Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘తెలుగుదేశం’ – మధునాపంతుల

1982లో తెలుగుదేశం పేరిట ఓ ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం ఓ సంచలనం. అప్పటికి డీఎంకే, ఏఐడీఎంకేలు మాత్రమే ప్రాంతీయ పార్టీలు. అయితే, ఆ రెండు పార్టీలు ప్రాంతీయం పేరుతో ఏర్పడినవి. కాగా, భాష పేరుతో ఏర్పడిన తొలి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీకి ఆ పేరు నిర్ణయించడంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చేసిన పరిశోధన, పరిశీలనలు, చరిత్రకారులు, కవులతో చేసిన చర్చలు అపూర్వం. అందులో ముఖ్యంగా ‘ఆంధ్రపురాణం’ గ్రంథ రచయిత, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యన్నారాయణ శాస్త్రితో ఎన్టీరామారావు రోజుల తరబడి చర్చించి తన పార్టీకి ‘తెలుగుదేశం’ పేరును ఖరారు చేశారు. తత్ఫలితంగానే ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే పార్టీ అనేక రికార్డులను సృష్టించింది. ఆ పార్టీ పక్షాన ఎన్నికైన వేలాది మంది ప్రజాప్రతినిధులు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పునీతులయ్యారు. అలాంటి పార్టీ పేరును నిర్ణయించడంలో అపురూపమైన సలహాలనిచ్చిన, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యన్నారాయణ శాస్త్రి శతజయంతి ఈ నెల 5వ తేది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆ మహనీయుని శతజయంతి సభలు నిర్వహించి తమ రుణం తీర్చుకోవాలి. ఆ మహాకవికి నివాళులర్పించడం ద్వారా, పార్టీ సైద్ధాంతిక పునఃస్ఫూర్తిని పొందాలి. అప్పుడే తెలుగునాట సాంస్కృతికాభిమానులు ఆ పార్టీని అక్కున చేర్చుకొని ఆదరిస్తారు. ఆ మహనీయుని సంస్మరణ ద్వారా, పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ స్థాయిని మరోసారి ప్రజలకు, పార్టీ అభిమానులకు గుర్తుచేసే సదవకాశాన్ని ఆపార్టీ నాయకత్వం సద్వినియోగం చేసుకోవాలి. కళాప్రపూర్ణ మధునాపంతుల వారి శతజయంతి సభలు 2019లో ప్రారంభమైనాయి. హైదరాబాద్‌, ముంబయి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, విజయనగరం, రాజమహేంద్రవరంలో జరిగాయి. మార్చి 5వ తేదీన యానాం పల్లిపాలెంలో కేంద్ర సాహిత్య అకాడమి సౌజన్యంతో రోజంతా సభలు జరుగుతాయి. మహామహులైన సాహిత్యవేత్తలు పాల్గొని సందేశాలిస్తారు. సాహిత్యాభిమానులు, సాహిత్యాభిలాష కలిగిన తెలుగుదేశం పార్టీ వారు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించాలి.

బి.వి.అప్పారావు, విశాఖపట్నం

Advertisement
Advertisement