లాక్‌డౌన్, కర్ఫ్యూ అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు సంతృప్తి

ABN , First Publish Date - 2021-05-17T19:38:52+05:30 IST

తెలంగాణలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై రాష్ట్ర హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది...

లాక్‌డౌన్, కర్ఫ్యూ అమలు తీరుపై తెలంగాణ హైకోర్టు సంతృప్తి

హైదరాబాద్ : తెలంగాణలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై రాష్ట్ర హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు కూడా హైకోర్టుకు వెళ్లారు. మొదట లాక్‌డౌన్, కరోనా నిబంధనల అమలుపై నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్‌‌పై 98 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాల ఏర్పాటు చేశాం. లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకున్నాం. ఈ నెల 01 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా మాస్కులు ధరించనందుకు 3,39,412 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.31కోట్ల రూపాయిలు జరిమానాలు విధించాం. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశాం. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు నమోదు చేశాంఅని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో డీజీపీ స్పష్టంగా వివరించారు.


ఇందుకు స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల పనితీరును అభినందించింది. పోలీసులు ఇదే విధంగా పని చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. కాగా.. లాక్‌డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో వీడియోగ్రఫీ తీసిన ఫుటేజ్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హైకోర్టుకు సమర్పించగా పై విధంగా హైకోర్టు స్పందించింది.

Updated Date - 2021-05-17T19:38:52+05:30 IST