి చేస్తాం.


Updated Date - 2021-04-14T05:40:11+05:30 IST