Abn logo
Sep 25 2021 @ 23:45PM

రైతుబంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

సమావేశంలో మాట్లాడుతున్నఅసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

- పండించిన ప్రతి గింజనూ కొన్నాం..

- స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

జమ్మికుంట, సెప్టెంబర్‌ 25: దేశంలోనే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో రెడ్డి కులస్ధుల ఆత్మీయ సమ్మేళనానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తన్నీరు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌హజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, 36 వేల కోట్లు బ్యాంకులో రుణం తీసుకుని రైతంగానికి ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కరోనా సమయంలో రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసి, ఎనిమిది రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. వ్యవసాయానికి కొత్త పథకాలు ప్రవేశ పెట్టిన దేశాల గురించి ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారని, అందులో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 69.70లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నట్లు గుర్తించడం గొప్ప విషయం అన్నారు. ఇటీవల కొంతమంది ఎందుకో భయపడి కొడుకుల పేరు దగ్గర రెడ్డి అని పెట్టుకోవడం లేదని, గర్వంగా సాంప్రాదాయం నిలబెట్టే విధంగా పేరు దగ్గర రెడ్డి అని పెట్టుకోవాలన్నారు.  తాను ఇక్కడకు స్పీకర్‌గా రాలేదని, రెడ్డిగా అందరిని కలిసేందుకు వచ్చానని తెలిపారు. దేశంలో రైతు బందు, రైతు భీమా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు, ముఖ్యమంత్రి కేసిఆర్‌లు సంతకాలు పెట్టి రూ.36వేల కోట్లు బ్యాంకులో రుణం తీసుకోని  రైతంగానికి ఇచ్చిన ఘణ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కరోనా సమయంలో రైతు పండించిన ప్రతి గింజను మూడు సీజన్లలో కొనుగోలు చేసి, ఎనిమిది రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. వ్యవసాయానికి కొత్త పథకాలు ప్రవేశ పెట్టిన దేశాల గురించి ప్రపంచ వ్యాప్తాంగా సర్వే చేయడం జరిగిందని, అందులో దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 69.70లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నట్లు గురించడం గొప్ప విషయం అన్నారు. 

- 30 ఏళ్లు అయినా కాని ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేశారు

- విద్యా శాఖ మంత్రి సభితా ఇంధ్రారెడ్డి 

30 ఏళ్లు అయినా పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌  మూడేళ్లలో పూర్తి చేశారని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం కరెంట్‌ విషయంలో రైతులు ఏడ్చేవారని, ఆలాంటిది 24 గంటల ఉచిత విధ్యుత్‌ అందిస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి కేసీఆర్‌ అన్నారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలనే ఉద్దేశంతో 50 శాతం రిజర్వేషన్‌, నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు తీసుకు రావడం గొప్ప విషయం అన్నారు. అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడం సంతోషంగా ఉందన్నారు. 

- గుజరాత్‌లో ఉచిత కరెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదు 

- వ్యవశాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రైతులకు ఉచిత విద్యుత్‌ ఎందుకు ఇవ్వడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. స్వాతంత్ర వచ్చిన తర్వాత 70ఏళ్ల తర్వాత బేటీ బచావో, బేటీ పడావో నినాదం ఇచ్చారన్నారు. కాని 1950లోనే పాలమూరు బిడ్డా కొత్వాల్‌ వెంకట్రాంరెడ్డి హైద్రాబాద్‌ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకోని రెడ్డి హాస్టల్‌ ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాక ముందు బంగారం పండే భూములు ఉన్నా నీళ్లు, కరెంట్‌ లేక బీడులు వారి పోయేవని గుర్తు చేశారు. ప్రభుత్వాల సహకారం లేక రైతులు అడ్డా కూలీలుగా మారేవారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగు నీరు, 24 గంటల ఉచిత విద్యుత్‌తో వ్యవసాయ రంగం దశ తిరిగిందన్నారు. ఏడాదికి 10వేల కోట్లు భరించి 26.22 లక్షల వ్యవసాయ మోటర్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చే జూరాల ప్రాజెక్ట్‌ను 40 ఏళ్లు కట్టారని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మాత్రం మూడేళ్లలో కట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. 2001లో గెల్లు శ్రీనివాస్‌ గులాబీ కండువా భూజాన వేసుకుని ఉద్యమంలో కొట్లాడారని, 2003లో ఈటల రాజేందర్‌ పార్టీలోకి వచ్చారన్నారు. ఈటలకు స్థాయి, గుర్తింపు ఇచ్చింది కేసీఆర్‌ అన్నారు. కాషాయం జెండా కప్పుకోగానే కేసీఆర్‌ను దుర్భాషలు ఆడడం మంచిది కాదన్నారు. నేనే రాజు, నేనే మంత్రి అన్న విదంగా ఈటల రాజేందర్‌ వ్యవహార శైలి ఉంటుందన్నారు. 

- తెలంగాణలో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి 

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 

తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి రెడ్డి కార్పొరేషన్‌ ఉపయోగ పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం రైతు వేదికలు కట్టిస్తూ వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంటే, బీజేపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మోటర్ల వద్ద కరెంట్‌ ఎంత కాలుతుందో లెక్కలు తీస్తుందన్నారు. రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి పక్క జిల్లాలు, పక్క నియోజక వర్గాల నుంచి జనాన్ని తీసుకు వచ్చామని ఈటల రాజేందర్‌ మాట్లాడటం సరికాదన్నారు. బీర్లు, బిర్యానీ, డబ్బుల కోసం వచ్చారని ఈ ప్రాంత ప్రజలను అవమానిస్తున్నారన్నారు. కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఈటలను చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఈటల గుండెలు అదురుతున్నాయని తెలిపారు. బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ప్రజల ఖాతాల్లో జమ చేస్తామన్న 15లక్షలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. గెలిస్తే కనీసం వెయ్యి కోట్ల ప్యాకేజీ అయినా తీసుకువస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హుజూరాబాద్‌కు ఐదు వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానని మాట ఇస్తున్నానన్నారు. అన్ని వర్గాల్లో పేదలను కాపాడుకోవాలన్నది కేసీఆర్‌ ఆలోచన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, వొడితల సతీష్‌బాబు, దాసరి మనోహర్‌రెడ్డి, వినయ్‌ భాస్కర్‌, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమళ్ల విజయ, రాష్ట్ర నాయకులు పాడి కౌశిక్‌రెడ్డి, అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, తుమ్మేటి సమ్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.