పగోడికి కూడా ఈ బాధలు రాకూడదు.. కువైట్‌లో కష్టాలు.. కన్నీళ్లే..

ABN , First Publish Date - 2020-05-23T21:54:04+05:30 IST

‘‘కువైట్‌లో కష్టాలే మాకు తోడు నీడ. పొట్ట కూటికోసం నాలుగు రూకలు సంపాదించుకోవాలని లక్షలు ఖర్చులు చేసి కువైట్‌కు వెళ్తే.. మేం పడిన బాధలు పగోడు కూడా పడకూడదు. ఆడ మనోళ్ల కష్టాలు మీకు చెప్తే అన్నం కూడా తినలేరు. మాకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది.. ఉండటానికి రూము లేక, తినటానికి తిండి లేక మేం పడిన బాధలు అన్నీఇన్నీ కావు’’ అంటూ..

పగోడికి కూడా ఈ బాధలు రాకూడదు.. కువైట్‌లో కష్టాలు.. కన్నీళ్లే..

రాజంపేట అన్నమాచార్యకు చేరుకున్న 112మంది కడప జిల్లావాసులు

ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు


రాజంపేట/కడప(ఆంధ్రజ్యోతి): ‘‘కువైత్‌లో కష్టాలే మాకు తోడు నీడ. పొట్ట కూటికోసం నాలుగు రూకలు సంపాదించుకోవాలని లక్షలు ఖర్చులు చేసి కువైత్‌కు వెళితే మేము పడిన బాధలు పగోడు కూడా పడకూడదు. మనోళ్లు ఆడపడే బాధలు మీకు చెబితే అన్నం కూడా తినలేరు. ఏదో కరోనా లాక్‌డౌన్‌ పుణ్యమాని మాకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి వదిలేసింది. మన ఇండియా ప్రభుత్వం సహకరించడంతో ఇంటికి వచ్చాం.. బయట ఉండటానికి రూము లేక, తినటానికి తిండి లేక, చేసుకోవడానికి పనులు లేక మేము పడిన బాధలు అన్నీఇన్నీ కావు’’ అంటూ కువైత్‌ నుంచి వచ్చిన కడప జిల్లావాసులు అనేక మంది పేర్కొన్నారు.


కువైత్‌ నుంచి 113 మంది గురువారం అర్ధరాత్రి దాటాక 1.50 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పరీక్షలన్నీ పూర్తయ్యాక ఉదయం 6గంటలకు 112మందిని 5 ప్రత్యేక బస్సుల్లో రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి హైబీపీతో బాధపడవుతుండటంతో చికిత్స అందించి విమానాశ్రయం సమీపంలోని వికృతమాల క్వారంటైన్‌లో ఉంచారు. రాజంపేటకు చేరుకున్న వారి ఆనందం అంతా ఇంతా కాదు. తాము ప్రాణాలతో వస్తామనుకోలేదని, ఇది తమకు పూర్వజన్మసుకృతమని పేర్కొన్నారు. వీరికి ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, కోవిడ్‌-19 డాక్టర్‌ అనిల్‌, డాక్టర్‌ వెంగల్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వచ్చిన వెంటనే డాక్టర్లు వారికి కరోనా స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. వచ్చిన 112మందికి పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ వస్తే ఐసోలోషన్‌కు తరలిస్తామని, మిగిలిన వారిని 14రోజుల పాటు అన్నమాచార్య క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచుతామని అధికారులు తెలిపారు. క్వారంటైన్‌ సెంటర్‌లో అన్ని రకాల వసతులు కల్పించామని, ఎవరైనా ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రత్యేక హోటళ్లలో ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు. బస్సు దిగినవారందరికీ మున్సిపల్‌ సిబ్బంది హైపోక్లోరైడ్‌ ద్రావణంతో స్ర్పే చేశారు. చుట్టుపక్కల ప్రాంగణాన్ని శానిటైజ్‌ చేశారు. ఈ సందర్భంగా కువైత్‌ నుంచి వచ్చిన పలువురు ఆంధ్రజ్యోతితో తమ అనుభవాలను పంచుకున్నారు.


కొడుకు చనిపోవడంతో వచ్చేశా..

