36కే ఢమాల్!

ABN , First Publish Date - 2020-12-20T07:11:36+05:30 IST

టెస్టు చరిత్రలోనే కోహ్లీ సేన అత్యల్ప స్కోరుతో చెత్త రికార్డును నమోదు చేసింది. మూడో రోజు బ్యాటింగ్‌తో మురిపిస్తారనుకుంటే.. ఆస్ట్రేలియా పేస్‌ త్రయం నుంచి దూసుకొచ్చిన నిప్పులు చెరిగే బంతులకు మనోళ్లు బ్యాట్‌ అడ్డుపెట్టేందుకే వణికిపోయారు...

36కే ఢమాల్!

  • భారత్‌ టెస్టు చరిత్రలో ఘోర పరాభవం
  • అత్యల్ప స్కోరుతో చెత్త రికార్డు కైవసం
  • గులాబీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం  


4 9 2 0 4 0 8 4 0 4 1.. 

ఫ్యాన్సీ మొబైల్‌ నెంబర్‌ను తలపిస్తున్న ఈ సంఖ్యలేమిటో తెలుసా.. ప్రపంచ అత్యుత్తమ స్థాయి కలిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చేసిన స్కోర్లు. అంతేనా... ఈ సూపర్‌ ఫ్లాప్‌ షోతో తమ టెస్టు చరిత్రలోనే కోహ్లీ సేన అత్యల్ప స్కోరుతో చెత్త రికార్డును నమోదు చేసింది. మూడో రోజు బ్యాటింగ్‌తో మురిపిస్తారనుకుంటే.. ఆస్ట్రేలియా పేస్‌ త్రయం నుంచి దూసుకొచ్చిన నిప్పులు చెరిగే బంతులకు మనోళ్లు బ్యాట్‌ అడ్డుపెట్టేందుకే వణికిపోయారు. పుజరా, రహానె ఖాతానే తెరవకపోగా, మయాంక్‌ చేసిన 9 పరుగులే టాప్‌ స్కోర్‌. ఇక 8 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన హాజెల్‌వుడ్‌.. రెండున్నర రోజుల్లోనే భారత ‘గులాబీ’ ఆశలను చిదిమేశాడు.


అడిలైడ్‌: భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఘోర పరాభవమిది. రెండో రోజు భారత బౌలర్ల జోరు చూసి ఆహా.. అనుకున్న మరుసటి రోజే బ్యాట్స్‌మెన్‌ బేజారెత్తిన వైనాన్నీ చూడాల్సి వచ్చింది. ఫలితంగా తొలి (డే/నైట్‌) టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే నాలుగు టెస్టుల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది. పేసర్లు హాజెల్‌వుడ్‌ (5-3-8-5), కమిన్స్‌ (4/21) విజృంభణతో శనివారం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 21.2 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసింది. చివరి బ్యాట్స్‌మన్‌ షమి (1) రిటైర్డ్‌ హర్ట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత 90 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్‌ 21 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసి గెలిచింది. బర్న్స్‌ (51 నాటౌట్‌) అర్ధసెంచరీ చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా టిమ్‌ పెయిన్‌ నిలిచాడు.


వచ్చారు.. వెళ్లారు: 9/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత ఆటగాళ్లు ఇంత దారుణంగా చేతులెత్తేస్తారని ఎవరూ ఊహించలేదు. రెండో రోజు ఉదయం సెషన్‌ మాదిరే ఈసారీ బ్యాట్స్‌మెన్‌ పేలవ ఆట కొనసాగింది. కేవలం 27 పరుగుల వ్యవధిలోనే మిగిలిన తొమ్మిది వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్‌లో బుమ్రాను కమిన్స్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాక వికెట్ల పతనం ప్రారంభమైంది. బుల్లెట్‌లాంటి బంతులు బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లడంతో బ్యాట్స్‌మెన్‌ ఎంత త్వరగా వచ్చారో అంతే వేగంగా పెవిలియన్‌లో కూర్చున్నారు. ఒక్కో ఓవర్‌లో రెండేసి వికెట్లతో హాజెల్‌వుడ్‌ భారత్‌ను బెంబేలెత్తించాడు. ఫలితంగా ఎవరూ రెండంకెల స్కోరు కూడా సాధించలేదు. చివర్లో కమిన్స్‌ ఓవర్‌లో షార్ట్‌ పిచ్‌ బాల్‌ షమి కుడి మోచేతికి బలంగా తాకింది. చికిత్స తీసుకున్నప్పటికీ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో భారత్‌ తమ ఇన్నింగ్స్‌ను అవమానకరంగా ముగించింది.

ఆడుతూ.. పాడుతూ: 90 పరుగుల లక్ష్యంతో ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. భారత్‌ దారుణంగా తడబడిన చోట ఓపెనర్లు బర్న్న్‌, వేడ్‌ (33) వేగంగా ఆడుతూ మ్యాచ్‌ను ముగించే ప్రయత్నం చేశారు. అయితే తొలి వికెట్‌కు 70 పరుగులు చేర్చాక 18వ ఓవర్‌లో వేడ్‌ రనౌటయ్యాడు. ఆ వెంటనే లబుషేన్‌ (6)ను అశ్విన్‌ అవుట్‌ చేసినా ఎలాంటి ఇబ్బంది లేకుండా బర్న్స్‌ ఆటతీరుతో ఆసీస్‌ ఘనవిజయం సాధించింది.




96 ఏళ్ల తర్వాత ఇప్పుడే..

