టెలికాంకు భారీ ఊరట

ABN , First Publish Date - 2021-09-16T08:20:01+05:30 IST

టెలికాం రంగం కోసం ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, ఊరట చర్యలపై ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

టెలికాంకు భారీ ఊరట

హర్షం వ్యక్తం చేసిన ఇండస్ట్రీ వర్గాలు 

న్యూఢిల్లీ: టెలికాం రంగం కోసం ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, ఊరట చర్యలపై ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్యాకేజిని ఆహ్వానిం చిన వారిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ఉన్నారు. కస్టమర్లకు సరికొత్త, మరింత అధిక ప్రయోజనాలను అందించేందుకు ఈ సంస్కరణలు ప్రోత్సా హంగా నిలుస్తాయని రిలయన్స్‌ జియో అభిప్రాయపడింది. డిజిటల్‌ ఇండియా లక్ష్యాలు, మైలురాళ్లను చేరుకునే విషయంలో ప్రభుత్వం, ఇతర టెలికాం కంపెనీలతో కలిసి కృషిచేస్తామని జియో పేర్కొంది. టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన వృద్ధికి ప్యాకేజీ తోడ్పడనుందని, ఇండస్ట్రీని ఆర్థిక బంధనాల నుంచి విముక్తి చేయనుందని వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ ప్రమోటర్లన్నారు. తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగానికి తాజా ప్యాకేజీ కొంత ఊరటనివ్వనుందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ అన్నారు.


తక్షణ నగదు ఊరటేదైనా లభిస్తే, కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు 5జీ స్పెక్ట్రమ్‌ వేలం లో చురుగ్గా పాల్గొనేందుకు సహాయకారిగా ఉండేదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశీయ టెలికాం రంగానికిది కొత్త ఉషోదయమని, ఆర్థిక వ్యవస్థకు కీలక రంగాల్లో ఒకటైన టెలికాం శరవేగంగా వృద్ధి చెందేందుకు తాజా చర్యలు ఉత్ర్పేరకంగా పనిచేయనున్నాయని భారతీ ఎయిర్‌టెల్‌ పేర్కొంది. 5జీ  టెక్నాలజీలు, నూతన ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వినియోగదారులకు ప్రపంచశ్రేణి సేవలందించేందుకు ప్యాకేజీ బాటలు వేయనుందని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ అన్నారు.


భారత ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకాల్లో టెలికాం రంగం ఒకటి. దేశాన్ని డిజిటల్‌ సమాజంగా మార్చడం లో ఈ రంగానిదే కీలకపాత్ర. డిజిటల్‌ ఇండియా లక్ష్యాల సాధనకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయి. ప్రభుత్వ తాజా చర్యలను నేను స్వాగతిస్తున్నాను.

- ముకేశ్‌ అంబానీ

టెలికాం పరిశ్రమ ఇక నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని తాజా సంస్కరణల ద్వారా హామీ లభించింది. కొత్త పెట్టుబడులకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం. భారత్‌ లాంటి బడా మార్కెట్లో ముగ్గురు ప్రైవేట్‌ ఆపరేటర్లతోపాటు ఒక ప్రభుత్వ ఆపరేటర్‌ స్థిరమైన సేవలందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయి.

- సునీల్‌ మిట్టల్

Updated Date - 2021-09-16T08:20:01+05:30 IST