Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్యకు కన్నీటి వీడ్కోలు

  • పార్థివదేహానికి నివాళులర్పించిన నేతలు
  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంజయ్‌, చిరంజీవి..
  • గాంధీభవన్‌లో ఏపీ మంత్రులు బొత్స, పేర్ని నాని, 
  • కాంగ్రెస్‌ నేతలు శైలజానాథ్‌, రఘువీరా నివాళులు
  • సోనియా తరఫున నివాళులర్పించిన ఖర్గే
  • 12.30 గంటలకు అక్కడి నుంచి దేవరయాంజాల్‌కు..
  • అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): దాదాపు ఆరు దశాబ్దాల రాజకీయ జీవితం.. అజాతశత్రువుగా పేరు.. పార్టీలకతీతంగా నేతలతో సత్సంబంధాలు.. రాజకీయ కురువృద్ధుడు.. వివాదరహితుడు.. పదవులకే వన్నె తెచ్చిన నేత.. ఆర్థిక చాణక్యుడు.. కొణిజేటి రోశయ్యకు తెలుగు రాష్ట్రాల ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్దాయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు రెండు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు అమీర్‌పేటలోని స్వగృహంలో రోశయ్య పార్థివదేహానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నివాళులర్పించారు. టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, సినీ హీరో చిరంజీవి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివా్‌సరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, బీజేపీ నేత టీజీ వెంకటేష్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు, సీనియర్‌ పాత్రికేయులు ఐ.వెంకట్రావు, టీఎ్‌సఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు ప్రముఖులు రోశయ్య పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పోలీస్‌ గౌరవ వందనంతో ఉదయం 11.20కు రోశయ్య పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంలో గాంధీభవన్‌కు తరలించారు.

గాంధీభవన్‌లో నివాళులు..

రోశయ్య పార్థివదేహానికి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రత్యేక వాహనంలో రోశయ్య పార్థివదేహం గాంధీభవన్‌కు చేరుకోగానే ‘జోహార్‌ రోశయ్య, అమర్‌ రహే రోశయ్య’ అంటూ నినాదాలు చేశారు. పార్థివ దేహంపై పార్టీ జెండాను కప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్‌కు వచ్చి రోశయ్యకు నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. సుమారు అరగంట పాటు గాంధీ భవన్‌లో పార్థివదేహాన్ని ఉంచారు. 12.30 గంటలకు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, పార్టీ ఇతర నేతలు శవపేటికను మోసుకుంటూ వెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించారు. అక్కడి నుంచి దేవరయాంజాల్‌లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రానికి పార్థివ దేహాన్ని తరలించారు.

సొంత వ్యవసాయ క్షేత్రంలో..

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రం లిటిల్‌ ఇంగ్లండ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు కవాతుతో రోశయ్య పార్థివ దేశాన్ని చితి వద్దకు తీసుకెళ్లారు. రెండు గంటల పాటు పూజాక్రతువు నిర్వహించిన అనంతరం పార్థివ దేహాన్ని కుమారులు, బంధువులు చితి పైకి తీసుకెళ్లారు. తర్వాత పలువురు ప్రముఖులు రోశయ్యకు ఘనంగా నివాళుర్పించారు. పోలీసు వందనం, శ్రద్ధాంజలి, రెండు నిమిషాల మౌనం పాటించిన అనంతర మూడు సార్లు తుపాకులతో గాల్లోకి కాల్చారు. పెద్ద కుమారుడైన శివసుబ్బారావు రోశయ్యకు తలకొరివి పెట్టారు. మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్‌శాంసన్‌తో పాటు ఇతర అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. 


అంత్యక్రియలకు హాజరవని మల్లారెడ్డి

రోశయ్య అంత్యక్రియలకు మేడ్చల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరవలేదు. దీనిపై కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివేకానంద, గణేశ్‌గుప్తా, బీసీ కార్పొరేసన్‌ చైర్మన్‌ వకులాభరణం కృష్ణమోహన్‌ హాజరయ్యారు. రోశయ్య అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించడం ముదావహమన్న వీహెచ్‌.. అంత్యక్రియలకు ఒక్క మంత్రి కూడా హాజరవకపోవడం బాధాకరమని చెప్పారు. 


భారీ జాతీయ పతాకం అవనతం

రోశయ్య మృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. దీంతో హుస్సేన్‌సాగర్‌ సమీపంలోని సంజీవయ్య పార్కులో ఉన్న భారీ జాతీయ పతాకాన్ని శనివారం అవనతం చేశారు. సోమవారం వరకు ఇలాగే కొనసాగనుంది.

పార్టీ గొప్ప నేతను కోల్పోయింది: ఖర్గే 

రోశయ్య తనకు 50 ఏళ్లుగా తెలుసునని, ఆయన మరణంతో కాంగ్రెస్‌ పార్టీ గొప్ప నేతను కోల్పోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు.  రోశయ్యకు నివాళి అర్పించిన అనంతరం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.  దేశంలో 16 సార్లు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి రోశయ్య మాత్రమేనని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.   రోశయ్య మరణంతో ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్‌ సైనికుడిని, ప్రజాస్వామిక వాదిని కోల్పోయామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. తెలుగు రాజకీయాలు ఉన్నంతకాలం రోశయ్య జీవించి ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆయన ముఖంలో ఎన్నడూ కోపం చూడలేదని ఏపీ మంత్రి బొత్స చెప్పారు. ప్రకాశం జిల్లాలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ, తమిళనాడులో రోశయ్య పేరుమీద ఘాట్‌లను ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ, ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రోశయ్య స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement
Advertisement