ప్రభుత్వ భూమిపై కన్నేశారు..!?

ABN , First Publish Date - 2021-10-06T05:46:19+05:30 IST

మైదుకూరు మండలం నంద్యాలంపేట రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబరు 840లో 69.50 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.

ప్రభుత్వ భూమిపై కన్నేశారు..!?
కబ్జాకు యత్నించిన మైదుకూరు మండలం నంద్యాలంపేటలో ప్రభుత్వ భూమి ఇదే

నంద్యాలంపేటలో టీజీపీ ముంపు బాధితులకు 69.50 ఎకరాలు కేటాయింపు

రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదు

రాజకీయ అండతో ఆక్రమణకు యత్నం

ఎక్స్‌కవేటర్లతో చదును చేస్తుండగా.. 

అడ్డుకున్న జాండ్లవరం గ్రామస్తులు

ఆక్రమణదారులపై చర్యలు శూన్యం


(కడప-ఆంధ్రజ్యోతి): రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అవి. అధికార పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధి అండతో ఆక్రమణకు సై అన్నారు. ఏకంగా ఎక్స్‌కవేటర్ల ద్వారా పెద్దపెద్ద చెట్లు, ముళ్ల పొదలు తొలగించి చదును చేశారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు చదును చేస్తూ.. కబ్జాకు ప్రయత్నిస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆక్రమణను సమీప గ్రామస్తులు అడ్డుకోవడంతో భూ భాగోతం వెలుగులోకి వచ్చింది. అసైన్మెంట్‌ కమిటీ ఆమోదం తీసుకొని ప(ట్టా)క్కాగా సొంతం చేసుకోవడానికి తెర వెనుక యత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

మైదుకూరు మండలం నంద్యాలంపేట రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబరు 840లో 69.50 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. రికార్డుల్లో ఏడబ్ల్యూ ప్రభుత్వ భూములుగా నమోదు చేశారు. ఇవి మైదుకూరు-బద్వేలు ప్రధాన రహదారి టోల్‌గేట్‌ ఆనుకొని ఉన్నాయి. వీటికి ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది. ఎకరం రూ.5 లక్షలకు పైగా పలుకుతోందని సమీప గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన వాటి విలువ రూ.3.50 కోట్లు పైమాటే. అధికార పార్టీకి చెందిన ఖాజీపేట మండలానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల కన్ను ఆ భూములపై పడింది. ఏకంగా ఎక్స్‌కవేటర్ల ద్వారా చదును చేసి కబ్జాకు ప్రయత్నించారు. ఖాజీపేట మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొందరి ద్వారా భూ దందాకు తెర తీశారు. రోడ్డు పక్కనే ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు యంత్రాలతో సుమారుగా నెల రోజులు పాటు చదును చేస్తుంటే అటుగా వెళ్తున్న ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.


జాండ్లవరం గ్రామస్తులు అడ్డుకోవడంతో

తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బ్రహ్మంసాగర్‌ జలాశయం నిర్మాణంలో సాగు భూములు, ఊళ్లు కోల్పోయిన బాధితుల కోసం ఈ భూములు కేటాయించారని స్థానికులు అంటున్నారు. అక్కడ ఎవరిని అడిగిన టీజీపీకి చెందిన భూములేనని పేర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా బాధితులకు మాత్రం పంపిణీ చేయలేదు. కారణం అధికారులకే ఎరుక. అయితే.. రెవెన్యూ రికార్డుల్లో ఏడబ్ల్యూ ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. పశువుల మేపు కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను కళ్లముందే రంగాపురం గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ అండదండలతో ఎక్స్‌కవేటర్ల ద్వారా చదును చేసి ఆక్రమణకు బరితెగిస్తుంటే.. సమీప గ్రామానికి చెందిన జాండ్లవరం గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. తమ గ్రామంలోని పేదలకు పట్టాలు ఇవ్వండి.. లేదా కబ్జాకు గురికాకుండా కాపాడండని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కొందరు దాదాపు 30 ఎకరాలు ఆక్రమించుకొని పండ్ల తోటలు సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భూములకు పక్కనే సర్వే నంబరు 854/3లో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పేదలే సాగు చేసుకుంటున్నారు. వివాదంగా మారడంతో 2.50 ఎకరాల్లో ఇది ప్రభుత్వ భూమి.. ఎవరైనా ఆక్రమించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. అయితే.. 69.50 ఎకరాల్లో ఎలాంటి బోర్డులు పెట్టకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.


అసైన్మెంట్‌ కమిటీ ఆమోదంతో..!

కబ్జాకు యత్నించిన 69.50 ఎకరాలను అసైన్మెంట్‌ కమిటీ ఆమోదంతో ప(ట్టా)క్కాగా సొంతం చేసుకోవడానికి తెరవెనుక యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కమిటీ సమావేశం నిర్వహించి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్య ప్రజాప్రతినిధి హామీ ఇచ్చారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బినామీల పేరుతో పట్టాలు తీసుకొని స్వాధీనానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారనే ఆరోపణలు లేకపోలేదు. అయితే.. అసైన్మెంట్‌ కమిటీ నిబంధనల మేరకు సమీప పల్లెల్లో సెంటు పొలం లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నిరుపేద వ్యవసాయ కూలీలకు సాగు పట్టాలు ఇవ్వాలని, అందులో ఎస్సీ, ఎస్టీలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ రెవెన్యూ అధికారి పేర్కొనడం కొసమెరుపు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంరిక్షించాలని పలువురు కోరుతున్నారు. 


నోటీసు బోర్డు పెట్టాం

- హేమంతకుమార్‌, తహశీల్దారు, మైదుకూరు

నంద్యాలంపేట రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబరు 840లో 69.50 ఎకరాల ప్రభుత్వ ఏడబ్ల్యూ భూమి ఉంది. ఇటీవల కొందరు ఎక్స్‌కవేటర్ల ద్వారా చదును చేస్తున్నారని తెలిసింది. వెంటనే అడ్డుకున్నాం. ఆ భూముల్లో నోటీస్‌ బోర్డు పెట్టాం. ఇప్పటికే కొందరు 30 ఎకరాలు అక్రమించుకొని మామిడి వంటి పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. వారికి నోటీసులు జారీ చేశాం. ఒక్క సెంటు ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం. ఆ భూములను తెలుగుగంగ ప్రాజెక్టు ముంపు బాధితులకు కేటాయించినట్లు రెవెన్యూ రికార్డుల్లో లేదు.

 

Updated Date - 2021-10-06T05:46:19+05:30 IST