సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-01-16T06:50:55+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధమైంది.

సర్వం సిద్ధం
‘గాంధీ’లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఎంఈ డాక్టర్‌ రమే్‌షరెడ్డి, కలెక్టర్‌ శ్వేతామహంతి

నేడు 34 కేంద్రాల్లో టీకాలు

మొదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో..  

పారిశుధ్య కార్మికులు, నర్సులు, వైద్యులకు టీకాలు

గాంధీ, నార్సింగ్‌ పీహెచ్‌సీలో టీకా వేసుకున్న వారితో మాట్లాడనున్న ప్రధాని మోదీ  


కరోనాపై కదనంలో అత్యంత కీలక ఘట్టం అయిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు నగరం సిద్ధమైంది.  34 సెంటర్లలో విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. పదినెలలుగా పీడిస్తున్న కరోనా నుంచి విముక్తి ప్రసాదించగలదని భావిస్తున్న వ్యాక్సినేషన్‌ తొలి అడుగుతో కలిసి  అడుగులు వేస్తున్న వారికి ఇవి అత్యంత ఉద్విగ్నభరిత క్షణాలు. తీసుకుంటున్న వారికీ.. ఇస్తున్న వారికీ కూడా.. 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి రోజు 1,020 మందికి టీకాలు వేయనున్నారు. గ్రేటర్‌ పరిధిలో 34 కేంద్రాలను వ్యాక్సిన్‌ చేయడానికి ఎంపిక చేశారు. గాంధీ ఆస్పత్రి, నార్సింగ్‌ పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ వేసుకున్న వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేరుగా  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. తొలిరోజు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రులు,  యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో టీకాలు వేయనున్నారు. సోమవారం నుంచి మిగతా ప్రభుత్వ, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీ ఆస్పత్రుల్లో వేయనున్నారు. ఆ తర్వాత ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులలో వేయనున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 9, మేడ్చల్‌ జిల్లాలో 11 వ్యాక్సినేషన్‌ కేంద్రాలలో టీకాలు వేయనున్నారు. ఉదయం 10.30 నుంచి టీకాలు ప్రారంభించనున్నట్లు హైదరాబాద్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి తెలిపారు.

వివిధ దశలలో గ్రేటర్‌ పరిధిలో మొత్తం 1,19,319 మందికి టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో 78,236 మందికి వ్యాక్సినేషన్‌ చేస్తారు. 187 వ్యాక్సిన్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. ఇందులో 112 ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు కాగా, 78 ప్రైవేట్‌ ఆస్పత్రులను గుర్తించారు.  రంగారెడ్డి జిల్లా పరిధిలో 26,078 మందికి టీకాలు వేయనున్నారు. మేడ్చల్‌ జిల్లాలో 14,700 మందిని టీకా వేయడానికి ఎంపిక చేశారు. జిల్లాలో 59 కేంద్రాలను వ్యాక్సిన్‌ కోసం ఎంపిక చేయగా, మొదటి రోజు 11 కేంద్రాలలో వ్యాక్సిన్‌ ప్రారంభించనున్నారు. కాగా, మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆసుప్రతిలో ఏర్పాట్లను  వెద్యులతో కలిసి తూర్పుమండలం డీసీపీ రమేష్‌ పరిశీలించారు. 

 

టీకాలు ఇచ్చే కేంద్రాలు ఇవే...

గాంధీ, నిమ్స్‌, చెస్ట్‌, ఉస్మానియా, సరోజనీదేవి కంటి, ప్రభుత్వ ఈఎన్‌టీ, కింగ్‌కోఠి జిల్లా  ఆస్పత్రులు. గోల్కొండ, మలక్‌పేట, నాంపల్లి,  కొండాపూర్‌,  వనస్థలిపురం ఏరియా ఆస్పత్రులు. అమాన్‌నగర్‌, డాక్టర్‌ పాల్‌దాస్‌,  సురాజ్‌బాన్‌, తిలక్‌నగర్‌, అల్వాల్‌, మల్లాపూర్‌, నార్సింగ్‌, హఫీజ్‌పేట అమన్‌గల్‌ యూపీహెచ్‌సీలు, బాలానగర్‌, కుషాయిగూడ, మల్కాజిగిరి, నారాపల్లి, షాపూర్‌నగర్‌, ఉప్పల్‌, కీసర, వెంకటరెడ్డిగర్‌, శామీర్‌పేట, మైలార్‌దేవ్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్‌, షాద్‌నగర్‌ పీహెచ్‌సీలు.  



Updated Date - 2021-01-16T06:50:55+05:30 IST