Advertisement
Advertisement
Abn logo
Advertisement

కదిపితే కన్నీళ్లే!

  కర్షకుల ఆరుగాలం కష్టం వర్షార్పణం

భారీ వర్షాలతో కోలుకోలేని దెబ్బ

ఉరకెత్తిపోతున్న మిర్చి, పొగాకు

తుడిచిపెట్టుకు పోయిన మినుము, పత్తి, కంది

ఉన్న పైరుపైనా తెగుళ్ల దాడి, బీళ్లను తలపిస్తున్న పొలాలు

నీటి పాలైనపంటలు చూసి రోదిస్తున్న రైతులు

ఏమిచేయాలో అర్థం కావడం లేదని ఆవేదన

పొలంబాటలో ఆంధ్రజ్యోతి బృందం ఎదుట బోరుమన్న రైతులు

ఒంగోలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

- చీరాల సబ్‌డివిజన్‌ పరిధిలో మిరప, మినుము, వేరుశనగ, మొక్కజొన్న వైట్‌బర్లీ పంటలకు భారీనష్టం వాటిల్లింది. ఉరకెత్తిన పైర్లు దున్ని వేయాల్సిందే. ప్రస్తుత కాలానికి తగ్గట్టు ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలనేది ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలని రైతులు మదనపడుతున్నారు. 

- అద్దంకి ప్రాంతంలో ప్రధానంగా మినుము, జూట్‌ తుడిచి పెట్టుకుపోయాయి. ఉల్లి కుళ్లిపోయింది. పీకిన మినుము కుప్పల నుంచి మొలకలు వచ్చాయి. కోత దశలో ఉన్న మినుము దెబ్బతినటంతో గొర్రెల  మేతకు ఇచ్చారు. పండించిన పంట ఇంటికి చేరకుండానే వర్షార్పణమైంది. పత్తి తీయకుండానే రాలిపోయింది. మిర్చికి ఈ ఏడాది విపరీతంగా తెగుళ్లు ఆశించాయి. 

-కందుకూరు ప్రాంతలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దెబ్బతిన్న పైర్లను ఉంచాలో దున్నేయాలో అర్థం కాని పరిస్థితి. కూరగాయల తోటలకు కనిపించని నష్టం వాటిలింది. మిరపకు తెగుళ్లు సోకాయి. పొగనారు దొడ్లు  దెబ్బతిన్నాయి. ఎంత శ్రమపడ్డా పెట్టుబడులు కూడా చేతికి రావన్న నిర్వేదం ప్రతి రైతు మాటల్లో వ్యక్తమైంది. 

- వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కొన్ని ఉరకెత్తి, మరికొన్ని మొలకెత్తి, ఇంకొన్ని కుళ్లిపోతుండటం చూసి కర్షకులు కుమిలిపోతున్నారు. ఏ పంటా చేతికి వచ్చే పరిస్థితి  లేదు. ఎలా బతకాలి.. అప్పులు ఎలా తీర్చాలి’ అంటూ బోరుమంటున్నారు. బుధవారం ఆంధ్రజ్యోతి బృందం నిర్వహించిన పొలంబాటలో అడుగడుగునా అన్నదాతలు తమకు జరిగిన నష్టాన్ని ఏకరువు పెట్టారు. 


 చేతికి వస్తుందనుకునే సమయంలో ముదురు మినుము, పత్తి పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. మిర్చి తోటలు ఉరకెత్తాయి. రబీలో వేసిన పొగాకు, శనగ, మిర్చి తిరిగి సాగు చేపట్టాల్సిన పరిస్థితి. ఉన్న పైర్లను కాపాడుకోవాలన్నా విపరీతంగా తెగుళ్ల దాడి... కలుపు పెరిగి పొలాలు బీళ్లను తలపిస్తున్నాయి... నష్టాలు భరించేది ఏలా... మళ్లీ సాగు చేయడం ఏలా అన్నది అర్థంకాక జిల్లా రైతులు తల్లడిల్లుతున్నారు. ఇటీవల జిల్లాలో ముసురుగా కురిసిన భారీవర్షాలు ప్రత్యేకించి తూర్పు, పశ్చిమప్రాంతంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధికారిక అంచనా ప్రకారమే లక్షా 23వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరో 50వేల ఎకరాలపైనే పంటలు తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చని అంచనా. నవంబరులో సాధారణ వర్షపాతం 143.7మి.మీ కాగా దాదాపు 300 మి.మీ కురిసింది. ఇక కందుకూరు, కనిగిరి, కొండపి, ఒంగోలు, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు రెట్లు అధికంగా వర్షం కురిసింది. ఫలితంగా ఆ ప్రాంతంలో సాగు చేసిన అన్నిరకాల పంటలు దెబ్బతిని రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రస్తుతం తెరపి ఇవ్వడంతో పొలాలకు వెళ్లి పంటలను చూసి రైతులు బోరు మంటున్నారు. పోయింది పోగా ఉన్నది కాపాడుకోవాలన్న తపనతో పొలాలకు పరుగులు తీస్తున్న రైతులు ఉరెకత్తిన మొక్కలు, ఇంకా నీళ్లలోనే లేతపైర్లు ఉండటం, ఉన్న పంటలో తెగుళ్ళ దాడి, బీళ్లను తలపించేలా పెరిగిన కలుపును చూసి కన్నీరుపెడుతున్నారు. ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరుతున్నారు. 