ఒక ఇన్నింగ్స్‌లో ఏ ఆటగాడు కూడా సింగిల్‌ డిజిట్‌ దాటకపోవడం 9 దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. 1924లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగులకు కుప్పకూలింది. ఇందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 7 మాత్రమే. దాదాపు శతాబ్దం తర్వాత భారత జట్టు ద్వారా మళ్లీ ఆ చెత్త రికార్డు నమోదైంది.  మయాంక్‌ మాత్రమే 9 పరుగులు సాధించాడు. 


ఒక్క శతకం లేకుండానే..

ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు విరాట్‌ కోహ్లీకి ఈ ఏడాది  కలిసిరాలేదు. కనీసం ఒక్క సెంచరీ కూడా లేకుండానే 2020ని ముగించాడు. 2008 నుంచి గతేడాది వరకు కనీసం ఓ శతకమైనా తన ఖాతాలో ఉంది. ఈ ఏడాది తను 9 వన్డేలు, 3 టెస్టులు, 10 టీ20లు ఆడగా ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ రుచి చూడలేదు. అతడి టాప్‌ స్కోరు 89 మాత్రమే. అలాగే కెప్టెన్‌గానూ అపజయాలు వెక్కిరించాయి. కివీస్‌, ఆసీ్‌సలతో వన్డే సిరీ్‌సలను కోల్పోయాడు.


సిరీ్‌స నుంచి షమి అవుట్‌! 

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి టెస్ట్‌ సిరీ్‌సలో మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడడం సందేహంగా మారింది. శనివారం.. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ షార్ట్‌ పిచ్‌ బంతి షమి కుడి మోచేతికి బలంగా తాకింది. దాంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిగిరిగాడు. తర్వాత స్కానింగ్‌ కోసం షమిని ఆసుపత్రికి తరలించగా అతడి కుడి మణికట్టు ఫ్రాక్చర్‌ అయినట్టు తేలింది. దీంతో అతడు టెస్ట్‌ సిరీ్‌సలో ఆడకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 



1

కెప్టెన్‌ కోహ్లీ టాస్‌ గెలిచిన 26 మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడడం ఇదే తొలిసారి

టెస్టు ఇన్నింగ్స్‌లో ఒక్క భారత బ్యాట్స్‌మన్‌ కూడా పది రన్స్‌ దాటకపోవడం ఇదే మొదటిసారి


స్కోరుబోర్డు

భారత్‌  తొలి ఇన్నింగ్స్‌: 244; ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 191


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) కమిన్స్‌ 4; మయాంక్‌ (సి) పెయిన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 9; బుమ్రా (సి అండ్‌ బి) కమిన్స్‌ 2; పుజార (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 0; కోహ్లీ (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 4; రహానె (సి) పెయిన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 0; విహారి (సి) పెయిన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 8; సాహా (సి) లబుషేన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 4; అశ్విన్‌ (సి) పెయిన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 0; ఉమేశ్‌ (నాటౌట్‌) 4; షమి (రిటైర్డ్‌ హర్ట్‌) 1; మొత్తం: 21.2 ఓవర్లలో 36. వికెట్ల పతనం: 1-7, 2-15, 3-15, 4-15, 5-15, 6-19, 7-26, 8-26, 9-31, 9-36. బౌలింగ్‌: స్టార్క్‌ 6-3-7-0; కమిన్స్‌ 10.2-4-21-4; హాజెల్‌వుడ్‌ 5-3-8-5.


ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వేడ్‌ (రనౌట్‌) 33; బర్న్స్‌ (నాటౌట్‌) 51; లబుషేన్‌ (సి) మయాంక్‌ (బి) అశ్విన్‌ 6; స్మిత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 21 ఓవర్లలో 93/2. వికెట్ల పతనం: 1-70, 2-82. బౌలింగ్‌: ఉమేశ్‌ 8-1-49-0; బుమ్రా 7-1-27-0; అశ్విన్‌ 6-1-16-1.




అత్యధికం..అత్యల్పం రెండూ కోహ్లీ కెప్టెన్సీలోనే

19 డిసెంబరు, 2016     భారత్‌ అత్యధిక స్కోరు 759

19 డిసెంబరు, 2020   భారత్‌ అత్యల్ప స్కోరు 36


ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌట్‌ కావడం ద్వారా అత్య ల్ప స్కోరు చేసిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. విరాట్‌ కెప్టెన్సీలో ఈ చెత్త రికార్డు అందుకున్న టీమిండియా..అతడి సారథ్యంలోనే అత్యధిక స్కోరు చేసిన ఘనత కూడా సాధించింది. సరిగ్గా నాలుగేళ్ల కిందట.. ఇదే డిసెంబరు 19 (2016)న కోహ్లీసేన ఈ రికార్డు నెలకొల్పింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా..చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 759/7తో భారీ స్కోరు చేసింది. కరుణ్‌ నాయర్‌ అజేయ ట్రిపుల్‌ సెంచరీ (303)తో కదం తొక్కగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (199) తృటిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ టెస్ట్‌లో భారత్‌ 75 పరుగులతో గెలిచింది. అయితే అప్పటికే టీమిండియా 3-0తో సిరీ్‌సను చేజిక్కించుకుంది. ఆ చారిత్రక మ్యాచ్‌లో పుజార, అశ్విన్‌, ఉమేశ్‌ భాగస్వాములు కావడం విశేషం. 


Updated Date - 2020-12-20T07:11:36+05:30 IST