Teen kills self: లోదుస్తుల దొంగతనం..టీనేజర్ ఆత్మహత్య!

ABN , First Publish Date - 2021-07-12T20:10:28+05:30 IST

లోదుస్తులు దొంగిలిస్తూ దొరికిపోయిన ఓ టీనేజర్ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Teen kills self: లోదుస్తుల దొంగతనం..టీనేజర్ ఆత్మహత్య!

భోపాల్: లోదుస్తులు దొంగిలిస్తూ దొరికిపోయిన ఓ టీనేజర్ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ నగరంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు టీనేజర్ ఆ రోజు రాత్రి తమ ఇంట్లో లోదుస్తులు దొంగతనం చేస్తుండటాన్ని భార్యాభర్తలు గమనించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ టీనేజ్ కుర్రాడు వారి నుంచి తప్పించుకుని అదే ప్రాంతంలో ఉండే తన అన్న ఇంట్లోకి పారిపోయాడు. అతడినే వెంబడిస్తూ వచ్చిన ఆ దంపతులు బాలుడు మళ్లీ పారిపోకుండా ఆ ఇంటికి బయట నుంచి గడియ వేసేశారు. అనంతరం.. అతడి సోదరుడికి సమాచారం ఇవ్వడంతో పాటూ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. 


అయితే.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు తీసేసరికి అతడు ఉరిపోసుకుని కనిపించాడు. దీంతో.. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆ దంపతులపై సెక్షన్ 306 కింద (ఆత్మహత్యకు పురిగొల్పారనే అభియోగం) కేసు నమోదు చేశారు. కొంత కాలం పాటు తన అన్న ఇంట్లో నివసించేందుకు ఆ టీనేజర్ నగరానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. కాగా.. ఇలాంటి కేసు బనాయించడమంటే వేధింపులపాలు చేయటమేనని, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారని దంపతుల తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-07-12T20:10:28+05:30 IST