‘అనంత’ రోదసిలో తెలుగువారి కీర్తిపతాక

ABN , First Publish Date - 2020-12-01T07:13:14+05:30 IST

‘అనంత’ రోదసిలో తెలుగువారి కీర్తిపతాక ఎగరబోతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అంతరిక్ష కంపెనీ ‘అనంత్‌ టెక్నాలజీస్‌’ రెండు సమాచార ఉపగ్రహాలను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన సాటర్న్‌ శాటిలైట్స్‌ కంపెనీతో కలిసి ఒక సంయుక్త సంస్థ...

‘అనంత’ రోదసిలో తెలుగువారి కీర్తిపతాక

  • రెండు సమాచార ఉపగ్రహాల అభివృద్ధికి ‘అనంత్‌ టెక్నాలజీస్‌’ సిద్ధం
  • అమెరికా కంపెనీ ‘సాటర్న్‌’తో కలిసి జాయింట్‌ వెంచర్‌ 

బెంగళూరు, నవంబరు 30 : ‘అనంత’ రోదసిలో తెలుగువారి కీర్తిపతాక ఎగరబోతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే అంతరిక్ష కంపెనీ ‘అనంత్‌ టెక్నాలజీస్‌’ రెండు సమాచార ఉపగ్రహాలను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం అమెరికాకు చెందిన సాటర్న్‌ శాటిలైట్స్‌ కంపెనీతో కలిసి ఒక సంయుక్త సంస్థ (జాయింట్‌ వెంచర్‌) ను ఏర్పాటుచేసింది. దానికి ‘సాన్‌’(ఎ్‌సఏఏఎన్‌) అని పేరుపెట్టింది. 


ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. ఉపగ్రహాలు, రాకెట్ల నిర్మాణం, అంతరిక్ష ప్రయోగ సేవల్లోకి ప్రైవేటు కంపెనీల ప్రవేశానికి పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత ఒక విదేశీ అంతరిక్ష కంపెనీతో కలిసి ఉపగ్రహ తయారీ కార్యకలాపాలను ప్రారంభించిన తొలి భారతీయ కంపెనీగా అనంత్‌ టెక్నాలజీస్‌ నిలిచింది. ప్రత్యేకించి ఇది తెలుగువారి నేతృత్వంలో నడిచే కంపెనీ కావడం విశేషం. దీని చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా డాక్టర్‌ పావులూరి సుబ్బారావు వ్యవహరిస్తున్నారు. కాగా, జాయింట్‌ వెంచర్‌ సంస్థ ‘సాన్‌’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసే సమాచార ఉపగ్రహాలను ఇస్రోకు చెందిన పీఎ్‌సఎల్‌వీ రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నారు. బెంగళూరులో అనంత్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటుచేసిన కొత్త యూనిట్‌లో ప్రధానంగా 300 నుంచి 700 కేజీల శ్రేణిలోని ఉపగ్రహాలను తయారుచేయనున్నారు. దీంతోపాటు ప్రైవేటు కంపెనీలు నేరుగా నిర్వహించేందుకు యోగ్యమైన ‘నేషన్‌ శాట్‌’ అనే కమ్యూనికేషన్‌ శాటిలైన్‌ను కూడా అభివృద్ధి చేయనుండటం గమనార్హం. ‘‘పశ్చిమ దేశాల కంటే 30 శాతం తక్కువ ఖర్చుకే భారతీయ కంపెనీలు ఉపగ్రహాలను తయారు చేయించుకోవచ్చు. ఇందుకు సహకరించేందుకు మాలాంటి కంపెనీలు సదా సిద్ధం. ఇస్రో ద్వారా అందుబాటులోకి వచ్చిన వనరులను వాడుకొని తక్కువ రేట్లకే శాటిలైట్లను ప్రయోగించుకోవచ్చు’’ అని అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ పావులూరి సుబ్బారావు తెలిపారు. 


Updated Date - 2020-12-01T07:13:14+05:30 IST