Abn logo
Sep 19 2021 @ 04:08AM

రిత్విక్‌.. ఇక గ్రాండ్‌మాస్టర్‌

  • జీఎం హోదా అందుకున్న 70వ భారత ఆటగాడిగా తెలంగాణ కెరటం 

న్యూఢిల్లీ: చదరంగ క్రీడలో మరో తెలంగాణ ఆటగాడు మెరిశాడు. వరంగల్‌కు చెందిన 17 ఏళ్ల రాజా రిత్విక్‌ చెస్‌లో ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్‌ మాస్టర్‌  (జీఎం) హోదాను అందుకున్నాడు.  హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన వెజర్‌కెప్జో గ్రాండ్‌ మాస్టర్‌ చెస్‌ టోర్నీలో అతను 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లతో ఈ ఘనతను దక్కించుకున్నాడు. దీంతో రిత్విక్‌.. భారత్‌ తరఫున జీఎం సాధించిన 70వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ టోర్నీకి ముందు 2496 పాయింట్లతో ఉన్న రిత్విక్‌.. నాలుగు రౌండ్లలో ఐదు ఎలో రేటింగ్స్‌తో నిర్దేశించిన 2500 మార్క్‌ను చేరుకున్నాడు. నాలుగో రౌండ్‌లో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారుడు ఫినెక్‌ వాక్లావ్‌పై రిత్విక్‌ 57 ఎత్తుల్లో గెలిచాడు. కాగా, ఈనెల ఆరంభంలో బుడాపె్‌స్ట వేదికగానే జరిగిన ఫస్ట్‌ శాటర్‌డే గ్రాండ్‌ మాస్టర్‌ రౌండ్‌ రాబిన్‌ టోర్నీలో రిత్విక్‌ మూడో జీఎం నార్మ్‌ సాధించాడు. ఈ టోర్నీలో మొత్తం 9 రౌండ్లలో 5 గేమ్‌లు నెగ్గిన అతను.. 4 గేమ్‌లను డ్రాగా ముగించాడు. దీంతో మొత్తం 7 పాయింట్లు సాధించాడు. 2019లో తొలి జీఎం నార్మ్‌ అందుకున్న రిత్విక్‌.. ఈ ఏడాది ఆగస్టులో రెండో జీఎం నార్మ్‌ను దక్కించుకున్నాడు. మరో ఇరవై రోజుల్లోనే ఆఖరి నార్మ్‌ను సొంతం చేసుకొని గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. ‘జీఎం టైటిల్‌ కోసం చాలా కష్టపడ్డా. చివరకు ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది.  వరల్డ్‌ చాంపియన్‌ కావడమే నా ముందున్న లక్ష్యం’ అని రిత్విక్‌ తెలిపాడు. రిత్విక్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో 12వ తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల క్రితం సెర్బియా టోర్నీలో ప్రదర్శనతో మూడో ఐఎం నార్మ్‌ సాధించి పిన్న వయసులో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా నిలిచిన తెలంగాణ ఆటగాడిగా రిత్విక్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.