Abn logo
May 23 2020 @ 00:00AM

లాక్‌డౌన్‌లో ‘ఆమె’ వెతలు!

కరోనా కాటేసిన బతుకులు ఎన్నో... ఈ మహమ్మారి వల్ల అనేక వర్గాల ప్రజలూ తీవ్ర అవస్థలు పడ్డారు... పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ క్లిష్టసమయంలో రోజూ కూలీపని చేసుకునే మహిళల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అసోమ్‌కు చెందిన ఒక ఎన్జీవో అలాంటి మహిళల అనుభవాలను ‘హర్‌ లాక్‌డౌన్‌ స్టోరీ’ పేరిట పుస్తకరూపంలోకి తీసుకొచ్చింది. ఆ పుస్తకం నిండా ‘లాక్‌డౌన్‌’ సమయంలో చేయడానికి పనిలేక, చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డ అనేకమంది మహిళల వెతలు కన్నీళ్లు తెప్పిస్తాయి.


సులేమా... ఒక మధ్య వయస్కురాలైన తల్లి. జీవితంలో అన్ని ఆటుపోట్లను ఎదుర్కొంది. యుక్త వయసులోనే ఆమె భర్తను కోల్పోయింది. అత్తింటివాళ్లు సులేమా బిడ్డను తీసుకుని, ఆమెను బయటకు గెంటేశారు. ఆస్తిలో ఆమెకు చిల్లిగవ్వ కూడా దక్కకుండా చేశారు. మూడేళ్ల తన కొడుకును దక్కించుకొనేందుకు ఆమె న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు బిడ్డను దక్కించుకుందిగానీ ఆస్తిలో వాటా మాత్రం రాబట్టుకోలేకపోయింది. ‘‘బతకడానికి ఆమె తేజ్‌పూర్‌లోని ఒక సంపన్న కుటుంబంలో పనిమనిషిగా చేరింది’’ అని సామాజిక కార్యకర్త ఆస్మా ఖాటున్‌ అన్నారు. ‘లాక్‌డౌన్‌’ మొదలైనప్పటి నుంచి సులేమాను ఆస్మా గమనిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల సులేమాకు పనికి వెళ్లడానికి కుదరడం లేదు. దాంతో ఆమెకు జీతం రావట్లేదు. సులేమా గత మూడేళ్లుగా ఒకే ఇంట్లో పనిచేస్తోంది. ప్రస్తుతం పని చేయడం లేదు కాబట్టి వారు జీతం ఇవ్వట్లేదు. దాంతో బిడ్డకు తిండి పెట్టలేక ఆమె ఇబ్బందులు పడుతోంది. 


రెండు నెలల్లో.. 200 మంది అనుభవాలు..

అసోమ్‌కు చెందిన స్త్రీవాద ఆర్గనైజేషన్‌ ‘విమెన్స్‌ లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’ (డబ్ల్యూఎల్‌టీసీ) మహిళల సమస్యలపైనే కాకుండా ట్రాన్స్‌సెక్సువల్స్‌ కోసం కూడా పనిచేస్తుంది. అందులో పనిచేస్తున్న ఆస్మా ఖాటున్‌ మిగతా 35 మంది సహ కార్యకర్తలతో కలసి సుమారు 200 మంది మహిళల జీవితాలు ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. వారి అనుభవాలతో ఇటీవల ‘హర్‌ లాక్‌డౌన్‌ స్టోరీ’ పేరిట పుస్తకం తీసుకొచ్చారు. అందులో సులేమా ‘డస్ట్‌ స్టార్మ్‌’ అనుభవంతో పాటు అనేక మంది వెతలకు అక్షరరూపం ఇచ్చారు. సులేమా తను పనిచేసే యజమాని ఇంటికి వెళ్తూ మధ్యలో తన కథను చెప్పింది. ‘‘వాళ్లు డబ్బులివ్వగానే కూరగాయలు, గుడ్లు, పప్పులు వంటివి కొనుక్కోవచ్చని మనసులోనే ఒక లిస్టు కూడా తయారుచేసుకుంది. కానీ ఆమె సుదీర్ఘ నిరీక్షణ ఫలించలేదు. యజమానులు ఆమెకు జీతం ఇవ్వడానికి నిరాకరించారు’’... సులేమా కథ ఇలా సాగుతుంది. ఇలాంటి 200 అనుభవాలను పుస్తకంలో డాక్యుమెంట్‌ చేశారు. 


ఆలోచన ఎలా వచ్చిందంటే...

లాక్‌డౌన్‌ సమయంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న అనేక మంది మహిళలు ‘డబ్ల్యూఎల్‌టీసీ’కి ఫోన్‌ చేసి సహాయాన్ని కోరేవారు. వారి సమస్యలు విన్న తర్వాత, వారి వెతలకు అక్షరరూపం ఇవ్వాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ‘‘లాక్‌డౌన్‌లో చాలామంది మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకునేందుకు మాకు ఫోన్లు చేసేవారు. వాటి సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో బ్రిటన్‌లో సైంటిస్టుగా ఉన్న శ్రీజాత పుస్తకం వేయాలనే ఐడియా ఇచ్చారు’’ అని ‘డబ్ల్యూఎల్‌టీసీ’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బానా మల్లికా చౌధురి అన్నారు. 
 ‘హర్‌ లాక్‌డౌన్‌ స్టోరీ’ పుస్తకాన్ని బ్రిటన్‌కు చెందిన శ్రీజాత గుప్తా రచించి, బొమ్మలు వేస్తే, మల్లికా చౌధురి ఎడిట్‌ చేశారు. పనిమనుషులకు జీతం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, యజమానులు లెక్కచేయడం లేదు. వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుందని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement