సేవకు వేళాయె

ABN , First Publish Date - 2020-09-30T06:29:01+05:30 IST

లాక్‌డౌన్‌లో అంతా స్తంభించిపోయింది. ఎవరికీ ఆదాయం లేదు. షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ఒకరు... ఇద్దరు కాదు... దాదాపు పదిహేను వేలమంది సినీ కార్మికులు ఇబ్బంది పడ్డారు. వీరికి చేయూతనిచ్చింది ‘సీసీసీ’...

సేవకు వేళాయె

లాక్‌డౌన్‌లో అంతా స్తంభించిపోయింది. ఎవరికీ ఆదాయం లేదు. షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో ఒకరు... ఇద్దరు కాదు... దాదాపు పదిహేను వేలమంది సినీ కార్మికులు ఇబ్బంది పడ్డారు. వీరికి చేయూతనిచ్చింది ‘సీసీసీ’. ఈ ఆలోచన వెనకున్నది యువ దర్శకుడు మెహర్‌ రమేశ్‌. సినీరంగంలో అందరినీ ఒక తాటి మీదకు తీసుకువచ్చి... స్వచ్ఛందంగా వలంటీలర్లతో మూడు విడతలుగా దాదాపు నలభై వేల మందికి నిత్యావసరాల కిట్స్‌ ఇచ్చారు. ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా జరిగిన ఈ ప్రయత్నం వెనుక ఎంతో శ్రమ ఉంది. ‘‘ఇది మేము వారికి చేసిన సాయం కాదు... వారికి సినీ పరిశ్రమ తరుఫున ఇచ్చిన సాధికారత’’ అంటున్న మెహర్‌ రమేశ్‌ ఈ కార్యక్రమ విశేషాలను ‘యంగ్‌’తో పంచుకున్నారు. 



లాక్‌డౌన్‌ ఎంత షాకింగో... ఆ వెంటనే దాని పర్యవసానాలు కూడా అంతే షాకింగ్‌. ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం కుదరడం లేదు. దగ్గరి నుంచి ఎవరితో మాట్లాడడంలేదు. ఈ నేపథ్యంలో మా అసిస్టెంట్‌ డైరెక్టర్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. ‘తెలుగు ఫిలిమ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ట్రస్ట్‌’కు నేను కోశాధికారిని. కనుక మొదట ఆ ట్రస్ట్‌కి నా వంతుగా రూ.50 వేలు ఇచ్చి, ఇతర డైరెక్టర్లకు కూడా ‘మీకు తోచింది ఇవ్వండి’ అని మెసేజ్‌లు పెట్టాను. దాంతో పాటే నెలకు ఎన్ని సరుకులు అవసరమవుతాయో జాబితా తయారు చేశా. నా ప్రణాళిక రెండు మూడొందల మంది కోసం. ఈ లోపు చిరంజీవి గారు ఫోన్‌ చేశారు. అప్పటికే ఆయన కార్మికుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. 

‘‘పరిస్థితి భయంకరంగా ఉంది. వనోళ్లను ఆదుకోవాలి. నువ్వేదో చేస్తున్నావని తెలిసింది’ అన్నారు. ‘నేనేదో రెండు మూడొందల మంది వరకు అనుకుంటున్నా అన్నయ్యా’ అంటుంటే... ‘లేదు... 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న అందరికీ చేద్దాం’ అన్నారు. నేనసలు ఊహించలేదు. ‘‘నాగార్జున ఫోన్‌ చేశారు. ఆయన కూడా కోటి రూపాయలు ఇస్తానన్నారు. మిగిలినవాళ్లూ వస్తారు. దీని కోసం నేనొక కమిటీ వేస్తున్నాను. సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ అందులో ఉన్నారు. నువ్వు కూడా ఉండు’’ అన్నారు. ఎన్‌.శంకర్‌, సి.కల్యాణ్‌ మరికొంతమందిని కూడా కమిటీలోకి తీసుకుందామనన్నాను. 


