వికాసపు దారుల్లో తెలుగు నాటక రంగం

ABN , First Publish Date - 2021-04-16T05:44:26+05:30 IST

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం. తెలుగు నాటక రంగానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. పదహారవ శతాబ్దంలో...

వికాసపు దారుల్లో తెలుగు నాటక రంగం

నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్య రూపకం. తెలుగు నాటక రంగానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతం, యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన ‘క్రీడాభిరామం’ కూడా నాటకమే. నన్నయ్య తన భారత అవతారికలో రసాన్విత కావ్యనాటకముల్ పెక్కుజూచితి అనడాన్ని బట్టి, నన్నయ కాలానికి నాటక ప్రదర్శనలుండేవని అర్ధం చేసుకొవచ్చు. 1860 ప్రాంతాల్లో వెలువడిన తొలి తెలుగు నాటకం ‘మంజరీ మధుకరీయం’ రచయిత కోరాడ రామచంద్ర శాస్త్రి లాంటి వారు ఆధునిక నాటక రచనకు ఆద్యులు. ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు రూపకర్తలైన వారందరిలోకెల్లా అగ్రగణ్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారే. కందుకూరి వీరేశలింగం వ్యావహారిక భాషలో రాసిన ‘వ్యవహార ధర్మబోధిని’ తొలిసారిగా ప్రదర్శించబడిన తెలుగు నాటకం. 1880 లో వీరేశలింగం గారు నాటక సమాజాన్ని స్థాపించి ‘రత్నావళి’, ‘చమత్కార రత్నావళి’ అనే రెండు నాటకాలను ప్రదర్శించారు. తెలుగు నాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కూడా వీరేశలింగం గారిదే. వీరి స్వతంత్ర రచన ‘వ్యవహార ధర్మబోధిని’, సంస్కృత నాటక అనువాదమైన ‘రత్నావళి’, ఆంగ్ల నాటక అనుసరణ అయిన ‘చమత్కార రత్నావళి’ ప్రదర్శనా భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. వీరేశలింగం పంతులు గారి పుట్టిన రోజైన ఏప్రిల్ 16ను తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 


1960లో పియస్ఆర్ అప్పారావు రచించిన ‘తెలుగు నాటక వికాసము’ అనే పరిశోధనా గ్రంథం ద్వారా తెలుగు నాటకరంగంలో 1960 వరకు దాదాపు రెండువేల నాటకాలు, నాలుగువేల ఏకాంకికలు, నాటికలు వచ్చినట్లుగా, వేయిమంది ఏకాంకికా-నాటికా-నాటక-ప్రహసన రచయితలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. పిఎస్ఆర్ అప్పారావు చాలా ప్రాంతాల్లో తిరిగి, ఎందరో వృద్ధ నటులను, నాటకకర్తలను, కళాభిమానులను కలిసి, తెలుగు నాటకరంగ చరిత్ర సమగ్ర నిర్మాణంకోసం చాలా సమాచారాన్ని సేకరించి, పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. తెలుగు నేలపై ఎన్నో నాటక సమాజాలు ఆవిర్భవించి వేల సంఖ్యలో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ తెలుగు నాటకరంగాన్ని నేడు మనం చూస్తున్న ఉన్నత దశలో నిలబెట్టడానికి కృషి చేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు మరియు ఎన్నో నాటక పరిషత్తుల ద్వారా నాటకోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. తెలుగు సినిమా రంగంలో మేటి నటులుగా వెలుగొందిన పాత తరం తారలెందరో రంగస్థలం మీద తమ నటనా కౌశలాన్ని నిరూపించుకున్నవారే. సినిమా, టెలివిజన్ రంగాల ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో రంగస్థల కళల పట్ల ముఖ్యంగా తెలుగు నాటకానికి రోజు రోజుకీ ప్రజల్లో తగ్గిపోతున్న ఆదరణ మనందరికీ ఆందోళన కలిగించే విషయం. 


అనాది కాలం నుండి సమాజాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేస్తూ వస్తున్న నాటకం వల్ల సమాజంలోని అన్ని రంగాల్లోనూ ఒనగూరే ప్రయోజనం అంతా ఇంతా కాదు. సమాజంలో ముఖ్య వ్యవస్థ అయిన విద్యా బోధనా రంగంలో నాటకం యొక్క ప్రభావం ప్రత్యక్షమూ మరియు ప్రత్యేకమూ అని ఎన్నో పరిశోధనలు ఎప్పుడో తేల్చేశాయి. నాటకం వల్ల విద్యార్థులు ఆత్మ విశ్వాసం, ఏకాగ్రత, సృజనాత్మకత, స్నేహం, సహకారం, చుట్టూ ఉన్న ప్రపంచంపై అవగాహన, భాషా నైపుణ్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, బృందంగా అందరితో కలిసి పని చేయడం, భావోద్వేగాలకు సంబంధించిన తెలివితేటలు లాంటి ఎన్నో వ్యక్తిత్వ పరిణామ లక్షణాలే కాక భౌతిక వికాసంపై సరైన దృక్పథం ఏర్పరచుకుంటారు. గ్రీస్ మరియు రోమ్ లాంటి దేశాల్లో క్రీస్తు పూర్వం ఐదు శతాబ్దాలకు ముందే నాటకం బహుళ జనాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ ఆధునిక కాలంలో దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా నాటక రంగానికి పునరుజ్జీవనం కలిగించేలా, యువతను నాటక రంగం వైపు ఆకర్షించేలా ఎన్నో నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నాయి. జమైకా ఆ దేశ విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్య నుండీ నాటకాన్ని కంపల్సరీ సబ్జెక్టుగా బోధిస్తున్నది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఎన్నో ఇతర ప్రైవేటు సంస్థలు నాటక రంగానికి సంబంధించిన కోర్సుల్లో శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నాయి. అన్ని విద్యా సంస్థల్లో ప్రాథమిక స్థాయి నుండే నాటక శిక్షణ బోధించేట్టు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలనీ, తెలుగు నాటక రంగం వెలుగులు విరజిమ్మాలని, తద్వారా రంగస్థల కళల ప్రధాన లక్ష్యమైన సమాజ శ్రేయస్సును సంపూర్ణంగా సాధించాలనీ ఆశిద్దాం.

మోహన్‌ లింగబత్తుల

Updated Date - 2021-04-16T05:44:26+05:30 IST