సామినేనిని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

ABN , First Publish Date - 2021-07-10T05:30:00+05:30 IST

పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు..

సామినేనిని అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

పులిచింతల సందర్శనకు నిరాకరణ 8 బుగ్గ మాధవరం వద్ద అడ్డగింత

కృష్ణాలో బోటులో వెళ్లిన ఎమ్మెల్యే 

తెలంగాణ పోలీసుల తీరుపై ధ్వజం


జగ్గయ్యపేట రూరల్‌: పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభానును ఆదివారం తెలంగాణా సరిహద్దు సూర్యాపేట జిల్లా బుగ్గమాధవరం వద్ద తెలంగాణా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ అనుమతితోనే ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరామని ఉదయభాను చెప్పినప్పటికీ పర్యటనకు అనుమతులు లేవని ఆయనను వెనక్కు పంపారు. ఈ సందర్భంగా ఉదయభాను విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం జల విద్యుత్‌ కోసం అక్రమంగా నీటిని వాడుకుంటున్న నేపథ్యంలో కృష్ణాడెల్టా రైతులకు నష్టం జరుగుతున్నందున క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్న తనను అడ్డగించటం బాధాకరమన్నారు. అనంతరం ఆయన జగ్గయ్యపేట మండలం ముక్త్యాల నుంచి కృష్ణానదిలో పడవ మీదుగా గుంటూరుజిల్లా మాదిపాడు నుంచి పులిచింతలకు వెళ్లారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ జలవిధానంలో తాగు, సాగు, జల విద్యుత్‌ ఉన్నాయని, మొదటి రెండింటి తరువాతనే జలవిద్యుత్‌కు వినియోగించుకోవాల్సినప్పటికీ జల విద్యుత్‌కు నీటిని వినియోగిస్తున్నదని ఆరోపించారు. ఒక టీఎంసీ నీటిని 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని ఆరుతడి పంటలకైతే 20 వేల ఎకరాలకు అందుతుందని గత కొద్ది రోజులుగా తెలంగాణా ప్రభుత్వం జల విద్యుత్‌ కోసం 7.5 టీఎంసీల నీటిని వృధాగా సముద్రం పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తికి అక్రమంగా నీటిని వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.


తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ఇరు రాష్ర్టాలు స్నేహపూర్వకంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరుతున్నా తెలంగాణా మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, రాజశేఖర్‌రెడ్డి గురించి అసభ్యంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. సరిహద్దులోని ప్రాజెక్టును చూసే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. ఆయనతో పాటు తన్నీరు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పులిచింతల పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతో తెలంగాణాకు చెందిన పోలీసులు వందల సంఖ్యలో ఆంధ్ర-తెలంగాణా సరిహద్దు బుగ్గమాధవరం, ప్రాజెక్టు వద్ద మోహరించారు. ప్రాజెక్టును సందర్శించేందుకు వీల్లేదని ఖరాఖండిగా చెప్పటంతో ఏపీ పోలీసులు అప్రమత్తమై ఆయనను కృష్ణానది మీదుగా ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లి తిరిగి మండలంలోని ముక్త్యాలకు చేర్చారు. ఇబ్బంది లేకుండా కార్యక్రమం ముగియటంతో ఊపిరి పీల్చుకున్నారు. సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌లు ఆయన వెంట ఉన్నారు.


Updated Date - 2021-07-10T05:30:00+05:30 IST