బాంచన్‌ బతుకుల విజయబావుటా

ABN , First Publish Date - 2021-09-17T06:10:54+05:30 IST

బాంచన్‌ బతుకుల విజయబావుటా

బాంచన్‌ బతుకుల విజయబావుటా

నిజాం నిరంకుశత్వంపై బందూకులెత్తిన తెలంగాణం

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన సాయుధపోరాటం

నాటినుంచే ఉద్యమాల గుమ్మంగా ఉమ్మడి ఖమ్మం

అధికారిక ఉత్సవాల హామీని విస్మరించిన సీఎం కేసీఆర్‌

ఇల్లెందు, సెప్టెంబరు 16:  తమ విముక్తి కోసం యావత్‌ తెలంగాణ పల్లెలు బందూకులెత్తి బరిగీచిన తరుణమది.. ‘‘బాంచెన్‌ దొరా’’ అంటూ సాగిలపడిన ఎట్టి మనుషులే భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం సాయుధ సమరం సాగించిన కాలమది.. బారు పిరంగులు మోగినా.. బాంబుల వర్షం కురిసినా.. రక్తపుటేరులు పారినా.. ఎత్తిన జెండా దించబోమని అరుణ పతాకకు జై కొట్టి విమోచన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన 4వేల మంది సాయుధ రైతాంగ దళ కార్యకర్తల త్యాగమది..  ఆధిపత్యం అణిచివేతలను ప్రతి ఘటిస్తూ నిజాం తాబేదారులుగా జాగీర్‌దార్లు, జమీందారులు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాముల విచ్చలవిడి దోపిడీ, దౌర్జ న్యాలపై సాయుధ పోరు సాగించిన మహత్తర తెలం గాణ నేడు తన విముక్తి గాథలను స్మరించు కుంటోంది. తాము అధికారంలోకి వస్తే తెలం గాణ విమోచనదినాన్ని అధికారిక ఉత్సవం గా నిర్వహిస్తాని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హమీ అటకెక్కినా తెలంగాణ సమాజం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నేడు తెలం గాణ విమోచన దినోత్సవాన్ని ఆత్మ గౌరవ సూచికగా జరుపుకుంటోంది.  

ఉద్యమ గుమ్మం ఉమ్మడి జిల్లా..

రజకార్ల సహకారంతో నిజాం నవాబు మీర్‌ఉస్మాన్‌ఆలీఖాన్‌ సాగించిన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముందు వరుసలో నిలిచింది. కమ్యూనిస్టు రైతాంగ గెరిల్లా దళాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రజాకార్లు, భూస్వాములపై అనేక రీతుల్లో సమరశీల పోరాటాలు సాగించాయి. ఖమ్మం, మధిర, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు, పాత తాలుకాల పరిధిలో రజాకార్లకు వ్యతిరేకంగా భారీగా ప్రజాఉద్యమాలు నిర్మించారు. ప్రత్యేకించి ఇల్లెందు నియోజకవర్గంలో 1949-51 మధ్య కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగింది. బయ్యారం మండలం బండ్లకుంట ఏరియాలో రజాకార్ల ఆకృత్యాలపై దామినేని వెంకటేశ్వర్‌రావు, కంచెర్లబుచ్చిమల్లు నాయకత్వంలోని సాయుధ దళాలు రజాకార్లతో అనేకసార్లు విరోచిత పోరాటాలు సాగించాయి. గార్ల కేంద్రంగా సాగుతున్న జగాగీర్‌దార్ల పాలనపై వేదనాయకపురం హరిజనులు భూపోరాటాలు సాగించి తమ భూములను కాపాడుకున్నారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులని అనుమానం వస్తే వారిని రజాకార్లు కాల్చి చంపేవారు. వారి ఆకృత్యాలను భరించలేక గార్ల, బయ్యారం, ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో ప్రజలు కమ్యూనిస్టు పార్టీ సాయుధ దళాల నాయకత్వంలో విరోచిత పోరాటాలు నిర్వహించారు. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో జమిందార్‌ రంగారెడ్డిదేశ్‌ముఖ్‌ సాగిస్తున్న అరాచకాలపై రైతాంగ సాయుధ దళం విరోచిత ఉద్యమం సాగించింది. రంగారెడ్డి దుశ్చర్యలను గమనించి సాయుధ దళాలు మూకుమ్మడిగా దాడిచేసి రంగారెడ్డిని హతమార్చారు. ఇదే తెలంగాణలో జాగీరుదారులపై లభించిన తొలి విజయంగా చెబుతుంటారు. ఇదే తరుణంలో సింగరేణి బొగ్గుగనుల్లో సైతం రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్మికవర్గాన్ని సమీకరించారు. దేవునూరి శేషగిరిరావు నాయకత్వంలో ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో రైతాంగ దళాలను సమన్వయపరుస్తూ సింగరేణి కార్మికవర్గాన్ని సైతం తెలంగాణ విమోచన పోరాటాల్లో భాగస్వాములను చేశారు. ఈ క్రమంలోనే శేషగిరిరావు దళాన్ని నెల్లిపాక అడవుల్లో కాల్చిచంపారు. ఉద్యమాల గుమ్మంగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ పల్లెను అడిగినా.. ఎవరిని కదిలించినా తెలంగాణ మట్టి మనుషుల వీరోచిత గాథలను కథలు కథలుగా చెబుతుంటారు. అటువంటి వీరులకు నేడు తెలంగాణ నేల వినమ్రంగా నివాళులర్పిస్తోంది.  

తెలంగాణ రాష్ట్రసాధనకు స్ఫూర్తిగా..

 నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగించిన ఆనాటి సాయుధ పోరాటమే స్వతంత్య్ర భారతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన తెలంగాణ ఉద్యమానికి స్పూర్తిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమై సమైక్య రాష్ట్రంగా ఆంరఽధప్రదేశ్‌గా ఏర్పడినప్పటికీ యాస, భాషల్లో వివక్షత వెనుకబాటుతనం, పోలీసు నిర్బంధాలు, నిత్య ఎన్‌కౌంటర్లతో రక్తసిక్తమైన తెలంగాణ పల్లెలు స్వరాష్ట్రం సిద్ధిస్తేనే తమ బతుకులకు విముక్తి లభిస్తుందని కృతనిశ్చయానికి ప్రత్యేక రాష్ట్రం కోసం  ఉవెత్తున్న ఉద్యమించారు.  

ఊసులేని అధికారిక ఉత్సవాలు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ విముక్తి దినాన్ని అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో ప్రకటించిన కేసీఆర్‌ తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. స్వరాష్ట్రంలోనూ తమ విముక్తికోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులను అధికారికంగా స్మరించే అవకాశం లభించకపోవడం పట్ల తెలింగాణ ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అమరుల త్యాగాలకు గుర్తింపు లభిస్తుందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, తమ బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని ఆశించిన తొలి, మలి దశల ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, నేడు తీవ్ర నిరాశ నిస్ప్రృహల్లో కూరుకుపోయారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సాయుధ పోరాట వీరగాథలను చెబుతూ యువతను ఉర్రూతలూగించిన  కేసీఆర్‌ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరాలైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం పట్ల సర్వత్రా అవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ మాదిరిగానే విమోచనం పొందిన కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17న అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుండగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అధికారిక ఉత్సవాలు లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-09-17T06:10:54+05:30 IST