Abn logo
Sep 26 2021 @ 00:56AM

వీరవనితల పునీత తెలంగాణ

తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో రైతాంగ పోరాట ప్రతీకలు చోదకశక్తిగా పనిచేశాయి. ఐలమ్మ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయం. అదేవిధంగా, మహోజ్వలమైన సాయుధ పోరులో పాల్గొన్న వీరవనితల చరిత్రను విద్యా ప్రణాళిక, పోటీ పరీక్షల సిలబస్‌లో చేర్చే విషయాన్ని కూడ పరిశీలించాలి. పోరాటకారుల అనుభవాల గ్రంథం ‘మనకు తెలియని మన చరిత్రను’ సామాజిక, భాషా శాస్త్రాల ప్రణాళికలో ఒక పేపర్‌గా చేర్చాలి.


దొరలకు, నిజాం రజాకార్ల రాచరికానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధపోరాటం మానవ ఇతిహాసంలో మహోజ్వల ఘట్టం. వెట్టిచాకిరి విముక్తి కోసం, దున్నేవారికే భూమిపై హక్కు కోసం ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం, జీవించే హక్కు కోసం కొనసాగిన ఏకైక పోరాటమది. అందులో ఎంతోమంది వీరవనితలు పాల్గొన్నారు. కిరాతక భూస్వాములు, నిజాం, పటేల్ సైన్యాలను ఎదిరిస్తూ, వారి దౌర్జన్యాలకు బలిగాకుండా మహిళలు చూపిన దీక్ష, ప్రతిఘటన అసమానమైనవి. పోరాటపు తొలినాళ్లలో గెరిల్లాలకు అన్నం పెట్టడం, ఆశ్రయమిచ్చి కాపాడుకోవడానికి పరిమితమయిన స్త్రీలు తమ పాత్రను మరింతగా విస్తరించుకుని తుపాకులకు ఎదురునిలిచి నిర్భయంగా నడిచారు. తర్వాతి దశలో స్త్రీలు మరింత చైతన్యం కనపరచి, పట్టుపట్టి సాయుధదళాల్లో చేరారు.


పుట్టినగడ్డ కోసం, అన్నం పెట్టే భూమిని నిలుపుకోవడం కోసం రైతులు జరిపిన పోరాటపు తొలిదశ చిహ్నం, అగ్నికణిక చాకలి ఐలమ్మ. ఇంటినే పోరాట కేంద్రంగా, మార్చి, కుటుంబాన్ని మొత్తంగా పార్టీకి అంకితం చేసి, గుండాలతో ప్రత్యక్షంగా తలపడి తాను పండించిన పంటను ఇంటికి చేర్చుకున్న ఐలమ్మ సాహసం ఒక గొప్పనైన ఉత్తేజభరిత ఘట్టం. దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి మెడలు వంచిన ధీర ఐలమ్మ. కొడుకులపై అక్రమ కేసులు బనాయిం చినా, కూతుళ్లపై అఘాయిత్యాలు జరిగినా వెరవకుండా, పోరుదారిని వీడకుండా కొనసాగి, మహిళలు వెల్లువలా ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో ఐలమ్మ పాత్ర చిరస్మరణీయమైనది.


జనగామ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కడవెండి నాయకుడు ఎర్రమరెడ్డి మోహన్ రెడ్డిని అరెస్టు చేయించినప్పుడు ఆయనను విడిపించడం కోసం కడవెండి గ్రామంలో తొలి మహిళా దళం ఏర్పాటయింది. నల్లా వజ్రమ్మ, ఎన్నమ్మ, గోపమ్మ, శేరమ్మ, సుశీల లతో కూడిన ఈ దళం రాళ్లతో దాడి చేసి తమ నాయకుడిని విడిపించుకుంది. ఆ తర్వాత కూడ పలు సందర్భాలాలో నిజాం సైన్యాన్ని నిలువరించి గ్రామాల్లోకి రాకుండా చేసింది.


నల్లమల అటవీ ప్రాంతంలో రంగమ్మ దళం చురుకుగా పని చేసింది. ఆ దళ పర్యవేక్షణలో నల్ల నర్సింహ, ముఖ్దమ్‌ మోహిద్దున్, రాజా బహదూర్ గౌడ్ కొంతకాలం పనిచేశారు. ఆదిలాబాద్ అడవి ప్రాంతంలో ఆదివాసీ మహిళ వెంకటమ్మ దళం పని చేసి అనేక గ్రామాలను దొరల నుండి విముక్తి చేసింది. మానుకోట ప్రాంతంలో షార్ప్‌ షూటర్‌గా పేరు పొందిన నాగమ్మ దళం మెరుపుదాడులు చేసి శత్రువుల నుంచి అనేక ఆయుధాలను చేజిక్కించుకుంది.