మాది పెనగలూరు మండ లం బెస్తపల్లె. నా భర్త పాలగిరి సుబ్బారెడ్డి, నేను కువైత్‌లో ఉన్నాం. మాకు కొడుకు, కూతురు. కొడుకును డాక్టర్‌ను చేద్దామని డబ్బులు క ట్టి ఉక్రయిన్‌ దేశానికి పం పాం. అక్కడ నా కొడుకు గ త నెల 24వ తేదీన బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురై ఈనెల 5వ తేదీ చనిపోయాడు. ఇంటికి వద్దామంటే కరోనా లాక్‌డౌన్‌. ఈ పరిస్థితిలో చేసేది లేక ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధి వెంకట్‌ను ఆశ్రయించి ఇండియాకు వచ్చాం. 

- పాలగిరి భారతి, బెస్తపల్లె గ్రామం, పెనగలూరు మండలం 


మూడు నెలల కిందే వద్దామనుకున్నా..

నేను కువైత్‌కు వెళ్లి రెండున్నర సంవత్సరమైంది. మూడు నెలలకిందటే ఇంటికొద్దామనుకుంటే కరోనా లాక్‌డౌన్‌ మొదలైంది. అప్పటి నుంచి మనోళ్ల కష్టాలు అన్నీఇన్నీ కావు. తినడానికి తిండి లేక, చేతిలో చిల్లిగవ్వలేక రూములకు బాడుగ కట్టలేక ఇబ్బందులు పడ్డాం. ఈ పరిస్థితుల్లో కువైత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో మన ప్రభుత్వం సహకరించడంతో ఇండియాకు వచ్చాను. 

- వి.దస్తగిరి, తొవారుపల్లె, ఖాజీపేట మండలం 


గర్భిణీ కావడంతో రావాల్సి వచ్చింది..

నేను గర్భిణీ అయినందున ఇంటికి రావాల్సి వచ్చింది. నేను, నా భర్త కువైత్‌లో ఉన్నాం. ఇండియా వాళ్లకు కరోనా వైరస్‌ ఎక్కువగా వస్తోంది. అక్కడివారు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇండియాకు రావడం తప్పని పరిస్థితి. ప్రతిరోజూ వేలమంది మన ఇండియా వారికి కరోనా వస్తోంది. గర్భిణీని కాబట్టి ఎక్కడ కరోనా వైరస్‌ వస్తుందోనని భయపడి ఇండియాకు రావాల్సి వచ్చింది.

- లక్ష్మీదేవి, రామ్‌నగర్‌, రాజంపేట 


ఆరోగ్యం బాగలేక వచ్చాను..

నేను పది సంవత్సరాల నుంచి కువైత్‌లో ఉన్నాను. ప్రస్తుతం నాకు గుండెకు సంబంధించిన వ్యాధి వల్ల ఇండియాకు రావాల్సి వచ్చింది. కువైత్‌లో బాధలు పడినోడికే తెలుస్తుంది. పగోడికి కూడా ఈ ఇబ్బంది రాకూడదు. ఉండటానికి రూము లేక, తిండి లేక, జీతాలు రాక, కువైటోళ్ల వేధింపులు పడలేక ఇంటికి వచ్చేశాం. అక్కడ మనోళ్లు పడుతున్న బాధలు చూస్తే ఎవరికైనా ఏడుపొస్తుంది.

- వల్లూరు శ్రీదేవి, మందరం, రాజంపేట మండలం 




పాస్‌పోర్టు ఒక చోట.. పని చేసేది మరోచోట..

నేను పోయినప్పటి నుంచి పాస్‌పోర్టు ఒక చోట.. పనిచేసేది మరోచోట. కేవలం కువైత్‌కు రప్పించుకోవడానికే వీసా పంపారు. అయితే నేను వేరే చోట పనిచేసుకుంటూ ఉండేవాడిని.  కువైత్‌ లాక్‌డౌన్‌లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డాను. వీసా పంపించినోళ్లు అకామా కొట్టి బయటకు పంపించారు. మేము ఎనిమిది మంది చిన్నరూములో ఉండేవాళ్లం. ఈ పరిస్థితిలో కువైత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో ఎట్టోకట్ట ఇంటికి వచ్చేశాను. 

- మల్లేశ్వరయ్య, నందలూరు మండలం

Updated Date - 2020-05-23T21:54:04+05:30 IST