హైదరాబాద్‌కు టీ-హబ్‌ మణిహారం

ABN , First Publish Date - 2021-07-31T06:30:59+05:30 IST

హైదరాబాద్‌ స్టార్ట్‌పలకు కేంద్రంగా మారుతోంది. టీ-హబ్‌ హైదరాబాద్‌కు మణిహారంగా వెలుగొందుతోంది.

హైదరాబాద్‌కు టీ-హబ్‌ మణిహారం

  • స్టార్టప్‌ కేంద్రంగా నగరం
  • అన్ని విధాలుగా ప్రభుత్వ అండదండలు
  • ఈవై శ్వేతపత్రం విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ స్టార్ట్‌పలకు కేంద్రంగా మారుతోంది. టీ-హబ్‌ హైదరాబాద్‌కు మణిహారంగా వెలుగొందుతోంది. ఇన్నోవేటర్లు, స్టార్ట్‌పలు అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ఉత్ర్పేరకంగా పని చేస్తోందని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) తెలిపింది. ‘హైదరాబాద్‌- ఎమర్జింగ్‌ స్టార్టప్‌ హబ్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. టెమాసెక్‌, సింగపూర్‌ ప్రెస్‌ హోల్డింగ్స్‌ అనుబంధ సంస్థయిన కన్‌స్టెల్లర్‌ నిర్వహిస్తున్న ‘ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ ఇండియా 2021-22’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ‘ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌’ను నిర్వహించారు. ఇందులో భాగస్వామిగా ఉన్న ఈవై హైదరాబాద్‌పై శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం 2016లోనే తొలి స్టార్టప్‌ విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ట ప్‌లకు మొదటి దశ నిధులు అందించడానికి ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు, టీ-హబ్‌తో కలిసి ప్రభుత్వం రూ.2,000 కోట్ల ప్రారంభ నిధులతో టీ-ఫండ్‌’ను కూడా ఏర్పాటు చేసింది.


బడాబడా ఐటీ కంపెనీలు..

ఐబీఎం, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, టీసీఎస్‌ వంటి బడా బడా సాఫ్ట్‌వేర్‌, టెక్నాలజీ కంపెనీలు హైదరాబాద్‌లో కేంద్రాలను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యాలు కలిగిన నిపుణులను ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని శ్వేతపత్రం పేర్కొంది. వీటిలో సెంట్రల్‌ ఫార్మా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, డీఆర్‌డీఓ లేబొరేటరీస్‌ వంటివి ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌, తెలంగాణల్లో స్టార్టప్‌ వ్యవస్థను బలోపతం చేస్తున్నాయి. 


టీ-హబ్‌లో 200పైగా స్టార్ట్‌పలు..

ఇన్నోవేషన్‌, స్టార్టప్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పరంగా హైదరాబాద్‌కు టీ-హబ్‌ మణిహారంగా ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌. ప్రస్తుతం ఇందులో 200లకు పైగా స్టార్ట్‌పలు తమ వినూత్న ఉత్పత్తుల అభివృద్ధిపై కృషి చేస్తున్నాయి. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 700 సీట్ల సామర్థ్యంతో టీ-హబ్‌ దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోందని ఈవై పేర్కొంది. 


42% ఫిన్‌టెక్‌ స్టార్ట్‌ప్స ఇక్కడే..

దేశం మొత్తంలో ఉన్న ఫిన్‌టెక్‌ స్టార్ట్‌పల్లో 42 శాతం ఫిన్‌టెక్‌ స్టార్ట్‌పలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 183 ఫిన్‌టెక్‌ స్టార్ట్‌పలు ఉన్నాయని ఈవై పేర్కొంది. బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ ఉంది. బేసిక్స్‌ సబ్‌-కే, క్రెడిట్‌ విద్యా, పేస్రైఫ్‌, ఎనీటైమ్‌ లోన్‌, ఫింక్‌స్వైర్‌, క్రెడిట్‌ రైట్‌, అర్ధయంత్రా తదితర 10 ప్రముఖ ఫిన్‌టెక్‌ స్టార్ట్‌పలు ఇప్పటి వరకూ 5.6 కోట్ల డాలర్ల (దాదాపు రూ.400 కోట్లు) నిధులను సమీకరించాయి. 


ఐదున్నరేళ్లలో 5.5 లక్షల ఉద్యోగాలు..

దేశవ్యాప్తంగా 2021 మే చివరి నాటికి గుర్తింపు పొందిన 50 వేల స్టార్ట్‌పలు ఉన్నాయి. ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఏడాదికి స్థిరంగా 12-15 శాతం చొప్పున స్టార్ట్‌పలు పెరుగుతున్నాయి. మొత్తం స్టార్ట్‌పలలో 8,900- 9,300 టెక్నాలజీ లీడ్‌ స్టార్ట్‌పలు. సగటున రోజుకు 2-3 టెక్నాలజీ స్టార్ట్‌పలు ఆవిర్భవించాయి. గత ఐదున్నరేళ్ల కాలంలో స్టార్ట్‌పలు దాదాపు 5.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి. 2020 ప్రథమార్ధం చివరి నాటికి స్టార్ట్‌పలు సమీకరించిన నిధులు 6,300 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.4,53,600 కోట్లు) చేరాయి. 2014-2020 మధ్య కాలంలో 34 స్టార్ట్‌పలు యూనికార్న్‌ క్లబ్‌లో చేరాయి. వీటి మొత్తం విలువ 11,550 కోట్ల డాలర్లు. 2025 నాటికి దేశంలో మొత్తం 100కు పైగా స్టార్ట్‌పలు యూనికార్న్‌ క్లబ్‌లో ఉంటాయని ఈవై అంచనా వేసింది. 2025 నాటికి దేశంలో స్టార్ట్‌పల సంఖ్య లక్షకు చేరవచ్చు. ఇవి 32.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని పేర్కొంది. 

Updated Date - 2021-07-31T06:30:59+05:30 IST