డబుల్ ఇంజన్ ప్రభుత్వం నిర్వాకం ఇది: తేజస్వి

ABN , First Publish Date - 2022-01-02T20:28:53+05:30 IST

నీతి ఆయోగ్ పేదరిక సూచీ ర్యాంకింగ్‌లో బీహార్ అట్టడుగున ఉండటంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను రాష్ట్రీయ జనతా దళ్..

డబుల్ ఇంజన్ ప్రభుత్వం నిర్వాకం ఇది: తేజస్వి

పాట్నా: నీతి ఆయోగ్ పేదరిక సూచీ ర్యాంకింగ్‌లో బీహార్ అట్టడుగున ఉండటంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుపట్టారు. ఇందుకు రాష్ట్రంలోని 'డబుల్ ఇంజన్' ప్రభుత్వమే కారణమని అన్నారు. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం తదితర రంగాల్లో బీహార్ దిగువ స్థాయిలో ఉండటానికి బాధ్యులు ఎవరు? ముఖ్యమంత్రి డబుల్ ఇంజన్ ప్రభుత్వానిది కాదా? అని మీడియాతో మాట్లాడుతూ తేజస్వి ప్రశ్నించారు. ప్రభుత్వం కాకపోతే ఇంకెవరు సమాధానమిస్తారని నిలదీశారు. రాష్ట్రంలోని 40 మంది ఎంపీలకు 40 మంది వాళ్లే ఉన్నారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి ఉండి కూడా నీతి ఆయోగ్ పేదరిక సూచీ ర్యాంకింగ్ దారుణంగా ఉంటడానికి కారణం ఏమిటో జవాబు ఇచ్చేదెవరని ఆయన నిలదీశారు.


''19 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నేను మరోసారి గుర్తుచేస్తున్నాను. ప్రజలు ఇప్పటికే వరదలు, కరవుకాటకాలు, ధరల భారంతో సతమతమవుతున్నారు. ఇప్పటికైనా వారికి వాగ్దానం చేసినట్టు 19 లక్షల ఉద్యోగాలు కల్పించండి. ప్రతి ఏడాది ఇలా నిలదీస్తూ పోలేను. కనీసం ఈ ఒక్క ఏడాది అయినా మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వండి చాలు'' అని నితీష్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ పేదరిక సూచీ జాబితాలో బీహార్, అసోం, ఝార్ఖండ్ రాష్ట్రాలు చివరి స్థానంలో నిలిచాయి. బీహార్‌లో బీజేపీ మిత్రపక్షం జేడీయూ అధికారంలో ఉంది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఆధారంగా నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లు ప్రకటించింది.

Updated Date - 2022-01-02T20:28:53+05:30 IST