Abn logo
Sep 1 2021 @ 11:57AM

కృష్ణా జలాల్లో యాభైశాతం ఇవ్వాల్సిందే..: రజత్‌కుమార్

హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ డిమాండ్ చేశారు. నీటి వివాదాల్లో నెలకొన్న అంశాలపై బుధవారం నిర్వహించబోయే సమావేశంలో తెలంగాణ తరుపున వాదనలు గట్టిగా వినిపిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ప్రశ్నిస్తామన్నారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై ముందు నుంచీ.. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్  ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమమని చెప్పారు. దీనిపై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ జనాభా పెరుగుతోందని.. అలాగే కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో పెద్ద పరిశ్రమలు స్థాపిస్తున్నారని తెలిపారు. నీటి వాటా కచ్చితంగా పెంచాలన్నారు. టేలిమెట్రీల విషయంలో కేఆర్ఎంబీ బాధ్యతా రాహిత్యంగా వ్యహరిస్తోందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పదే పదే బోర్డులకు లేఖలు రాసి వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.