ఎవరిని ఎంపిక చేయాలి?

ABN , First Publish Date - 2021-03-09T09:58:40+05:30 IST

నాలుగు టెస్టుల సిరీ్‌సను 3-1తో నెగ్గిన ఊపులో భారత జట్టు ఇక పొట్టి ఫార్మాట్‌పై దృష్టి పెట్టింది. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానంలోనే ఐదు టీ20లు జరుగనున్నాయి...

ఎవరిని ఎంపిక చేయాలి?

  • టీ20 జట్టుపై మేనేజ్‌మెంట్‌ డైలమా


నాలుగు టెస్టుల సిరీ్‌సను 3-1తో నెగ్గిన ఊపులో భారత జట్టు ఇక పొట్టి ఫార్మాట్‌పై దృష్టి పెట్టింది. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానంలోనే ఐదు టీ20లు జరుగనున్నాయి.  అయితే ఈనెల 14 నుంచి జరిగే ఈ సిరీస్‌ కోసం జట్టును ఎంపిక చేయడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారనుంది. ఎందుకంటే దాదాపుగా ఒక్కో బెర్త్‌కు ఇద్దరేసి పోటీదారులతో మొత్తం 19 మంది ఆటగాళ్లు చోటు కోసం సిద్ధంగా ఉన్నారు. అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌ జరుగబోతుండగా వచ్చే ఆరేడు నెలల పాటు కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీ, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ల దృష్టి కూడా వీరిపైనే ఉండనుంది. తొలి మూడు టీ20ల్లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి సిరీస్‌ సాధించాక.. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తారా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


రాహుల్‌ స్థానం ఎక్కడ?

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ భీకర ఫామ్‌తో తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కీలకం కాబోతున్నాడు. అతడి రాకతో కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతల నుంచి వైదొలగాల్సి రావచ్చు. అలాగే గతంలో ఓపెనర్లుగా ధవన్‌, రోహిత్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ వన్డే, టీ20ల్లో రాహుల్‌ దూసుకువచ్చి ధవన్‌కు గట్టి పోటీదారుగా మారాడు. రోహిత్‌ స్థానం గురించి ఎవరికీ సందేహం లేదు. ధవన్‌ ఇటీవల విజయ్‌ హజారేలో ఢిల్లీ తరఫున భారీ శతకంతో ఫామ్‌ చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు రాహుల్‌ను ఎక్కడ ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ ఎలాగూ మూడో నెంబర్‌లో రానుండగా భారీ షాట్లు ఆడే పంత్‌, పాండ్యా 5,6వ స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌ రాహుల్‌ను ఎక్కడ ఆడించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మిగిలిన నాలుగో స్థానంలో ఆడించాలంటే శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లతో పోటీపడాల్సి ఉంది.  


భువీకీ తప్పని పోటీ

ఇదే పరిస్థితి బౌలింగ్‌ విభాగంలోనూ కనిపిస్తోంది. గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే ఇప్పటిదాకా ప్రధాన పేసర్‌గా ఉన్న అతడికి దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ సవాల్‌ విసురుతున్నారు. డెత్‌ ఓవర్లలో రాణించడంతో పాటు అనుభవం భువీకి అనుకూలంగా మారినా చాలాకాలం పాటు ఆటకు దూరంగా ఉండడం మైనస్‌ కానుంది. అటు సైనీతో పోలిస్తే యార్కర్ల స్పెషలిస్ట్‌ నటరాజన్‌కు ఎక్కువ అవకాశం ఉంది. ఇక మొతేరా ట్రాక్‌ను పరిగణనలోకి తీసుకుంటే స్పిన్నర్లు చాహల్‌, అక్షర్‌, సుందర్‌ తుది జట్టులో ఉండే పరిస్థితి కనిపిస్తోంది. గాయాలతో షమి, జడేజా.. వ్యక్తిగత కారణాలతో బుమ్రా ఇప్పటికే దూరమైన విషయం తెలిసిందే. 

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)


Updated Date - 2021-03-09T09:58:40+05:30 IST