వైద్యంలో కొంత శిక్షణ తీసుకుని అనేక దళాలతో తిరుగుతూ పోరాటవీరులకు చికిత్స చేసిన అపర ధన్వంతరి అచ్చమాంబ, బద్దం ఎల్లారెడ్డి, నల్లా నర్సింహ దళాలతో పనిచేసి అనేక రజాకార్ల క్యాంపులపై దాడులు చేసిన దూడల సాలమ్మ, ఎర్రగొల్లపహాడ్‌లో పోలీసులను తరిమికొట్టి పదిమంది గెరిల్లాలను కాపాడుకున్న పుట్నాల రామక్క, మైదాన ప్రాంత ఉద్యమాల్లో తమ ప్రజల భాషలో వాడి వేడి ఉపన్యాసాలిస్తూ రైతాంగ ఉద్యమాన్ని విస్తరించిన మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలమ్మ, ప్రియంవదలు పార్టీ బాధ్యతలకు ఇబ్బంది కలుగకూడదని తన పసికందును ఆదివాసీలకు ఇచ్చిన మానుకోట కమలమ్మ, ఉద్యమం నుంచి తన భర్త వెనక్కుపోయినా తను మాత్రం కొనసాగి పెద్ద మహిళా దళాన్ని నడిపించిన రాములమ్మ, దేశముఖ్ కుటుంబం నుంచి వచ్చి పూర్తిస్థాయి ఉద్యమనేతగా మారిన సూర్యాపేట లలితమ్మ, దాడులు, ఆత్మరక్షణలో స్త్రీలకు సైనిక శిక్షణ ఇచ్చిన మోటూరి ఉదయం, పార్టీ వలంటీర్లకు ప్రథమచికిత్స, మంత్రసాని శిక్షణ ఇచ్చిన డా.కొమర్రాజు అచ్చమాంబ, హైదరాబాద్ నగరంలో రజాకార్ వ్యతిరేక దళాలను నిర్మించిన బ్రిజ్ రాణి, ప్రమీల, రజియా లాంటి వందలాది స్త్రీల త్యాగం, ధైర్యసాహసాలు తలచుకుంటే అణువణువు పులకరిస్తుంది. ఉద్యమంలో రోజురోజుకు పెరుగుతున్న స్త్రీల భాగస్వామ్యం, వెన్నెముకగా నిలుస్తున్న వారి సాహసాన్ని దెబ్బతీయాలని నిజాం, దొరల గుండాలు స్త్రీలపై కనీవినీ ఎరగని అఘాయిత్యాలకు ఒడిగట్టారు. అనేక కిరాతక చర్యలకు పాల్పడ్డారు. అయినా వెనకడుగు వేయక మహిళలు మొక్కవోని దీక్షతో పోరులో కొనసాగారు.


తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో రైతాంగ పోరాట ప్రతీకలు చోదకశక్తిగా పనిచేశాయి. ఐలమ్మ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయం. అదేవిధంగా, మహోజ్వలమైన సాయుధ పోరులో పాల్గొన్న వీరవనితల చరిత్రను విద్యా ప్రణాళిక, పోటీ పరీక్షల సిలబస్‌లో చేర్చే విషయాన్ని కూడ పరిశీలించాలి. ప్రొఫెసర్ రమా మేల్కొటే, వసంత, లలితల బృందం వెలువరించిన పోరాటకారుల అనుభవాల గ్రంథం ‘మనకు తెలియని మన చరిత్రను’ ఒక పేపర్‌గా సామాజిక, భాషా శాస్త్రాల ప్రణాళికలో చేర్చాలి. తెలుగు అకాడమీ, సాహిత్య అకాడమీలు ప్రత్యేక శ్రద్ధ వహించి పోరాటంలో పాల్గొన్న స్త్రీల చరిత్రను ప్రచురించాలి. తెలంగాణ ప్రభుత్వం సాయుధ పోరాట స్మృతి కేంద్రాలను, తరతరాలకు స్ఫూర్తి కలిగించే విధంగా నిర్మించాలి. 


అస్నాల శ్రీనివాస్ 

(నేడు చాకలి ఐలమ్మ 126వ జయంతి)