ఆర్టీసీలో జీతాలకు కటకట

ABN , First Publish Date - 2020-07-10T08:24:04+05:30 IST

ఆర్టీసీలో జీతాలకు కటకట

ఆర్టీసీలో జీతాలకు కటకట

9వ తేదీ గడిచినా అందని వేతనాలు

సీసీఎస్‌, పీఎఫ్‌ చెల్లింపులకూ ఇబ్బందే


హైదరాబాద్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): వేతనాలకు నిధులు సర్దలేక ఆర్టీసీ సతమతమవుతోంది. సీసీఎ్‌సకు నిధులు బదలాయించేందుకు, పీఎఫ్‌ బకాయిలు, అద్దె బస్సులకు నెల వారీ బిల్లులు చెల్లించేందుకు కిందామీద పడుతోంది. ఒకవైపు.. 9వ తేదీ గడిచినా వేతనాలు రాలేదని ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా, మరోవైపు.. ఎలాంటి చెల్లింపులకైనా ఆంరఽధాబ్యాంకు నుంచి తెచ్చిన రూ.600కోట్ల రుణం వైపే చూడాల్సిన పరిస్థితిలో యాజమాన్యం ఉంది. కార్యిక శాఖ పర్యవేక్షణ కింద నడిచే ఆర్టీసీలో ‘పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌ యాక్ట్‌-1936’ ప్రకారం ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలి. కానీ... గత ఏడాదిగా ఈ నిబంధనను పాటించడం లేదు. ప్రతి నెలా 6, 7 తేదీల్లో వేతనాలు అందుతున్నాయి. జూన్‌ నెల వేతనాలు గురువారం చెల్లిస్తారని ఆశించినా.. సాయంత్రం 6 గంటల వరకూ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని సిబ్బంది వాపోయారు. ఆర్టీసీలో ప్రతి నెలా వేతనాల పద్దు రూ.120 కోట్ల వరకూ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. వీటిలోనూ ఆక్యుపెన్సీ రేషియో 40శాతానికే పరిమితమవుతోంది. తొలుత 5,000 బస్సులు నడపాలని నిర్ణయించినప్పటికీ... ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో ఓఆర్‌ ఉన్న రూట్లలోనే తిప్పుతున్నారు. దాంతో రోజూ రూ.4-5 కోట్ల మేర రావాల్సిన ఆదాయం.. రూ.3 కోట్లే వస్తోంది. డీజిల్‌, మోటారు వాహన పన్ను చెల్లింపులకే ఈ మొత్తం సరిపోతుండడంతో ప్రతి నెలా వేతనాలకు నిధుల కటకట ఏర్పడుతోంది. ఉద్యోగుల సీసీఎ్‌సకు రూ.635 కోట్లను ఆర్టీసీ బదలాయించాల్సి ఉంది. సమ్మె సందర్భంలో కనీసం రూ.200 కోట్లనైనా తక్షణమే బదలాయించాలంటూ హైకోర్టు యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వ గ్యారంటీతో ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.600 కోట్ల రుణాన్ని ఆర్టీసీ తీసుకుంది. కానీ, ఇంతవరకూ సీసీఎస్‌ డబ్బును మాత్రం బదలాయించలేదు. ఈ నిధుల నుంచే మార్చి, ఏప్రిల్‌, మే నెలల వేతనాల కోసం రూ.200 కోట్లు సర్దుబాటు చేసింది. ఇప్పుడు జూన్‌ నెల వేతనాలనూ ఇందులో నుంచే సర్దాలని భావిస్తోంది. ఈ నెల పూర్తి స్థాయి వేతనాలు చెల్లించాల్సి ఉన్నందున ఎంత లేదన్నా మరో రూ.120-130 కోట్లు అవసరం కానున్నాయి. రుణంగా తెచ్చిన సొమ్ము నుంచే వీటిని సర్దితే.. మరో రూ.280కోట్లు మాత్రమే మిగులుతాయి. మరోవైపు, ఉద్యోగుల పీఎ్‌ఫకు సంబంధించి మరో రూ.880 కోట్లు, సీసీఎ్‌సకు రూ.635కోట్లను ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. ఇవికాకుండా అద్దె బస్సుల యజమానులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. వీటన్నింటికీ నిధులు ఎలా సర్దాలో అర్థం కాక ఆర్టీసీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


అద్దె బస్సుల బిల్లులు పెండింగ్‌

ఆర్టీసీలో సొంత బస్సులతో పాటు 3,140 వరకు అద్దె బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం రొటేషన్‌ పద్ధతిలో 506 బస్సులను తిప్పడానికి అనుమతిస్తున్నారు. అయితే.. వీటికీ అద్దెలు చెల్లించడం లేదు. మార్చికి సంబంధించి రూ.31కోట్లు, మే నెలలో రూ.10కోట్లు, జూన్‌కు సంబంధించి రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.71 కోట్ల మేర పేరుకుపోయాయి. బిల్లులు చెల్లించకపోవడంతో డ్రైవర్లు, క్లీనర్లకు తాము వేతనాలు ఇవ్వలేకపోతున్నామని అద్దె బస్సుల ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి యాదయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ దృష్టికి తీసుకెళ్లినా బిల్లులు చెల్లించలేదని వాపోయారు.

Updated Date - 2020-07-10T08:24:04+05:30 IST