జిల్లాకు టీకా వచ్చేసింది

ABN , First Publish Date - 2021-04-14T06:31:44+05:30 IST

జిల్లాకు కరోనా వ్యాక్సిన్‌ (టీకా) వచ్చేసింది. మంగళవారం తెల్లవారుజామున 25 వేల డోసుల కొవిషీల్డ్‌ మాత్రమే ఒంగోలు చేరింది.

జిల్లాకు టీకా వచ్చేసింది


25వేల డోసుల కొవిషీల్డ్‌  సిద్ధం

మరో 25వేల డోసులు వచ్చే అవకాశం

కొవాగ్జిన్‌పై  స్పష్టత కరువు

నేడు జిల్లావ్యాప్తంగా టీకాలు ప్రారంభం

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 13 : జిల్లాకు కరోనా వ్యాక్సిన్‌ (టీకా) వచ్చేసింది. మంగళవారం తెల్లవారుజామున 25 వేల డోసుల కొవిషీల్డ్‌ మాత్రమే ఒంగోలు చేరింది. దీన్ని  వైద్యారోగ్యశాఖాధికారులు అన్ని ప్రాంతాలకూ తరలించారు. టీకా ఉత్సవ్‌ ప్రారంభం రోజున వాక్సిన్‌ వేసిన అధికార యంత్రాంగం ఆ మరుసటిరోజు లేకపోవడంతో పూర్తిగా  ప్రక్రియను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంనకు టీకాలు పంపగా, అక్కడి నుంచి జిల్లాలకు తరలించారు. జిల్లాకు వచ్చిన 25వేల డోసులను అన్ని పీహెచ్‌సీలకు పంపారు. 


కొవాగ్జిన్‌పై అయోమయం

జిల్లాకు మంగళవారం రాత్రికి మరో 25వేల డోసులు రానుంది. అయితే ఆ టీకా కూడా కొవిషీల్డ్‌ వస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు మాత్రం కొవాగ్జిన్‌ పంపాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. అయితే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఎక్కువగా కొవిషీల్డ్‌ను మాత్రమే సరఫరా చేయడంతో కొవాగ్జిన్‌ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. వైద్య ఆరోగ్యశాఖాధికారులు మాత్రం  సెకండ్‌ డోసు వేయాల్సి ఉన్నందున కొవ్యాగ్జిన్‌ తప్పకుండా వస్తుందని చెప్తున్నారు.


నేడు జిల్లా వ్యాప్తంగా టీకాలు

జిల్లావ్యాప్తంగా బుధవారం టీకా ప్రక్రియను ప్రారంభించనున్నారు. సోమ, మంగళవారాలు పూర్తిగా వ్యాక్సినే షన్‌ నిలిచిపోవడంతో బుధవారం నుంచి ప్రారంభించాలని ఇప్పటికే వైద్యాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు అవసరమైన మేరకు టీకాలు పంపామని, అందువల్ల పీహెచ్‌సీలు, సచివాలయాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ టీకా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైద్యాధికారులు, మండలాధికారులతో ప్రత్యేక సమావే శాలు నిర్వహించారు. 

Updated Date - 2021-04-14T06:31:44+05:30 IST