‘బాక్సింగ్‌’కు ప్రాక్టీస్‌

ABN , First Publish Date - 2020-12-24T09:20:52+05:30 IST

తొలి టెస్ట్‌ ఘోర పరాజయం నుంచి బయటపడుతున్న భారత జట్టు...తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానె ఆధ్వర్యంలో బాక్సింగ్‌ డే టెస్ట్‌కు ముమ్మరంగా సాధన చేస్తోంది. కోచ్‌ రవిశాస్ర్తి హిత వచనాలతో ప్రాక్టీస్‌ మొదలైంది...

‘బాక్సింగ్‌’కు ప్రాక్టీస్‌

  • టీమిండియా ముమ్మర సాధన


మెల్‌బోర్న్‌: తొలి టెస్ట్‌ ఘోర పరాజయం నుంచి  బయటపడుతున్న భారత జట్టు...తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానె ఆధ్వర్యంలో బాక్సింగ్‌ డే టెస్ట్‌కు ముమ్మరంగా సాధన చేస్తోంది. కోచ్‌ రవిశాస్ర్తి హిత వచనాలతో ప్రాక్టీస్‌ మొదలైంది. శుభ్‌మన్‌ గిల్‌ తదితరులు బుధవారంనాడు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. డే/నైట్‌ టెస్ట్‌కు వామ్‌పగా జరిగిన మ్యాచ్‌లో 43, 65 పరుగులు చేసినా...అడిలైడ్‌ టెస్ట్‌లో గిల్‌కు జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. శుభ్‌మన్‌తోపాటు మయాంక్‌ అగర్వాల్‌ నెట్స్‌లో ఎక్కువసేపు తమ నైపుణ్యాలకు పదును పెట్టారు. దాంతో మయాంక్‌తో కలిసి గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయమని భావిస్తున్నారు.


21 ఏళ్ల శుభ్‌మన్‌ ఇప్పటికే రంజీలలో పంజాబ్‌ తరపున ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నాడు. అలాగే కేఎల్‌ రాహుల్‌ కూడా నెట్స్‌లో ఎక్కువసేపు సాధన చేశాడు. రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలంటూ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ గవాస్కర్‌ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. కంకషన్‌తో మొదటి టెస్ట్‌కు దూరమైన స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జడేజాకూడా గంటసేపు బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అందులో ఎక్కువ సమయం తన సౌరాష్ట్ర సహచరుడు పుజారకు బంతులేశాడు. అనంతరం రెండో దఫాకూడా జడేజా సాధన చేశాడు. ఈ నేపథ్యంలో 26 నుంచి జరిగే మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో అతను కూడా ఆడే అవకాశాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. ఇక పితృత్వ సెలవుపై కోహ్లీ భారత్‌కు వెళ్లిపోవడంతో.. జట్టులో ఆత్మవిశ్వాసం నింపాల్సిన గురుతర బాధ్యత తాత్కాలిక సారథి రహానెపై నిలిచింది. ‘ఎర్ర బంతి టెస్ట్‌కోసం మెల్‌బోర్న్‌లో ఉన్నాం. టీమిండియా మరోసారి సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది’ అని ట్విటర్‌లో బీసీసీఐ పోస్ట్‌ చేసింది. నెట్స్‌లో సాహా కంటే ముందు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌తో రవిశాస్ర్తి ప్రత్యేకంగా మాట్లాడాడు. వామప్‌ మ్యాచ్‌లో 73 బంతుల్లో 103 రన్స్‌ చేసిన పంత్‌..రెండో టెస్ట్‌కు సాహా స్థానంలో జట్టులోకి రానున్నాడని అంచనా వేస్తున్నారు. మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌ నెట్స్‌లో రహానెకు బౌలింగ్‌ చేశారు. మణికట్టు గాయంతో టెస్ట్‌ సిరీ్‌సకు షమి దూరమవడంతో ఈ ముగ్గురిలో ఒకరికి మూడో పేసర్‌గా అవకాశం దక్కనుంది. 





రహానె..బౌలర్ల కెప్టెన్‌

రహానె..బౌలర్ల కెప్టెన్‌ అని సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ చెప్పాడు. ప్రశాంత చిత్తం, సహచరులతో స్పష్టంగా సంభాషించడంతోపాటు తన ఉద్దేశాలను కచ్చితంగా తెలియజేయగల అజింక్యా జట్టును సమర్థంగా నడిపిస్తాడని ఇషాంత్‌ అభిప్రాయపడ్డాడు. ‘ప్రశాంత స్వభావం, ఆత్మవిశ్వాసం మెండుగాగల రహానె బౌలర్ల పక్షపాతి’ అని చెప్పాడు. ‘గతంలో విరాట్‌ లేని సమయాల్లో జట్టుకు నాయకత్వం వహించిన అజింక్యా.. ఎప్పుడు బౌలింగ్‌ చేస్తావు, నీకు ఎలాంటి ఫీల్డింగ్‌ కావాలి, మరిన్ని ఓవర్లు బౌలింగ్‌ చేయగలవా అని అడిగేవాడు’ అని ఇషాంత్‌ వివరించాడు. 


రెండో టెస్ట్‌కూ వార్నర్‌, అబాట్‌ దూరం 

గాయాలతోపాటు, కొవిడ్‌ నిబంధనలతో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ వార్నర్‌, సీన్‌ అబాట్‌ రెండో టెస్ట్‌కు దూరమయ్యారు. గాయాల చికిత్సకోసం వారు జట్టు బయోబబుల్‌ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయుతే రెండో టెస్ట్‌కోసం వారిద్దరినీ సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌ రప్పించారు. సిడ్నీలో కరోనా హాట్‌స్పాట్‌లలో వార్నర్‌, అబాట్‌ లేకున్నా.. బయో సెక్యూర్‌ నిబంధనల కారణంగా వారు రెండో టెస్ట్‌కు జట్టులో చేరడంలేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. 

Updated Date - 2020-12-24T09:20:52+05:30 IST