రాయలసీమలో.. తెలంగాణ కిక్కు.. మందుకొంటున్న ఏపీ వాసులు

ABN , First Publish Date - 2020-08-10T17:31:55+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై 75 శాతం కొవిడ్‌ పన్ను విధించడం, అనుకున్న బ్రాండ్ల మద్యం లభించక పోవడంతో అక్కడి మద్యం ప్రియులు తెలంగాణలోని పక్క జిల్లా గద్వాలకు వచ్చి మం దు కొంటున్నారు.

రాయలసీమలో.. తెలంగాణ కిక్కు.. మందుకొంటున్న ఏపీ వాసులు

గద్వాల జిల్లాలోని మద్యం దుకాణాల్లో మందు కొంటున్న ఏపీ వాసులు

అక్కడ అధిక ధరలే కారణం

నిండుతున్న బార్డర్‌ దుకాణాల గల్లా పెట్టెలు


గద్వాల (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మద్యంపై 75 శాతం కొవిడ్‌ పన్ను విధించడం, అనుకున్న బ్రాండ్ల మద్యం లభించక పోవడంతో అక్కడి మద్యం ప్రియులు తెలంగాణలోని పక్క జిల్లా గద్వాలకు వచ్చి మం దు కొంటున్నారు. దుకాణాల సమీపంలో ఏర్పాటు చేసిన దాబాలు, ఆరుబటయ, పంట పొలాల్లో మద్యం తాగుతున్నారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో పలు విష యాలు వెలుగు చూశాయి. అలంపూర్‌ చౌరస్తాలో రెండు, అలంపూర్‌, శాంతినగర్‌, రాజోలీ, మానవపాడు మండలాల్లో ఒక్కోటి, ఇటిక్యాలలో రెండు, అయిజలో నాలుగు మద్యం దుకాణాలు ఉన్నాయి. మామూలుగా ఒక మద్యం దుకాణంలో రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల అమ్మకాలు సాగుతాయి. కానీ బార్డర్‌లో ఉన్న ఈ దుకాణాల్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. అలంపూర్‌ మండల కేంద్రంలో ఉన్న మద్యం దుకాణానికి ఎక్కువగా ఏపీలోని నందికోట్కూర్‌, బ్రహ్మణకొట్కూర్‌, పంచలింగాల, కోశాపురం, అలూరు, కోళ్లబాంపురం, పూడురు ప్రాంతాల నుంచి మందు కోసం వస్తున్నారు. అలంపూర్‌ చౌరస్తాకు కర్నూల్‌ సిటీకి చెందిన వారు ఎక్కువగా వస్తుంటారు. మద్యం కొనుగోలుకు రోజూ వెయ్యి మందికిపైగా వస్తారని అంచనా. ఆదివారం అయితే ఈ దుకాణాలు జాతరను తలపిస్తాయి.


అక్రమంగా రవాణా: రాజోలికి దక్షిణ ప్రాంతంలో ఉన్న కర్నూల్‌తో పాటు ఎమ్మినగూరు, పత్తి కొండ మంత్రాయలం నుంచి మందుబాబులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. అయిజకు నాగల్‌దిన్నె, ఎమ్మిగనూరు, మంత్రాలయం, గుండ్రేవుల ప్రాంతాల నుంచి వస్తారు. అయిజలో దాడులు జరుగుతుండటంతో చాలామంది నది పరివాహక ప్రాంతాలైన రాజాపురంచ, చిందనూరు, పులికల్‌, వేంసోంపురం బెల్ట్‌ షాపుల నుంచి మద్యం తీసుకెళ్తారు. 


దుకాణాదారులే దళారులు: సరుకు వస్తుందని తెలియగానే దుకాణదారులు కర్నూల్‌ జిల్లాతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారికి సమాచారం ఇస్తారు. వారు ఒకటి రెండు కాటన్లను అదనంగా కొని, ఏపీ వారు వచ్చినప్పుడు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు కమీషన్‌ తీసుకుని ఇస్తారని సమాచారం. పగలు మద్యం రవాణా కష్టంగా ఉండడంతో నదిమీదుగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఒక పెట్టెను పడవలో తుంగభద్ర నది దాటిస్తే జాలర్లు రూ.1500 తీసుకుంటున్నారు. 


భారీగా మద్యం పట్టివేత : జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టు వద్ద మే ఐదు నుంచి ఇప్పటి వరకు రూ.15 నుంచి రూ. 20 లక్షల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు కర్నూల్‌ ఎక్సైజ్‌ సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు. 

Updated Date - 2020-08-10T17:31:55+05:30 IST