విద్యా సంస్థల సెలవులు పొడిగింపా?.. ప్రారంభమా?

ABN , First Publish Date - 2022-01-29T14:06:51+05:30 IST

రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 నుంచి తెరవాలా లేక సెలవులను మరికొంత కాలం పొడిగించాలా? అనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యా సంస్థల సెలవులు పొడిగింపా?.. ప్రారంభమా?

రేపటితో ముగియనున్న విద్యా సంస్థల సెలవులు

కొవిడ్‌ వ్యాప్తి తీరుపై అంచనాతో నిర్ణయం

నేడు ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం


హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31 నుంచి తెరవాలా లేక సెలవులను మరికొంత కాలం పొడిగించాలా? అనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. దీనిపై శనివారం ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం 15 ఏళ్లు దాటినవారికి టీకా ఇస్తున్నారు. విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిలో చాలామంది టీకా పొందారు. జ్వర సర్వే కూడా పూర్తవడంతో కరోనా వ్యాప్తి తీరును ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ అంశాలన్నిటి ఆధారంగా సెలవులపై సర్కారు తుది నిర్ణయాన్ని వెలువరించే వీలుంది. 


ఒమైక్రాన్‌ తో కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి విద్యా సంస్థలను మూసివేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి 16 దాకా  సంక్రాంతి పండుగ సెలవులు ఇచ్చారు. తర్వాత ఈ నెల 30 వరకు పొడిగించారు. కాగా, ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు  నిర్వహిస్తున్నారు. అయితే, ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థలు తెరవాలంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల నుంచి ఒత్తిడి వస్తున్నది. ఇక పాఠశాలల ప్రారంభంపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై ఆసక్తి నెలకొంది.


తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ఇప్పటికే ఇంటర్‌, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే సెలవులు కొనసాగుతుండడంతో పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని చెప్పలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-29T14:06:51+05:30 IST