Abn logo
Aug 31 2021 @ 10:51AM

దసరా సెలవుల కుదింపు..?

హాస్టళ్లు ఓపెన్.. గురుకులాలతోపాటు వర్సిటీ వసతి గృహాలు కూడా

ఇంటర్‌, ఆపై విద్యా సంస్థల్లో ఐసొలేషన్‌ గదులు

టీకా వేయించుకుంటేనే ‘ఉన్నత’ క్లాసుల్లోకి.. 

టీకా వేయించుకోని విద్యార్థులను అనుమతించవద్దు

ఈ ఏడాది 166 రోజులు స్కూళ్ల నిర్వహణ!

దసరా వంటి సెలవులను కుదించాలనే యోచన

నేడు పారిశుధ్య పనులు పూర్తి కావాల్సిందే

సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

రోజూ స్కూల్‌ బస్సులు శానిటైజ్‌ చేయాలి

జిల్లా స్థాయి అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు

విద్యా సంస్థల ప్రారంభంపై ప్రత్యేక భేటీలో నిర్ణయం

ఆహార భద్రత అలవెన్సు వెంటనే చెల్లించండి

వంట గదులు నిర్మించకుంటే నిధులిచ్చేయండి

తెలంగాణ సర్కారుకు కేంద్రం హెచ్చరిక


హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యా సంస్థలతోపాటు బుధవారం నుంచి వాటిలోని హాస్టళ్లు కూడా తెరుచుకోనున్నాయి. గురుకులాలతోపాటు విశ్వవిద్యాలయాల్లోని హాస్టళ్లను కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్థల పునః ప్రారంభంపై మంత్రి సబిత ఆధ్వర్యంలో వర్చువల్‌గా సోమవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. విద్యా సంస్థల్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. రాష్ట్రంలో గురుకులాల్లోనే కాకుండా వివిధ యూనివర్సిటీల పరిధిలో కూడా హాస్టళ్లు ఉన్న విషయం తెలిసిందే. విద్యా సంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో హాస్టళ్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు వైస్‌ చాన్సలర్లు సమావేశంలో ప్రస్తావించారు. దానికి స్పందనగా.. హాస్టళ్లను తెరుచుకోవచ్చని విద్యా శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా స్పష్టం చేశారు. ఆయా యూనివర్సిటీల వెసులుబాటు మేరకు వాటిని ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చని ఆయన చెప్పారు. ఇంటర్‌ స్థాయి నుంచి ఎగువ తరగతుల విద్యా సంస్థల్లో కచ్చితంగా ఐసొలేషన్‌ గదులను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు మంత్రి, ఇతర అధికారులు స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఐసొలేషన్‌ గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. రెండు నుంచి ఐదు గదులను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జ్వరం, జలుబు వంటి కొవిడ్‌ లక్షణాలు కలిగిన విద్యార్థులను వీటిలోకి పంపించాలని తెలిపారు.


టీకా వేయించుకుంటేనే..

డిగ్రీ, ఆపై విద్యా సంస్థల్లోకి టీకా వేయించుకున్న విద్యార్థులనే క్లాసులకు అనుమతించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు అన్ని విద్యా సంస్థలకు ఉన్నత విద్యా మండలి అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ టీకా వేయించుకోని విద్యార్థులు ఉంటే.. వారికి దగ్గరలోని టీకా కేంద్రంలో వేయించాలని నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీకా వేయించుకోని విద్యార్థులను అనుమతించవద్దని స్పష్టం చేశారు.


166 రోజులపాటు పాఠశాలలు

ఈసారి పాఠశాలల్లో విద్యా సంవత్సరాన్ని సుమారు 166 రోజులపాటు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కాలపట్టికను రూపొందిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది పాఠశాలలను 166 రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా అయితే అకడమిక్‌ ఇయర్‌ను 240 రోజులపాటు నిర్వహించాల్సి ఉంటుంది. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది పాఠశాలల ప్రారంభం ఆలస్యం కావడంతో ఆ మేరకు కొన్ని రోజులను కుదించారు. అలాగే.. దసరా వంటి పండుగ సెలవులను కుదించనున్నారు.


విద్యార్థులపై ఒత్తిడి వద్దు

కేజీ నుంచి పీజీ వరకు క్లాసులకు హాజరయ్యే విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని సమావేశం నిర్దేశించింది. ఇష్టమైన వారే పాఠశాలలకు, కాలేజీలకు వస్తారని, రాని వారి గురించి ఆలోచించవద్దని చెప్పారు. హాజరు అంశాన్ని పెద్దగా పట్టించుకోవద్దని సూచించారు. తల్లిదండ్రుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా చిన్నారులు పాఠశాలలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలని కోరారు. కాగా, బుధవారం నుంచి విద్యా సంస్థలను తెరుస్తున్న నేపథ్యంలో, కొవిడ్‌ నిబంధనలతోపాటు ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని పునరుద్ఘాటిస్తూ పాఠశాల విద్య కమిషనర్‌ సోమవారం రాత్రి మెమో జారీ చేశారు. 


1 నుంచి స్వచ్ఛతా పక్షోత్సవాలు

సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రంలో స్వచ్ఛతా పక్షోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పక్షోత్సవాలకు సంబంధించి ఏయే రోజు ఏయే పనులు చేయాలనే విషయంలో డీఈవోలకు సూచనలు చేశారు. మొదటి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులతో స్వచ్ఛతా శపథం చేయాల్సి ఉంటుంది. రెండో రోజు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, చేతులు కడగడం, మాస్క్‌లను ధరించడం, సామాజిక దూరం పాటించడం, శుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి. తరగతి గదులతో పాటు ఆవరణలను పరిశుభ్రంగా ఉంచడానికి వీలుగా పెయింటింగ్‌, వ్యాసరచన వంటి పోటీలను నిర్వహించాలి.


నేటి సాయంత్రంలోగా పారిశుద్ధ్య పనులు పూర్తి కావాలి.. సహకరించని వారిపై కఠిన చర్యలే

పాఠశాలలను శుభ్రపరిచే విషయంలో సహకరించని వారి వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సబిత ప్రకటించారు. మంగళవారం సాయంత్రంలోగా పారిశుద్ధ్య పనులు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాల పునరుద్ధరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ఇందుకు స్థానిక సిబ్బంది సహకరించడం లేదని కొంతమంది డీఈవోలు తెలిపారు. తమకు సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత హెచ్చరించారు. పాఠశాలల ప్రారంభానికి ఒక్కరోజే మిగిలి ఉందని, పలు చోట్ల పనులు పూర్తి కాలేదని తమ దృష్టికి వచ్చిందని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, విద్యా సంస్థల్లో విద్యార్థులకు శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, మాస్క్‌ పె ట్టుకునేలా చూడాలని నిర్దేశించారు. వైరల్‌ వ్యాధు ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలపై కూడా దృష్టి పెట్టాలని, వాటిలో కూడా కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.