విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ జరగదు: సీఎండీ

ABN , First Publish Date - 2021-11-29T08:44:23+05:30 IST

తెలంగాణలో విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ జరగదని.. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ

విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ జరగదు: సీఎండీ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ జరగదని.. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు స్పష్టం చేశారు. పలు రాష్ట్రాలు విద్యుత్తు సంక్షోభంలో ఉన్నా.. తెలంగాణలో సీఎం ముందుచూపుతో రైతులకు నిరంతర విద్యుత్తు ఇవ్వడం సాధ్యమైందని చెప్పారు. విద్యుత్తు అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ఉద్యోగులు మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. అకౌంట్స్‌ అధికారులు ఇచ్చే సూచనలను యాజమాన్యం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. రెవెన్యూ లీకేజీలను అరికట్టాలని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు అన్నారు. పంపిణీ రంగంలో చాలా మార్పులు రాబోతున్నాయని, స్మార్ట్‌ మీటర్లు వస్తున్నాయని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా అకౌంట్స్‌ అధికారుల సంఖ్య పెరగడం లేదని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావుపై 25నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించారు.  

Updated Date - 2021-11-29T08:44:23+05:30 IST