ఎలా కాపాడుకోవాలో...

భారీవర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్న కందుకూరు, కొండపి, ఎస్‌ఎన్‌పాడు, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని 15కుపైగా మండలాల్లో ఆంధ్రజ్యోతి బృందం పొలంబాట నిర్వహించి పంటల పరిస్థితిని పరిశీలించడంతోపాటు రైతులను పలుకరించగా దెబ్బతిన్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. కందుకూరు, వీవీపాలెం, లింగసముద్రం మండలాల్లో పరిశీలిస్తే ఆ ప్రాంతంలో మినుము పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా పొగాకు, మిర్చి సగానికిపైగా దెబ్బతినడంతో పాటు మిగిలిన పైరులో మరిపురుగు, నల్లి సోకి మిర్చి, బొబ్బర, మానుమచ్చ, కుళ్లు తెగుళ్లు సోకి పొగాకు తోటలు వాడుముఖం పట్టాయి. వాటిని ఏలా కాపాడుకోవాలో అర్థంకాక రైతులు అల్లాడుతున్నారు. శనగ, పొగాకు సాగు చేసే పొలాలు బీళ్ళను తలపించే రీతిలో గడ్డితో నిండిపోయాయి. గడ్డి సేద్యానికి తగ్గేదికాదని గుర్తించి మందులు పిచికారీ చేస్తున్నారు. కొండపి, జరుగుమల్లి, టంగుటూరు మండలాల్లో మొక్కలు నీటిపాలు కాగా ప్రస్తుతం తిరిగి బురదేతలు వేస్తున్నారు. అధికశాతం పొలం గడ్డిపడి బీడుళ్లా ఉండటంతో డ్రోన్లతో గడ్డి నివారణ మందు చల్లుతున్నారు. శనగ సాగుకు దున్ని ఉంచిన పొలాల్లో ఇంకా నీరు ఉండటంతో ఆ పంట సాగు తీవ్ర జాప్యం కానుంది. 

తొలగించి మరో పైరు వేయాల్సిందే

మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో పొగాకు మినుము, మిర్చి పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో పొగాకు ఇడుపులు వేస్తుండగా మిర్చి రైతులు ఏమి చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, యద్దనపూడి, చీరాల ప్రాంతంలో పరిశీలిస్తే ముదురు మిర్చి 70 శాతంపైగా దెబ్బతినగా దానిని తొలగించి మరొక పైరు వేయకతప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైట్‌బర్లీ ఉరకెత్తిపోయింది. ఇంకొల్లు మండలంలో మొక్కజొన్న, కారంచేడు ప్రాంతంలో వరి దెబ్బతినగా చినగంజాం ప్రాంతంలో ఉప్పు సాగు జాప్యం కానుంది. చీరాల, వేటపాలెం, కొమ్మమూరు ఆయకట్టులో వరిపైరు నేలవాలింది. అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో మినుము, ఉల్లి పూర్తిగా దెబ్బతినగా పత్తి కూడా తుడిచిపెట్టుకు పోయింది. మిర్చి, వరి పంటలకు భారీనష్టం వాటిల్లగా మినుము మొలకలెత్తగా ఉల్లి కుళ్ళిపోయింది. కొన్ని పంటలను కోయడం అనవసరంగా భావించి గొర్రెలు మేపుకొనేందుకు ఇచ్చేస్తున్నారు.


