తెలంగాణ అక్కున చేర్చుకుంది

ABN , First Publish Date - 2021-06-21T09:15:58+05:30 IST

తాను భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టినప్పుడు..

తెలంగాణ అక్కున చేర్చుకుంది

  • తల్లిదండ్రులవోలె ఆదరించి, ఆశీర్వదించింది.. 
  • హైదరాబాదీ ఆతిథ్యానికి అద్దం పట్టింది
  • తెలుగు ప్రజలకు వందనం.. తీర్చలేనిది ఈ రుణం
  • భావోద్వేగానికి గురైన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ
  • 10 రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, చాంద్రాయణగుట్ట, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): తాను భారత  ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టినప్పుడు.. తన తల్లిదండ్రులు జీవించి ఉంటే ఎంత సంతోషించేవారో అనుకున్నానని, కానీ వారం రోజుల పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన.. పర్యటన ముగించుకుని ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. గత పదిరోజులుగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోనే బస చేసిన ఆయన.. ఢిల్లీకి బయల్దేరే ముందు ‘తెలుగు ప్రజలకు వందనం.. తీర్చలేనిది ఈ రుణం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నన్నుగన్న తల్లిదండ్రుల వోలె, నన్ను పసిబిడ్డ మాదిరి అక్కునజేర్చుకుని అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు. నా జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాలలో ఈ పర్యటన ఒకటి’’ అంటూ తేట తెలుగులో తన మనసులో భావాలను అక్షర రూపంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి మొదలుకొని అతి సాధారణ పౌరుడి వరకూ ప్రతి ఒక్కరూ వ్యయప్రయాసలకోర్చి తనకు స్వాగతం పలికి.. ‘అంతా మనోళ్లే’ అన్న తెలంగాణ నైజానికీ, సుప్రసిద్ధ హైదరాబాదీ ఆతిథ్యానికీ అద్దం పట్టారని కొనియాడారు. తనకు అనూహ్య స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


యాదాద్రి.. ప్రశంసనీయం

దివ్యాతిదివ్యమైన దైవ దర్శనానికి  అతి తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం దేవస్థానాల పాలకమండళ్లకు, ప్రభుత్వ ప్రతినిధులకు, స్థానిక అధికారులకు తాను, తన సతీమణి  శివమాల సదా కృతజ్ఞులమని సీజేఐ తెలిపారు. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం  చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. తనను కంటికి రెప్పలా వారం రోజుల పాటు చూసుకున్న తెలంగాణ ప్రభుత్వం, రాజభవన్‌, హైకోర్టు, పోలీసు యంత్రాంగం సిబ్బందికి, పాత్రికేయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు  ప్రజల దీవెనలతో తన రాజ్యాంగబద్ధమైన విధులను సమర్థంగా నిర్వహించగలనన్న నమ్మకంతో తిరిగి వెళుతున్నానని ఆయన చెప్పారు. కొవిడ్‌ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని శాస్త్రవేత్తలు, ప్రభుత్వం నిర్ధారించేవరకూ దయచేసి తగు జాగ్రత్తలు పాటించాలని.. నిర్లక్ష్యం ఏ మాత్రం తగదని ప్రజలకు సూచించారు. కాగా.. లాల్‌దర్వాజ సింహవాహినీ శ్రీ మహంకాళీ ఆలయంలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు రావాల్సిందిగా సీజేఐ జస్టిస్‌ రమణను ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఉత్సవాల సమయంలో ఆలయాన్ని సందర్శిస్తానని ఆయన చెప్పారని.. ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్‌ వెల్లడించారు. 


తమ కోసం అడగలేదు..

కొవిడ్‌కు కూడా వెరవకుండా, వారించినా వినకుండా.. వారనకా వీరనకా అసంఖ్యాకంగా వచ్చి తమలో ఒకడిగా, ఆప్తుడిగా భావించి, తన వెన్ను తట్టి ఆశీర్వదించారని,  వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రామికులు, యువత, మహిళలు, రైతులు, సకల జీవన రంగాలకు చెందిన వారు..  కులమతాలకు అతీతంగా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా తనను పలకరించారని, దీవించారని ఆయన చెప్పారు. వారిలో ఎవరూ సొంత పనుల గురించి ప్రస్తావించలేదని.. వారు కోరిందల్లా న్యాయవ్యవస్థ పనితీరును పటిష్ఠం చేయాలని మాత్రమేనని తెలిపారు. వారంతా తెలంగాణ సమాజపు నిస్వార్థ గుణానికి, పరిణతికి ప్రతీకలని ప్రశంసించారు. వయోవృద్ధులైన విశ్రాంత న్యాయమూర్తులు తనను దీవించడానికి ఏడాదిన్నర తర్వాత గడపదాటి రావడం తనను కదిలించిందని, వారికి నమస్సులని జస్టిస్‌ రమణ భావోద్వేగం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-06-21T09:15:58+05:30 IST