భార్యను అంటే భరించలేకపోతున్నా!

ABN , First Publish Date - 2021-11-20T07:57:44+05:30 IST

‘‘నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు అసెంబ్లీలో గత రెండున్నరేళ్లుగా నన్ను అనరాని మాటలు ఎన్ని అంటున్నా భరించాను. బూతులు తిట్టినా సహించాను. కుప్పం ఫలితం తర్వాత మీ నాయకుడి మొహం చూడాలని ఉందని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మా పార్టీ..

భార్యను అంటే  భరించలేకపోతున్నా!

  • అసహ్యమైన మాటలతో వ్యక్తిత్వ హననం..
  • ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు..
  • ఆమె త్యాగం, శ్రమ ఎంతో ఉంది
  • ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా... ఆ తర్వాతే అసెంబ్లీకి
  • చంద్రబాబు ఆవేదన, ఆక్రోశం
  • మీడియా సమావేశంలో కన్నీళ్లు


అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు అసెంబ్లీలో గత రెండున్నరేళ్లుగా నన్ను అనరాని మాటలు ఎన్ని అంటున్నా భరించాను. బూతులు తిట్టినా సహించాను. కుప్పం ఫలితం తర్వాత మీ నాయకుడి మొహం చూడాలని ఉందని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేలతో అన్నా పట్టించుకోకుండా ఊరుకొన్నాను. కానీ... చివరకు నా భార్య ప్రస్తావన సభలో తెచ్చి ఆమె గురించి అసహ్యంగా మాట్లాడారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపర్చాలని చూశారు. ఏమిటీ దుర్మార్గం? మీ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఇళ్లలో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టరా?’’ అని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతా’ అని అసెంబ్లీలో ప్రకటించిన అనంతరం... ఆయన  పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటితీవ్రమైన నిర్ణయం తీసుకొనే ముందు తన హృదయం ఎంత గాయపడిందో ఆయన తెలిపారు. వివరాలు చంద్రబాబు మాటల్లోనే... నా భార్య ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు. ఆమెకు రాజకీయాలపై ఆసక్తి లేదు. వాళ్ల నాన్న ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి. నేను సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చేశాను. అయినా, ఆమె బయట కనిపించింది చాలా తక్కువ. ఎప్పుడైనా ప్రొటోకాల్‌ కోసం లేదా సంప్రదాయాల కోసం రావడం తప్ప బయటకు వచ్చేది కాదు. మా పార్టీ నాయకులు కూడా చాలామంది ఆవిడకు తెలియదు. నా శ్రమ వెనుక ఆమె త్యాగం చాలా ఉంది.


అవసరమైన ప్రతి సందర్భంలో ఆమె నా వెనుక ఉంది. హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు వెంటనే నా బట్టలు ఒక సూట్‌ కేసులో సర్ది విశాఖకు వెళ్తే బాగుంటుందని సూచించింది. ఎన్టీఆర్‌ను నాదెండ్ల దించిన సంక్షోభంలో నెలరోజులు బయటే తిరిగాను. ఆ సమయంలో కూడా ఆమె నాకు ఎంతో సహాయకారిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? మీ భార్యల గురించి మాట్లాడితే మీ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? అధికారం కోల్పోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. కౌరవ సభలో పాండవుల సమక్షంలో ద్రౌపదిని అవమానించినట్లు అవమానించారు. ఆ తర్వాత కౌరవులకు ఏం జరిగిందో చూశాం. రామాయణంలో రాక్షసులకు ఏ ఖర్మ పట్టిందో కూడా మనకు తెలుసు. భస్మాసురుడు శివుడి వద్ద వరం పొంది తర్వాత శివుడి తలపైనే చేయి పెట్టాలని వెంటపడ్డాడు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ రాక్షసులు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు కూడా అదే మాదిరిగా ఉంది. ఇది కౌరవ సభ. గౌరవం లేని సభ. రాక్షస పాలన కన్నా ఘోరంగా వ్యవహరిస్తున్నారు. 


అప్పుడు వైఎస్‌... 

గతంలో శాసనసభలో ఆవేశకావేశాలు పెరిగితే సభను వాయిదా వేసి అందరితో మాట్లాడేవారు. తప్పు చేసిన వారిని స్పీకర్‌ మందలించేవారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి నా తల్లిని అసెంబ్లీలో నిందించారు. నేను నిలదీస్తే తర్వాత క్షమాపణ చెప్పారు. ఇప్పుడు కూడా నేను మనసుకు బాధ కలిగి నా నిర్ణయం చెబుదామని మైక్‌ అడిగాను. గతంలో తరిమెల నాగిరెడ్డి... ఎన్టీఆర్‌ వంటివారు తమ నిర్ణయాలను సభాముఖంగా చెప్పి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ సభలో దానికి కూడా ఓపిక లేకుండా నా మైక్‌ కట్‌ చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయన మా పార్టీ నుంచి వచ్చారు. మంత్రిగా చేశారు. ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. పర్వాలేదు. కనీసం నాకు మైక్‌ కూడా ఇవ్వరా? ఇది సావాస దోషం! అవతలివారి మెప్పు పొందాలన్న తాపత్రయంతో ఆయన మారిపోయినట్లు అనిపిస్తోంది.


నాడు ఇలా... 

ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, తీసుకొచ్చిన సంస్కరణలను చూడటానికి నాడు అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ స్వయంగా వచ్చారు. మలేషియా, సింగపూర్‌ ప్రధాన మంత్రులు కూడా వచ్చారు. ప్రధాని వాజపేయి నా పట్ల ఎంతో ఆదరంగా ఉండేవారు. ఒక సందర్భంలో నేను రావడం ఆలస్యమైతే నా కోసం అరగంట వేచి చూశారు. నేను ఏనాడూ వ్యక్తిగత అవసరాల కోసం అడగనని, రాష్ట్రం కోసమే అడుగుతానని ఆయన అందరితో చెబుతుండేవారు. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసే సందర్భంలో కీలక పాత్ర తీసుకొనే అవకాశం కలిగింది. జ్యోతిబసు, కరుణానిధి, సుర్జీత్‌ సింగ్‌ వంటి ఎందరో మహామహులతో కలిసి పనిచేసే అదృష్టం వచ్చింది. గెలుపు ఓటములను క్రీడా స్పూర్తితో తీసుకొన్నాను. గెలిస్తే పొంగిపోలేదు. ఓడితే కుంగిపోలేదు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో చాకిరీ చేసినా ప్రజలు ఇరవై మూడు సీట్లే ఇచ్చారు. అయినా వాటితోనే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నాం!!

Updated Date - 2021-11-20T07:57:44+05:30 IST