కరోనాతో తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-18T13:36:54+05:30 IST

ఫిబ్రవరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆరు రోజులపాటు ఇంట్లోనే చికిత్స తీసుకున్నప్పటికీ

కరోనాతో తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత కన్నుమూత

హైదరాబాద్/రాంగోపాల్‌పేట్‌ : బీజేపీ సీనియర్‌ నేత, పార్టీ రాష్ట్ర సహకోశాధికారి, మాజీ కార్పొరేటర్‌ భవర్‌లాల్‌వర్మ(63) శనివారం తుది శ్వాస వదిలారు. ఫిబ్రవరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆరు రోజులపాటు ఇంట్లోనే చికిత్స తీసుకున్నప్పటికీ వైరస్‌ ప్రభావం తగ్గలేదు. దీంతో 49 రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. శరీరంలో కరోనా తగ్గిపోయినా వైరస్‌ వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన ఇన్‌ఫెక్షన్‌ తగ్గలేదు. దీంతో ఆస్పత్రి వర్గాలు ఆయనకు ఎక్మో వెంటిలేటర్‌ సహాయంతో ఇన్ని రోజులు చికిత్స అందించారు. శనివారం ఉదయం8 గంటల ప్రాంతంలో ఆయనకు కార్డియాక్‌ అరెస్ట్‌ అవడం వల్ల కన్నుమూశారు. ఆయనకు భార్య రామ్‌కన్యావర్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని రంగ్రేజ్‌ బజార్‌లోని స్వగృహానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాంగోపాల్‌పేట్‌ కార్పొరేటర్‌ చీర సుచిత్ర, మోండా కార్పొరేటర్‌ కొంతం దీపిక, నాయకులు అతెల్లి శ్రీనివా్‌సగౌడ్‌, చీర శ్రీకాంత్‌, జంపన ప్రతాప్‌, వెంకట రమణి, రవిప్రసాద్‌ గౌడ్‌లతో పాటు పలువురు నగర నాయకులు వచ్చి నివాళులర్పించారు. బవర్‌లాల్‌ వర్మ వైద్య చికిత్సలకు భారీగా ఖర్చయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.


బీజేపీతో అనుబంధం

1977 సంవత్సరంలో జనతా పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భవర్‌లాల్‌ వర్మ 1980లో బీజేపీ ఆవిర్బావం నుంచి ఆ పార్టీలో చేశారు. 2002 జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో హిస్సాంగంజ్‌ మోండా డివిజన్‌ నుంచి పోటీచేసి తీగుళ్ల పద్మారావు గౌడ్‌పై ఓడిపోయారు. 2005లో జరిగిన హిస్సాంగంజ్‌ మోండా ఉప ఎన్నికల్లో భవర్‌లాల్‌ వర్మ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2018లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ సనత్‌నగర్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా, నగర ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు, రాష్ట్ర లింగ్విస్టిక్‌ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా పదవులు చేపట్టి ప్రస్తుతం రాష్ట్ర సహా కోశాధికారిగా ఉన్నారు.


ఆత్మీయుడిని కోల్పోయా: దత్తాత్రేయ

35 ఏళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేసిన ఆత్మీయుడు భవర్‌లాల్‌వర్మాను కోల్పోవడం తీవ్రబాధను మిగిల్చిందని హెచ్‌పీ గవర్నర్‌ దత్తాత్రేయ సంతాప సందేశాన్ని పంపించారు. 


పార్టీకి తీరని లోటు : కిషన్‌ రెడ్డి

ఎల్లవేళలా పార్టీ, కార్యకర్తలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే వ్యక్తి భవర్‌లాల్‌ వర్మ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా, అర్ధరాత్రయినా వారిని ఆదుకునేవాడు. అలాంటి వ్యక్తి అందరినీ వదిలి వెళ్లడం దురదృష్టకరమని, ఆయన మృతి పార్టీకి కార్యకర్తలకు తీరని లోటని అన్నారు.


పరామర్శించిన మంత్రి తలసాని 

వర్మ మరణ వార్త విన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆయన ఇంటికి వెళ్లి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్మ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలిపారు.

Updated Date - 2021-04-18T13:36:54+05:30 IST