కందిని పీకేసిన రైతులు 

కోయవారిపాలెంలో 200 ఎకరాల్లో దెబ్బతిన్న పంట

 

కొండపి : అతివృష్టి కారణంగా మండలంలోని పెట్లూరు గ్రామ పంచాయతీలోని కోయవారిపాలెంలో 200 ఎకరాల్లో కంది పంట దెబ్బతింది. దీంతో పంటను రైతులు పీకేశారు. నాలుగు నెలల క్రితం కంది వేయగా పూతమీద ఉన్న సమయంలో భారీ వర్షాలకు పైరులో నీరు నిలిచి కుళ్లి ఎండిపోయిందని రైతులు తెలిపారు. ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి పెట్టామని వివరించారు. రైతు వంకాయలపాటి వెంకయ్య మాట్లాడుతూ తాను ఆరెకరాల్లో కంది వేయగా మూడు ఎకరాల్లో దెబ్బతిందని తెలిపారు. రెండు రోజుల నుంచి కందిని పీకేశామని తెలిపారు. గ్రామంలో 200ఎకరాల్లో కంది పంట కుళ్లి ఎండిపోయిందన్నారు. అధికారులు విచారించి కంది పంటను పరిశీలించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. 


మినుము, వరి తుడిచి పెట్టుకుపోయాయి 

ఏడు ఎకరాల్లో మినుము సాగు చేశా. ఎకరాకు 4 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుందనుకున్నా. పంట కోసి పొలంలో ఉన్న సమయంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురిశాయి. కుప్పల నుంచి మొలకలు వచ్చి పనికి రాకుండా పోయింది. ఇక  4 ఎకరాల్లో వరి సాగు చేయగా కోతదశకు చేరిన పంట వర్షాలకు నేలవాలి మొలక వచ్చింది. రూ. 4 లక్షలపైనే నష్టపోయా.

- కోట శ్రీనివాసరావు, మినుము రైతు, శ్రీనివాసనగర్‌, అద్దంకి మండలం 


ఉల్లి కుళ్లిపోయింది

మూడు ఎకరాల్లో ఉల్లి సాగుచేశా. ఎకరాకు రూ.50వేల వరకూ పెట్టుబడి పెట్టా. పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం పీకుతున్నాం. అత్యధిక భాగం పాయలు కుళ్లిపోయి ఉన్నాయి. చేతికి వచ్చిన కొద్ది ఉల్లిపాయలనైనా అమ్ముకుందామన్న ఆశతో కూలీల చేత పీకిస్తున్నాం.

-దూళిపాళ్ల హనుమంతరావు, ఉల్లి రైతు, కొత్తపాలెం, బల్లికురవ మండలం


 

పొగాకు మొక్కలు పీకి వేశాం 

12 ఎకరాల్లో పొగాకు సాగు చేశా. వర్షాలకు 10 ఎకరాల పంట తీవ్రంగా దెబ్బతిని పోయింది. రూ. 2.50 లక్షలు పెట్టుబడులు పెట్టా. ఈ సంవత్సరం పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. 

- ఆవుల వెంకారెడ్డి, ఇనమనమెళ్లూరు 


మిర్చికి తెగుళ్లు, వర్షంతో తీవ్ర నష్టం

ఈ ఏడాది మిర్చికి ప్రారంభం నుంచి తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది. ఎకరాకు సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టాం. వరుస వర్షాలకు తెగుళ్లు మరింత ఉధృతమయ్యాయి. దీనికితోడు పొలాల్లో నీరు నిలిచి మొక్కలు ఎండిపోయాయి.  ఇక మిర్చి తొలగించటం మినహా చేయగలిగింది ఏమీ లేదు. నేను నాలుగు ఎకరాలకు రూ.4లక్షలు ఖర్చు చేయగా రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. 

- షేక్‌ మహబూబ్‌ సుభాని, మిర్చి రైతు, కొప్పరం, సంతమాగులూరు మండలం

 

శ్రీనివాసనగర్‌ వద్ద కోయకుండా వదిలివేసిన మినుము చేలో మేస్తున్న గొర్రెలు


కందుకూరు ప్రాంతంలో పీకేస్తున్న పొగాకు మడులు


Advertisement
Advertisement