బకాయిలు రాక దిగులుతో మంచం పడుతున్న యూనివర్సిటీ అధ్యాపకులు

ABN , First Publish Date - 2021-09-14T00:18:38+05:30 IST

తమకు రావాల్సిన బకాయిలు రాక యూనివర్సిటీ అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. వాటి కోసం

బకాయిలు రాక దిగులుతో మంచం పడుతున్న యూనివర్సిటీ అధ్యాపకులు

హైదరాబాద్: తమకు రావాల్సిన బకాయిలు రాక తెలంగాణలోని యూనివర్సిటీ అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. వాటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోవడంతో దిగులుతో కొందరు మంచం పట్టగా, మరికొందరు మరణించారు కూడా.


కాలేజీ అధ్యాపకులు గతేడాది వారి బకాయిలను తీసుకున్నప్పటికీ యూనివర్సిటీ అధ్యాపకులకు మాత్రం ఇంత వరకు రాకపోవడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిజానికి 2016 నుంచి ఫిబ్రవరి 2020 వరకు బకాయిలు రావాల్సి ఉందని యూనివర్సిటీ అధ్యాపకులు చెబుతున్నారు


1 జనవరి 2016కు ముందు రిటైరైన కాలేజీ, యూనివర్సిటీ అధ్యాపకులను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఓ జీవోను విడుదల చేసింది. సవరించిన కన్సాలిడేటెడ్ పెన్షన్ మార్చి 2020 నుంచి పంపిణీ చేయబడుతుందని,  1 ఏప్రిల్, 2020న చెల్లించాలని జీవోలోని 8వ పేరాలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.


పింఛను బకాయిలు 1 జనవరి 2016 నుంచి 29-2-2020 వరకు నాలుగు సమాన ద్వైమాసిక వాయిదాలలో జూన్ నుంచి చెల్లించాలని పేర్కొంది. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్లు ఎరియర్లు అందుకున్నప్పటికీ యూనివర్సిటీ టీచర్లకు మాత్రం ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది.


తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని, పెండింగు బకాయిలను తక్షణం విడుదల చేయాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని యూనివర్సిటీ అధ్యాపకులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2021-09-14T00:18:38+05:30 IST