తెలంగాణ ద్రోహి కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-10-23T06:12:47+05:30 IST

తెలంగాణ ద్రోహి కేసీఆర్‌ అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు.

తెలంగాణ ద్రోహి కేసీఆర్‌
ఇల్లందకుంట మండలం బూజూనూర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

 - సొమ్ము కేంద్రానివి సోకు కేసీఆర్‌ది

- మంత్రిగా కాదు కనీసం మనిషిగా గుర్తించు అని అడిగినా

- మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

ఇల్లందకుంట, అక్టోబరు 22: తెలంగాణ ద్రోహి కేసీఆర్‌ అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని బూజూనూర్‌, వంతడుపుల, మర్రివానిపల్లె, సీతంపేట, బోగంపాడు, పాతర్లపల్లి, సిరిసేడు గ్రామాల్లో కేంద్ర మంత్రికిషన్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కేసీఆర్‌ పంపించిన బానిసలు మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని, మీ భరతం పడుతానన్నారు. ఈ నెల 30తర్వాత అసెంబ్లీలో కనపడేది నా ముఖమే, అప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు కేసీఆర్‌ అని విరుచకపడ్డారు. మంత్రిగా గుర్తించకపోయినా పర్వాలేదు కనీసం మనిషిగానైనా గుర్తించమని అడిగినా, నీ అడుగులకు మడుగులు ఓత్తెతోడు ఈటల రాజేందర్‌ కాదన్నారు. పదవుల కోసం పెదవులు మూయలే అన్నారు. నాపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నావు కదా నేను తడిబట్ట కట్టుకొని పోచమ్మ గుడిలో సోత్తా దళితబంధు ఆపలేదని, నీవు సిద్దమా అని ప్రశ్నించారు. దళితులకు రూ. 10లక్షలు ఇస్తున్నావంటే మొదట సంతోషించేది ఈటల అని గుర్తించుకోమన్నారు. నేను గెలిచినంక నా మొదటి యుద్ధం దళితబంధు అందరికీ అందేలా చేయడమే అన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి సొమ్ము కేంద్రానిది సోకు మాత్రం కేసీఆర్‌ది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నీ సీఎం పదవి మీ తాత, తండ్రి ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల ఓట్లతో నీకు పదవి వచ్చిందన్నారు. ప్రజల కోసం మంత్రి పదవి వదులుకొని, ప్రజల పక్షాన పోరాడుతున్న ఈటల రాజేందర్‌ను ఓడించడం నీతరం కాదన్నారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నేతలు తాగి వచ్చి బూతులు తిడుతూ వారికి ఓట్లు వేయాలని అంటున్నారని, వంతడుపుల గ్రామానికి చెందిన ఓ దళిత మహిళ తనతో చెప్పుకుందని పేర్కొన్నారు. 2023లో తెలంగాణలో ఎగిరే జెండా కాషాయ జెండా అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నేను గెలిస్తే ప్రజల గౌరవం నిలబడుతుందని, అది గుర్తుంచుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ, మాందాడి సత్యనారాయణరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, గోపాల్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ జ్యోత్స్న, సర్పంచ్‌ శ్రీలత, మహిపాల్‌యాదవ్‌, రుమాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:12:47+05:30 IST