Abn logo
May 23 2020 @ 23:50PM

నెల రోజులుగా ఉపవాసం ఉంటున్నా: పూర్ణ

అవును... పూర్ణ నృత్య కళాకారిణి. వెండితెరపై కథానాయిక! బుల్లితెరపై న్యాయనిర్ణేత! ఆమె ప్రయాణం నదీ ప్రవాహంలా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అంటూ సాగుతోంది. అందంగా కనిపించే ఆమెలో ఆధ్యాత్మిక కోణమూ ఉంది. రంజాన్‌లో విధిగా ‘రోజా’ పాటించే వ్యక్తి ఉన్నారు. పూర్ణ అసలు పేరు షమ్నా ఖాసిం! ఆమె కేరళకు చెందిన ముస్లిం యువతి! పవిత్ర రంజాన్‌ సందర్భంగా ‘నవ్య’తో షమ్నా ఖాసిం మాట్లాడారు.


‘‘ఈ ఏడాది రంజాన్‌ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటారా? శనివారం (మే 23న) నా పుట్టినరోజు. మరికొన్ని గంటల్లో ఈద్‌. రెండు రోజులు ఎంతో దగ్గరగా రావడం సంతోషంగా ఉంది. పైగా, ఇంటిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉన్నాను. ఇంతకు మించి ఆనందం ఏముంటుంది చెప్పండి!


‘రోజా’ ఎప్పుడూ మానలేదు

నా చిన్నతనం నుంచి ‘రోజా’ (పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు చేసే ఉపవాసం) పాటిస్తున్నా. ఎప్పుడూ మానలేదు. ప్రతి ఏడాదీ 30 రోజులూ క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటాను. ప్రార్థనలు చేస్తా. నేను నృత్య కళాకారిణిని, నటిని. నటన నా వృత్తి. ఒకవేళ రంజాన్‌ సమయంలో తప్పక షూటింగులు చేయవలసి వచ్చినా... ‘రోజా’ చేస్తాను. ఏదో కారణం చెప్పి మానేయను. ఈ ఏడాది కరోనా సృష్టించిన కల్లోలం వల్ల షూటింగులు బంద్‌ కావడంతో ఇంట్లో ఉంటున్నా. చాలా సంవత్సరాల తర్వాత రంజాన్‌కి ఇంట్లో ఉండడం కుదిరింది. కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్‌ చేస్తున్నా. నెల రోజులుగా ఉపవాసం ఉంటున్నా. రంజాన్‌ మాసం అంటే ఖురాన్‌ అవతరించిన నెల. ఈ మాసమంతా పవిత్రమైనదే!


‘జకాత్‌’ చేస్తున్నా

రంజాన్‌ మాసంలో చివరి 10 రోజులూ చాలా ముఖ్యమైనవి. నేను ఈ సమయంలో ‘జకాత్‌’ (పేదలకు వస్త్రాలు, ఆహారం దానం చేయడం) చేస్తా. అందుకని, ఒకవేళ షూటింగులు ఉన్నా  ప్రాధాన్యం ఇవ్వకుండా ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడు కరోనా వల్ల ‘జకాత్‌’ కొంచెం సమస్యగా ఉంది. అన్ని మసీదులూ మూసి ఉన్నాయి. అయినా... మా సోదరి సహకారంతో కొంతమందికి సాయం చేశా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. చాలామందికి పనులు లేవు. ఇబ్బందులు పడుతున్నారు. నేను సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది.


ఈద్‌... ఇంట్లోనే!

ఇంట్లోనే ఈద్‌ జరుపుకోవడం మా కుటుంబమంతటికీ అలవాటు. బయటకు వెళ్లడమనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంట్లోనే రకరకాల వంటలు సిద్ధం చేస్తాం. ఈద్‌ అయిపోయిన రెండు రోజులకు సరదాగా బయటకు వెళ్లి ఏదైనా తింటాం. అంతే! సాధారణంగా ప్రతి ఏడాది కేరళలో మా సొంతూరు కన్నూర్‌కి వెళతాం. ఈసారి కొచ్చిలో నా ఇంటికి అమ్మానాన్న, అక్కలు వచ్చారు. ఇప్పుడు ఘనంగా ఈ పండగ చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం చాలామంది సమస్యల్లో ఉన్నారు. మా సోదరుడు సౌదీలో, బావ దుబాయ్‌లో ఉన్నారు. వాళ్ల గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తోంది. ఇండియా బయట పరిస్థితులు బాగోలేవు. ఇక్కడ కూడా బంధువుల్లో చాలామంది క్వారంటైన్‌లో ఉన్నారు. అందుకని, పండగను సింపుల్‌గా, క్యూట్‌గా చేసుకోవాలనుకుంటున్నాం.


అమ్మతో ‘స్వీటు చేస్తా’ అని చెప్పా!

