‘బెంచ్‌’ బలం.. స్పష్టత ముఖ్యం!

ABN , First Publish Date - 2021-03-11T09:45:41+05:30 IST

టీమిండియా రిజర్వ్‌ దళం ఇటీవలి కాలంలో అత్యంత పటిష్ఠంగా మారింది. రెండు నెలలుగా బెంచ్‌ క్రికెటర్లు ఎంత అద్భుతంగా రాణిస్తున్నారో చూశాం...

‘బెంచ్‌’ బలం.. స్పష్టత ముఖ్యం!

  • (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


టీమిండియా రిజర్వ్‌ దళం ఇటీవలి కాలంలో అత్యంత పటిష్ఠంగా మారింది. రెండు నెలలుగా బెంచ్‌ క్రికెటర్లు ఎంత అద్భుతంగా రాణిస్తున్నారో చూశాం. భారత జట్టు ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ చేరడంలో బెంచ్‌ ఆటగాళ్ల పాత్ర కూడా ఉంది. ఇప్పుడిక కోహ్లీసేన టెస్ట్‌ ఫార్మాట్‌ నుంచి బయటపడి మళ్లీ పొట్టి క్రికెట్‌వైపు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈక్రమంలో భారత్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌నకు సన్నాహకాలు కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ అందుకు తొలి మెట్టుగా చెప్పాలి.  బ్యాటింగ్‌ విభాగానికొస్తే చర్చంతా యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై నడుస్తోంది. జట్టు టీ20 ప్రణాళికల్లో కీలకం కానున్న పంత్‌..ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో తుది 11మందిలో ఉండడం ఖాయం. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ అహ్మదాబాద్‌లో ఈనెల 12న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 2019 చివర్లో.. బ్యాటింగ్‌, కీపింగ్‌లో పంత్‌ విఫలమవడంతో కేఎల్‌ రాహుల్‌కు ఆ రెండు బాధ్యతలు అప్పగించడం ద్వారా జట్టులో సమతూకం తీసుకొచ్చారు. ప్రస్తుతం మిడిలార్డర్‌లో ఓ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ ఉండాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అమోఘమైన ఫామ్‌లో ఉన్న పంత్‌ అందుకు సరిగ్గా సరిపోతాడు. పంత్‌ను ఇప్పటికే ప్రథమ ప్రాధాన్య కీపర్‌గా ప్రకటించారు. ఇషాన్‌ కిషన్‌ను అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు. 


సాధ్యమైనంత త్వరగా: టీమ్‌ మేనేజ్‌మెంట్‌ టీ20 ప్రపంచ కప్‌నకు ‘కోర్‌ టీమ్‌’ను సాధ్యమైనంత త్వరగా రూపొందించాలి. లేదంటే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఎదురైన చేదు అనుభవాలే పునరావృతమవుతాయి. ‘నాలుగో స్థానంలో పంత్‌ను సుదీర్ఘకాలం కొనసాగించాలి. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల్లోనూ అవకాశం ఉంటుందని అతడికి చెప్పాలి. 2019 వన్డే ప్రపంచకప్‌లో నాలుగో నెంబర్‌ విషయంలో ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిందే. కీలక టోర్నీకి ముందు ఆ స్థానంలో వచ్చే క్రికెటర్‌ను తగినన్ని మ్యాచ్‌ల్లో ఆడించడం ద్వారా వరల్డ్‌కప్‌నకు సన్నద్ధం చేయాలి’ అని మాజీ సెలక్టర్‌ దేవంగ్‌ గాంధీ సూచించాడు. 

అది సవాలే: పంత్‌ జట్టులోకొస్తే..ఓపెనింగ్‌ జోడీని ఎంపిక చేయడం మేనేజ్‌మెంట్‌కు సవాలే. కేఎల్‌ రాహుల్‌, ధవన్‌లలో ఒకరికే చాన్సుంటుంది. ‘ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం క్లిష్టమే. ఇప్పుడైతే..రోహిత్‌, రాహుల్‌ ఓపెనర్లుగా రావడమే ఉత్తమం. శిఖర్‌ను బ్యాక్‌పగా ఉంచాలి. పేస్‌, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే పంత్‌ నాలుగో నెంబర్‌లో రావడం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ను పటిష్ఠం చేస్తుంది. పంత్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యాతో టీ20లలో మిడిలార్డర్‌ తిరుగులేకుండా ఉంటుంది’ అని గాంధీ వివరించాడు. 


బ్యాకప్‌ ఇలా..

ముఖ్య క్రికెటర్ల పనిభారం విషయంలో జట్టు యాజమాన్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనుకోని సంఘటనలు జరిగితే బ్యాకప్‌ ఆటగాళ్లును సిద్ధంగా ఉంచుకోవాలి. బుమ్రాకు బదులుగా వచ్చిన నటరాజన్‌ యార్కర్లతో అదరగొడుతున్నాడు. భువనేశ్వర్‌ పునరాగమనం శుభశూచకం. భువీకి బ్యాక్‌పగా ఉండాలనుకుంటే డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ను దీపక్‌ చాహర్‌ మెరుగుపర్చుకోవాలి. 2019 వరల్డ్‌కప్‌నకు ముందులాగే ప్రత్యామ్నాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే జట్టు కూర్పుపై స్పష్టత ఉండడం ముఖ్యం. 


Updated Date - 2021-03-11T09:45:41+05:30 IST