ప్రధాని మోదీని బలోపేతం చేసేందుకే కేసీఆర్‌ డ్రామా

ABN , First Publish Date - 2022-09-11T08:56:03+05:30 IST

ప్రధాని మోదీని బలోపేతం చేసేందుకే కేసీఆర్‌ డ్రామా

ప్రధాని మోదీని బలోపేతం చేసేందుకే కేసీఆర్‌ డ్రామా

యూపీఏను బలహీనపరచడమే 

ఆయన ఎజెండా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కేంద్రం లో ప్రధాని మోదీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగానే సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల డ్రామా ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జాతీయ రాజకీయాల పేరుతో బీజేపీ మిత్ర, అనుకూల పక్షాల్లో ఏ ఒక్కరిని కలవని కేసీఆర్‌.. కాంగ్రె్‌సతో కలిసున్న వారిని మాత్రమే ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. యూపీఏను బలహీనపర్చి మోదీకి సహకరించడమే కేసీఆర్‌ ఎజెండా అని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి కార్యాచరణ కోసం గాంధీభవన్‌లో శనివారం పార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ఈనెల 18 నుంచి మునుగోడులో ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్టీ ముఖ్యనేతలను మండలాల వారీగా ఇన్‌చార్జులుగా నియమించినట్లు తెలిపారు. పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి సేవలు, నియోజకవర్గ నేతల అభిప్రాయాలు, సర్వేలను దృష్టిలో పెట్టుకొనే స్రవంతిని   అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారని చెప్పారు. మునుగోడుకు అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు తమ ఆత్మప్రబోధానుసారం స్రవంతికే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.   


మండలాల వారీగా ఇన్‌చార్జులు వీరే

మునుగోడులో ప్రచారం కోసం మండలాల వారీగా ఇన్‌చార్జులుగా నియమితులైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు.. దామోదర  రాజనర్సింహ(నాంపల్లి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(చౌటుప్పల్‌), భట్టి విక్రమార్క(మునుగోడు), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(మర్రిగూడ), షబ్బీర్‌ అలీ(చండూరు), వి. హన్మంతరావు(గట్టుప్పల్‌), రేవంత్‌రెడ్డి(నారాయణపూర్‌), గీతారెడ్డి(చౌటుప్పల్‌ మున్సిపాలిటీ). స్టార్‌ క్యాంపెయినర్లుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలను నియమించారు. 


రేవంత్‌ను కలిసిన అందెశ్రీ

మునుగోడు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాశ్‌ నేతలతో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. టికెట్‌ దక్కించుకున్న పాల్వాయి స్రవంతి శనివారం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలా ఉండగా, ప్రముఖ కవి అందెశ్రీ శనివారం రేవంత్‌రెడ్డిని కలిశారు. 

Updated Date - 2022-09-11T08:56:03+05:30 IST