ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి

ABN , First Publish Date - 2021-05-18T06:20:48+05:30 IST

గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై అధికారులు నోరు పారేసుకున్నారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి

సచివాలయ మహిళా పోలీసులపై తిట్లదండకం

టెలీ కాన్ఫరెన్స్‌లో నానా దుర్భాషలాడిన అధికారులు

కలెక్టర్‌కి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన సచివాలయ ఉద్యోగులు

గుంటూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై అధికారులు నోరు పారేసుకున్నారు. కరోనా బాధితుల అడ్మిషన్స్‌, ఇన్వెస్టిగేషన్స్‌, వైటల్స్‌ పెండింగ్‌లో ఉండటంపై నానా దుర్భాషలాడారు. టెలీకాన్ఫరెన్స్‌ పెట్టి అందరూ వినేలా తిట్ల దండకం అందుకోవడంతో సంబంధిత మహిళా ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందారు. కరోనాని కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తుంటే ఇలా మనస్సు నొచ్చుకొనే విధంగా అధికారులు వ్యవహరించడంపై వారు మనస్థాపం చెందుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులు దుర్భాషలాడిన తీరు సోమవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. 

అధికారి 1: 12 గంటల కల్లా ఏ ఒక్కటి పెండింగ్‌ ఉన్నా నేను మొత్తాన్ని పేల్చేస్తాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి. అర్థమౌతుందా.. ఒక్క పెండింగ్‌ ఉన్నా తర్వాతి రోజు నుంచి మీరు ఉద్యోగాలకు రావాల్సిన పని లేదు. సచివాలయ ఉద్యోగులైతే నిర్ధాక్షిణ్యంగా తీసి పడేస్తానండి. ఆలోచించుకొని పని చేయండి. 

అధికారి 2: ప్రతీ ఒక్కళ్లు వైటల్స్‌, ఇన్వెస్టిగేషన్స్‌, పెండింగ్‌ అడ్మిషన్స్‌ క్లియర్‌ అయిన తర్వాతనే షిఫ్టు దిగండి. ఏ ఒక్కరు కూడా పెండింగ్స్‌ క్లియర్‌ చేయకుండా షిఫ్టు దిగితే మాత్రం బాగోదు. పెండింగ్‌  జీరో కనిపించాలి. జీరో కనిపించకుండా షిఫ్టు దిగి వెళ్లిపోయారా ఇదే మీకు చివరి రోజు. సచివాలయ స్టాఫ్‌ అయినా ఏ స్టాఫ్‌ అయినా పరిగణనలోకి తీసుకునేది లేదు. తీసి పక్కన పడేస్తాం. వేరే వాళ్లని పెట్టుకొంటాం. సచివాలయ సిబ్బందికి మరీ ముఖ్యంగా చెబుతున్నాను. మిమ్మల్ని అయితే కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోం. 

అధికారి 3: ఎందుకుంటున్నాయి అన్ని ఇన్వెస్టిగేషన్స్‌ పెండింగ్స్‌. ఏమి పిచ్చపిచ్చగా ఉందా ఏమిటి ఒక్కొక్కళ్లకి. పని చేయడం ఇష్టం లేకపోతే మానేయండి. మీ వల్ల మేము తిట్లు తిట్టించుకోవాలా ఏమిటి? మీకు వేలకు వేలు జీతాలు ఇచ్చి పని చేయమంటే బద్ధకమేస్తోందా ఏమిటి? ఏమి సచివాలయం స్టాఫ్‌ మీకు కొమ్ములు వచ్చాయా ఏమిటి? ఏమి చేస్తోన్నారు. పెండింగ్‌ అడ్మిషన్స్‌, వైటల్స్‌, ఇన్వెస్టిగేషన్‌ పెండింగ్‌ పెట్టి కదలండి చెబుతా మీ పని. ఏమి ఊరుకుంటుంటే ప్రతీ రోజు. ఏ ఒక్కటి పెండింగ్‌ ఉన్నా చెబుతా మీ పని. ఇదే మీకు చివరి రోజు అవుతుంది.

ఇలా టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులు తమని కించపరిచేలా మాట్లాడారని సచివాలయాల్లో పని చేస్తోన్న మహిళా పోలీసులు వాపోతున్నారు. అధికారులతో పాటు వారి వద్ద పని చేసే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితోనూ తమని తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తిట్ల దండకానికి సంబంధించి ఆడియో లింకులు సోమవారం సామాజిక మాధ్యమాల్లో షేరింగ్‌ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ వర్గాల్లో కలకలం రేకెత్తింది. 

Updated Date - 2021-05-18T06:20:48+05:30 IST