సౌదీలో తెలంగాణ వ్యక్తి గోస..అక్కడే చనిపోతానంటూ.. కన్నీటి పర్యంతం..!

ABN , First Publish Date - 2020-05-25T18:43:50+05:30 IST

ప్లీజ్ నన్ను రక్షించండి.. లేకుంటే ఇక్కడ వీళ్లు చంపేస్తారు అంటూ తెలంగాణ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోపై

సౌదీలో తెలంగాణ వ్యక్తి గోస..అక్కడే చనిపోతానంటూ.. కన్నీటి పర్యంతం..!

రియాద్: ప్లీజ్ నన్ను రక్షించండి.. లేకుంటే ఇక్కడ వీళ్లు చంపేస్తారు అంటూ తెలంగాణ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. అతడ్ని రక్షించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చిపూర్ గ్రామానికి చెందిన అంకమొళ్ల రవి (31), ఆరు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. సౌదీ అరేబియాలో ఓ వ్యక్తి దగ్గర రవి.. పనికి కుదిరాడు. అయితే రవిని హింసిస్తూ.. అతని యజమాని పైశాశిక ఆనందం పొందుతున్నాడు. ఆరేళ్లలో ఒక్కసారి కూడా ఇంటికొచ్చి తన వాళ్లను చూసుకోనీయకుండా రవిని మానసికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రోజు రవి యజమాని.. అతనిపట్ల మితిమీరి ప్రవర్తించాడు. రక్తం వచ్చేలా రవి ముఖంపై పిడి గుద్దులు గుప్పించాడు. ఈ నేపథ్యంలో ముఖం నిండా రక్తస్రావంతో రవి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్లీజ్ నన్ను రక్షించండి. లేకుంటే ఇక్కడే నేను చనిపోతాను. నా యజమాని నాపై ఘోరంగా చేయి చేసుకుంటున్నాడు. ముక్కులోంచి, తలలోంచి రక్త స్రావం అవుతోంది. నా పొట్టపై అతను పిడి గుద్దలు గుద్దుతున్నాడు. నన్ను చంపేస్తాడు’ అంటూ వీడియోలో రవి కన్నీటి పర్యంతం అయ్యాడు. కాగా.. రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత దృష్టికి రావడంతో ఆమె స్పందించారు. రవి వీడియోను భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, అతడ్ని రక్షించాలని కోరారు.


Updated Date - 2020-05-25T18:43:50+05:30 IST