తెలంగాణ ఆత్మగీతం పైలం సంతోష్‌

ABN , First Publish Date - 2020-11-24T05:38:13+05:30 IST

తెలంగాణ నేల పాటల పుట్టినిల్లు. తనను విముక్తురాలిని చేసుకోవటం కోసం, తన బిడ్డల్ని చెరనుంచి విడిపించటం కోసం పాటను ఆయుధంగా...

తెలంగాణ ఆత్మగీతం పైలం సంతోష్‌

తెలంగాణ నేల పాటల పుట్టినిల్లు. తనను విముక్తురాలిని చేసుకోవటం కోసం, తన బిడ్డల్ని చెరనుంచి విడిపించటం కోసం పాటను ఆయుధంగా ధరించిన సాయుధురాలు. పాటను కష్టాలకోర్చి అమ్మలా ఆదరించింది. పాటలై పోటెత్తేలా చేసింది. అలా విముక్తురాలైన తీరు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ పరంపరలో వేలాది కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు ఎదిగివచ్చారు. వారిలో ప్రత్యేకమైన కలం, గొంతు పైలం సంతోష్‌. అతడి అసలు పేరు ఆదూరి బ్రహ్మయ్య. ఆదూరి వెంకయ్య, బంగారమ్మ దంపతుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ సంతానంగా జూన్‌ 12, 1970న ప్రస్తుత సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో జన్మించాడు. ఉద్యమ ప్రస్థానంలో బలమైన గొంతుగా నిలిచిన చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామం వెలిదండ కావడం మూలాన చిన్నతనం నుంచి అనేక ఉద్యమాల్లో తండ్రి ఆదూరి చిన వెంకయ్య, అన్న ఆదూరి పెదకోటయ్య దారిలో నడిచాడు. పాటలతో, నాటకాలతో, ఉద్యమాల్లో కొనసాగుతూ ఎదగడం పైలం సంతోష్‌ ప్రత్యేకత. వేలాది సభలు సమావేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రజలకి చేరువై అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. మా తరంలో పాటే తన ఇంటిపేరుగా, ఉద్యమమే తన పేరుగా ఎదిగివచ్చిన అరుదైన వాగ్గేయకారుడు అతడు. సారా వ్యతిరేకత పోరాటంలో పాల్గొన్నాడు. కూలీ రేట్లు పెంచాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, దున్నేవాడికే భూమి దక్కాలని, కుల వివక్ష రూపుమాసిపో వాలని నినదిస్తూ అనేక ప్రదర్శనలిచ్చాడు.


తెలుగు నేలమీద దళిత, బహుజన, ప్రజాపోరాటాలు ఉవ్వెత్తున ఎగియడానికి కారంచేడు, చుండూరు ఘటనలు బలమైన కారణాలయ్యాయి. ఈ దుర్ఘటనలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు పైలం సంతోష్‌ పాట, గొంతు బలంగా నిలిచాయి. ‘‘చుండూరు గ్రామాన జరిగెనె గోరము ఓయమ్మలారా మాయమ్మలారా’’ పాటతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మొత్తం తిరుగుతూ ప్రతి గడపకు ఉద్యమావశ్యకతను పరిచయం చేసి గళమెత్తిన కళాకారుడు పైలం సంతోష్‌. ఓ వైపు దళిత, ప్రజా ఉద్యమాల్లో నిర్విరామంగా కొనసాగుతూనే ప్రత్యేక తెలంగాణ మలిదశ పోరాటం తొలినాళ్ళ నుంచి అతడి పాట విరామం ఎరుగకుండా కొనసాగింది. లక్షలాది సభల్లో, దూంధాంల్లో, సమావేశాల్లో ‘‘ఉండు పైలంగుడు అమ్మా మాయమ్మ ఇల్లు పైలం సూడు తల్లి మాయమ్మా’’ పాట ప్రత్యేకమైన జనాకర్షణ గల పాటగా నిలిచింది. ఈ పాట లేకుండా ఏ సభను ఊహించలేం. తెలంగాణ రైతుల, ప్రజల ఈతిబాధల్ని పల్లెపల్లెకు గడపగడపకు వినిపించి తట్టిలేపిన పాటగాడిగా చరిత్రలో నిలిచిపోయి, వందలాది పాటలకు తన సన్నని జీర గొంతుతో జీవం పోసిన ‘నల్లనల్లని కోయిల’ పైలం సంతోష్‌. బెరా, గూడ అంజయ్య, గద్దర్‌, మిత్ర, కోదాడ శ్రీనివాస్‌ మొదలైన కవుల పాటలెన్నో అతడి స్వరంలో మెరిసి ప్రజలకు చేరువయ్యాయి.


పాటకు నాటకీయతను జోడించి అభినయిస్తూ పాడి ఆడే ‘‘ఆట–పాట–మాట’’ కలగలిసిన అరుదైన కళాకారుడు పైలం సంతోష్‌. అతడు పాటతో ఏడిపించి, భుజాల మీద ఎత్తుకుని ఓదార్చి, గుండెలకత్తుకుని మనోధైర్యమిచ్చి, చేయిపట్టి జెండెత్తి జై కొట్టించే పాటల చలనం. చరణం, పసందైన పల్లవి అతడి విశిష్టత. కన్నీళ్లను సైతం రగిలించి కడదాక బతకాలనే యివురాన్ని నూరిపోసిన గొంతు అతడిది. 


రెండు దశాబ్దాలకు పైగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు విమలక్క, పైలం సంతోష్‌ రెండు కళ్లలా వ్యవహరించారు. ఇద్దరూ తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని పాటద్వారా ఉర్రూతలూగించిన ప్రత్యామ్నాయ శక్తులుగా నిలిచారు. 


పైలం సంతోష్‌ మృదుస్వభావి, స్నేహశీలి, నిరంతర చదువరి. పాటతో మొలకెత్తడం, పాటను అల్లుకొని కొనసాగడం ఉద్యమం నేర్పిన పాఠాలని ప్రకటించుకున్న కవిగాయకుడు. ఉద్యమ కుటుంబంలో జన్మించి ఉద్యమంలో జీవించి, ఉద్యమానికి పాటతో కడదాక ఊపిరిలూది పాటతో మమేకం చెందిన ప్రజావాగ్గేయకారుడు పైలం సంతోష్‌ పాట తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం.

డప్పోల్ల రమేష్‌ 

Updated Date - 2020-11-24T05:38:13+05:30 IST