నాకు వంట రాదు. ఎలా వండాలో తెలుసు గానీ, ఇంతకు ముందెప్పుడూ చేయలేదు. షూటింగులు, ప్రయాణాలతో సమయం సరిపోయేది. వంట చేసే వీలు చిక్కలేదు. నాకూ అంతగా చేయాలనే ఆసక్తి ఉండేది కాదు. కానీ, ఈ లాక్‌డౌన్‌లో వంట ఓ వ్యాపకం (హాబీ)గా మారింది. రోజూ ఏదో ఒకటి వండుతున్నా. లేకపోతే ఏమీ తోచడం లేదు. కొత్త కొత్త వంటలు ప్రయత్నిస్తున్నా. ప్రయోగాలు చేస్తున్నా. కొన్నిసార్లు బావుంటే... కొన్నిసార్లు నా ప్రయోగాలు వికటిస్తున్నాయి. ‘రోజా’లు మొదలైనప్పట్నుంచి రోజూ నేను వండినవి ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నా. (నవ్వుతూ...) మధ్యలో పోస్ట్‌ చేయడం మర్చిపోతే స్నేహితులందరూ ఫోన్‌లు చేసి ‘ఈ రోజు ఏం వండలేదా?’ అని అడిగారు. ఇప్పుడు వంట మీద నాకు ఇష్టం పెరిగింది. తప్పకుండా ఈద్‌కి వంట చేస్తా. అమ్మతో చెప్పాను... ‘నేను స్వీటు చేస్తా’ అని!


కేరళ స్టైల్‌ వేరు... హైదరాబాద్‌ స్టైల్‌ వేరు!

మా ఊరు కేరళలో కన్నూర్‌ అని చెప్పాను కదా! అది వంటలకు చాలా ప్రసిద్ధి. మా ఊరి వంట ప్రత్యేకంగా ఉంటుంది. అయితే... హైదరాబాద్‌ వంటలకు, కేరళ వంటలకు తేడా ఉంటుంది. రెండూ వేర్వేరు రుచులు. బిర్యానీ మాత్రం రెండు చోట్లా తప్పకుండా ఉంటుంది.


లాక్‌డౌన్‌కి ముందు...

మార్చి 22న జనతా కర్ఫ్యూ. తర్వాత రోజు నుంచి లాక్‌డౌన్‌ విధించారు. నేను మార్చి 20 వరకూ చెన్నైలో జయలలితగారి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘తలైవి’, మరో తమిళ సినిమా షూటింగ్‌లో పని చేశా. మార్చి 22, 23 తేదీల్లో తెలుగు రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ’ షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. అందుకని, హైదరాబాద్‌ వచ్చాను. కానీ, షూటింగ్‌ లేదని వెంటనే కొచ్చికి వెళ్లిపోయా. నిజం చెప్పాలంటే... ఏడెనిమిది నెలలుగా విరామం తీసుకోకుండా షూటింగులు చేస్తున్నా. విశ్రాంతి దొరకడంతో సంతోషించా. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయాల్సిన సమస్యలు, పని ఒత్తిడి వంటివి ఏమీ లేవు. వరుసగా షూటింగులు చేసేటప్పుడు ‘నాలుగైదు రోజులు సెలవు పెట్టేసి వచ్చేయ్‌’ అని అమ్మ అడిగేది. ఇప్పుడు తనతో ‘అమ్మీ! నువ్వు రెండు నెలలు సెలవులు ఇవ్వమని దేవుణ్ణి ఎందుకు ప్రార్థించావు?’ అని అడుగుతుంటా. లాక్‌డౌన్‌లో మొదటి 30 రోజులు బాగా గడిచింది. ఇప్పుడు కొంచెం బోర్‌ కొడుతోంది.


నృత్య ప్రదర్శన ఇవ్వాలని ఉంది

స్వతహాగా నేను నృత్య కళాకారిణిని. నాకు ప్రదర్శనలు ఇవ్వడమంటే ఇష్టం. వేదికపై నృత్య ప్రదర్శన ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల కరతాళధ్వనులు విన్నప్పుడు వచ్చే సంతోషం వెల కట్టలేనిది. నేనది మిస్‌ అవుతున్నా. ఒక వేదికపై నృత్య ప్రదర్శన ఇవ్వాలని ఉంది.


కష్టమైనా... పాటించండి!

అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు దారుణమైన పరిస్థితుల నడుమ జీవనం సాగిస్తున్నాం. మనం వీటన్నిటినీ దాటుకుని ముందుకు వెళతాం. ఈ పరిస్థితులను మార్చలేం. ఇదంతా మన తలరాత! మామూలు రోజుల్లో మనకు కుటుంబంతో కలిసి గడపడానికి సమయం ఉండదు. ప్రార్థనలు చేయడానికీ వీలు పడదు. అందుకని, దేవుడు మనకు చిన్న శిక్ష విధించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వాలు పనులు చేయడానికి అనుమతులు ఇస్తున్నాయి. ఎల్లప్పుడూ ఇంటి పట్టున కూర్చోలేం కదా! పనులు, ఉద్యోగాలు చేయడానికి బయటకు వెళ్లేవారు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి. శానిటైజర్లు ఉపయోగించండి. వ్యక్తిగత శుభ్రత పాటించండి. మాస్క్‌ ధరించండి. నిజం చెప్పాలంటే... మాస్క్‌ ధరించడం నాకూ కష్టంగానే ఉంది. కానీ, మన ఆరోగ్యం, రక్షణ కోసమే చెబుతున్నారు కదా! పాటిద్దాం. అందరికీ ఈద్‌ ముబారక్‌.’’

-సత్య పులగం


Advertisement
Advertisement
Advertisement