Abn logo
Sep 25 2021 @ 00:39AM

ఏసీబీ వలలో టెక్కలి తహసీల్దార్‌

ఏసీబీకి చిక్కిన టెక్కలి తహసీల్దార్‌ నాగభూషణరావు

- పొజిషన్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.5లక్షలు డిమాండ్‌ 

- అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితుడు

- రూ.4లక్షలతో చిక్కిన వైనం

- రెండోసారి పట్టుబడిన నాగభూషణరావు

టెక్కలి/టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 24 : టెక్కలి తహసీల్దార్‌ బి.నాగభూషణరావు శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. పొజిషన్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.5 లక్షలు డిమాండ్‌ చేయగా... బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆయనను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్‌.ఎస్‌.వి.రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టెక్కలి మండలం గూడెం పంచాయతీకి చెందిన గుజ్జు వెంకటరెడ్డి మాస్టారు స్థానిక జిల్లా పరిషత్‌ రోడ్డులో ఓ భవనాన్ని నిర్మించారు. ఇటీవల ఆక్రమణల తొలగింపులో భాగంగా తహసీల్దార్‌ నాగభూషణరావు ఈ భవనంపై కన్నేశారు. పొజిషన్‌ సర్టిఫికెట్‌ లేని కారణంగా.. ఈ భవనంలో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పడంతో రెడ్డి మాస్టారు కంగుతిన్నారు. ఈ క్రమంలో ఓ ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధి మధ్యవర్తిత్వం వహించగా.. పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి తహశీల్దార్‌ అంగీకరించారు. దీని కోసం తహసీల్దార్‌ రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.4లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా తహసీల్దార్‌ను పట్టుకునేలా పథకం రచించాడు. వారు ఇచ్చిన సూచన మేరకు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తొలుసూరుపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న తహసీల్దార్‌ ఇంటికి రెడ్డి మాస్టారు వెళ్లారు. తహసీల్దార్‌కు రూ.4 లక్షలు అందజేశారు. అదే సమయంలో అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ను పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా నాలుగు నెలల కిందటే టెక్కలి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన నాగభూషణరావు ఆక్రమణల తొలగింపు పేరిట పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన టెక్కలి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో ఎన్టీఆర్‌ కాలనీలో పట్టాల జారీలో తప్పిదాలకు పాల్పడడంతో ఏసీబీ అధికారులు ఆయన కోసం గాలించారు. నాగభూషణరావు తెలివిగా అక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయారు. 2010లో పాతపట్నంలో రెవెన్యూ ఇన్సెపెక్టర్‌గా ఉన్న సమయంలోనే ఓ వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా రెండోసారి ఏసీబీకి చిక్కారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల తరువాత సైతం ఏసీబీ అధికారులు ఆయనను విచారణ చేస్తూనే ఉన్నారు. పట్టుబడిన నగదు కాకుండా మరికొంత నగదును గుర్తించారు. విచారణ అనంతరం తహసీల్దార్‌ను విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ బి.వి.ఎస్‌.ఎస్‌.వి. రమణమూర్తి తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐ హరి, ఎస్‌ఐ చిన్నంనాయుడు, సత్యారావు, సిబ్బంది పాల్గొన్నారు.