ఎలా ముందుకెళ్దాం?

ABN , First Publish Date - 2020-12-21T10:02:43+05:30 IST

తొలి టెస్టు ఆరంభానికి ముందు ఆసీస్‌ ఆటగాళ్ల గాయాల జాబితా చూస్తే.. టీమిండియాకే గెలిచే చాన్స్‌ ఉందని అంతా భావించారు. తీరా బరిలోకి దిగాక కోహ్లీ సేనకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా ఝలక్‌ తగిలింది.

ఎలా  ముందుకెళ్దాం?

భారత్‌కు సవాల్‌గా మారిన రెండో టెస్టు


తొలి టెస్టు ఆరంభానికి ముందు ఆసీస్‌ ఆటగాళ్ల గాయాల జాబితా చూస్తే.. టీమిండియాకే గెలిచే చాన్స్‌ ఉందని అంతా భావించారు. తీరా బరిలోకి దిగాక కోహ్లీ సేనకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా ఝలక్‌ తగిలింది. దీనికి తోడు పేసర్‌ మహ్మద్‌ షమి గాయంతో సిరీ్‌సకు దూరమవడం ఊహించని దెబ్బ. మరోవైపు పృథ్వీ షా, మిడిలార్డర్‌ వైఫల్యం జట్టును వేధిస్తున్న సమస్య. ఇది సరిపోదన్నట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సేవలు కూడా ఇక అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో బాక్సింగ్‌ డే టెస్టు కోసం తుది జట్టు కూర్పుపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బుర్ర బద్దలు కొట్టుకుంటోంది. అటు పంత్‌, రాహుల్‌, సిరాజ్‌, గిల్‌ కూడా బెర్త్‌ను ఆశిస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): అడిలైడ్‌ ఓవల్‌లో టీమిండియాకు ‘గులాబీ’ ముల్లు కాస్త బలంగానే గుచ్చుకుంది. దీంతో ఈనెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్‌ డే టెస్టుకు లోపాలను సరిదిద్దుకుని భారత్‌ పటిష్ఠమైన జట్టుతో బరిలోకి దిగాలనుకుంటోంది. తొలి టెస్టులో భారత్‌ 36 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ద్వారా జట్టుకు అనేక సమస్యలు తలెత్తాయి. ఊహించని విధంగా పేసర్‌ షమి బ్యాటింగ్‌లో గాయపడి సిరీ్‌సకే దూరం కావాల్సి వచ్చింది. కొందరు ఆటగాళ్ల రూపంలో ఇతర సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించుకునే దిశగా జట్టు ఆలోచిస్తోంది.


షా స్థానంలో గిల్‌: నైపుణ్యం కలిగిన యువ ఆటగాడిగా పృథ్వీ షాకు పేరుంది. కానీ పింక్‌ బాల్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతనాడింది 6 బంతులైతే.. చేసింది 4 పరుగులే. అతడి ఫుట్‌వర్క్‌ కూడా ప్రశ్నార్థకంగా మారింది. రెండుసార్లూ బంతి బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్య గ్యాప్‌ నుంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. మంచి స్ట్రోక్‌ మేకర్‌ అయినా అతని డిఫెన్సివ్‌ టెక్నిక్‌లో లోపాలున్నాయి. చాలామంది అతడిని సెహ్వాగ్‌తో పోలుస్తున్నా అలాంటి ఆటగాళ్లు తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారని గుర్తుంచుకోవాలి. ఫీల్డింగ్‌లోనూ షా నిరాశపరుస్తున్నాడు. దీంతో షా స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌తో అరంగేట్రం చేయించే అవకాశాలున్నాయి. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో గిల్‌ సగటు 69.74. ఆసీస్‌ ‘ఎ’పైనా 43, 65 పరుగులతో మెరుగ్గా రాణించాడు. పదునైన పేస్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ చెత్త బంతులను బౌండరీలకు తరలించే సత్తా గిల్‌కు ఉంది. అలాగే భారత్‌ ‘ఎ’ తరఫున రెండేళ్లుగా నిలకడగా రాణిస్తూ 970 పరుగులు సాధించాడు. ఈ కారణంగా రెండో టెస్టులో గిల్‌ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.


సాహా స్థానంలో పంత్‌: వెటరన్‌ కీపర్‌ సాహా బ్యాటింగ్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అపార నమ్మకం పెట్టుకున్నా అతడి ఆట ఆశించిన విధంగా లేదు. వికెట్ల వెనకాల అతడి ప్రతిభకు వంక పెట్టలేం. అయితే అతడి బ్యాటింగ్‌ సత్తానే జట్టును ఆందోళనపరుస్తోంది. దీంతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో శతకం బాదిన రిషభ్‌ పంత్‌వైపు జట్టు మొగ్గు చూపే చాన్సుంది. తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వాస్తవానికి పంత్‌ దూకుడైన శైలి ఆటనే భారత్‌కు అవసరపడింది. అలాగే క్రితంసారి ఆసీస్‌ టూర్‌లోనూ పంత్‌ ఆతిథ్య జట్టుపై సెంచరీ చేశాడు. కీపర్‌గా కాస్త వెనుకబడినా.. ఆసీస్‌ పిచ్‌లపై కీపింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని టీమ్‌ అనుకుంటోంది. ఈ సిరీ్‌సలో పంత్‌ రాణిస్తే వచ్చే ఇంగ్లండ్‌ సిరీ్‌సకు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే సాహా కెరీర్‌ ముగిసినట్టే.


రాహుల్‌.. సిరాజ్‌ కూడా: కెప్టెన్‌ కోహ్లీ పితృత్వ సెలవు కారణంగా మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో నాలుగో నెంబర్‌లో కేఎల్‌ రాహుల్‌ ఆడడం ఖాయమే. బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ షమి గాయం భారత్‌కు ఎదురుదెబ్బే. టెస్టుల్లో ఉత్తమ బౌలర్‌గా సేవలందిస్తున్న షమి దూరమవడంతో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తుదిజట్టులో చోటు ఆశిస్తున్నాడు. ఆసీస్‌ ‘ఎ’తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సిరాజ్‌ రాణించడం సానుకూలాంశం. అయితే అతడికి సైనీ నుంచి గట్టి పోటీ కనిపిస్తోంది.

Updated Date - 2020-12-21T10:02:43+05:30 IST