ప్రణాళిక లేదు... సంకల్పం తప్ప... 

అయితే ఈ పనులు చేయడానికి ఒక ట్రస్టు కావాలి. దాని కోసం నేను కొన్ని పేర్లు చెబితే చివరకు అందరూ చర్చించి... ‘సీసీసీ’ (కరోనా క్రైసిస్‌ చారిటీ) ఓకే చేశారు. ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబుకు ఫోన్‌ చేస్తే... వెంటనే ముందుకు వచ్చారు. రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌... ఇలా ఎవరికి వారు చందాలిస్తున్నారు. అయితే డబ్బుగా కాకుండా ఏదైనా రూపంలో ఉపయోగపడేలా సాయం చేస్తే బాగుంటుందని సూచించారు. ఇచ్చేది కార్మికుల కుటుంబాలకు చేరాలి. ఎలా? అప్పట్లో బయటకు వస్తే కొడుతున్నారు. సూపర్‌మార్కెట్‌కు వెళ్లి నిత్యావసరాలు కొందామంటే ఒకళ్లకి మూడు నాలుగు గంటలు పడుతోంది. ఇలా కాదని బిగ్‌బజార్‌, వాల్‌మార్ట్‌ తదితర బడా షాపింగ్‌ మాల్స్‌ అన్నింటినీ సంప్రదించాను. ‘మావాళ్లు ఓ పదివేల మంది ఉంటారు. వాళ్లందరికీ నిత్యావసరాలు కిట్లుగా ఇవ్వాల’ని చెప్పాను. ఎవరూ 500కు మించి ఇవ్వలేమన్నారు. అదీ వారం తరువాత. ఎక్కడా అంత స్టాక్‌ లేదు. మొత్తానికి ఎక్కడో పట్టుకున్నాం. దాన్ని సరఫరా చేయడానికి మళ్లీ ప్రభుత్వ విభాగాల అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. దేనికీ ప్రణాళికనేది లేదు. సంకల్పం తప్ప! 


ఓటీపీ పద్ధతిలో... 

ప్యాకింగ్‌కు కొంతమందిని పిలిచాం. పంపిణీ చేయడానికి మరికొంతమంది. ఒక పక్క అంతా కరోనా కేర్‌ తీసుకొంటూనే పని ముగించాలి. చిరంజీవి గారు రోజుకు పది పదిహేను ఫోన్లు... ‘ఒకటో తేదీ వచ్చేసింది. ముందు వాళ్లందరికీ నిత్యావసరాలు ఇవ్వాలి. ఎవరూ ఆందోళన పడకూడదు’ అని! మొత్తం ఎనభై మంది వాలంటీర్లు ప్రత్యక్షంగా నాతో కలిసి పనిచేశారు. కచ్చితంగా కార్మికుడి కుటుంబానికే అందేలా గుర్తింపు కార్డుల ఆధారంగా ఓటీపీ పద్ధతి పెట్టాం. ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. అంతేకాదు... ‘నిజంగా అవసరమైన వారు మాత్రమే ఈ కిట్లు తీసుకోండ’ని వాట్సప్‌ సందేశాలు పంపాం. మొత్తంమీద మొదట పాతిక కిట్లు సిద్ధమయ్యాయి. ఎలా సాధ్యం? ఎవరికీ నమ్మశక్యం కాలేదు. నిదానంగా జాబితా పెరిగిపోతోంది. ఇదంతా డిజిటల్‌ టీమ్‌ చూసుకొంటోంది. నాకు, ఎన్‌.శంకర్‌ గారికి అసలు టైమ్‌ లేదు. మేమిద్దరం ఎప్పుడూ హాట్‌లైన్‌లోనే ఉండేవాళ్లం. 


నాణ్యత పరిశీలించాకే... 

సమస్యలేవీ చిరంజీవి గారికి చెప్పి ఇబ్బంది పెట్టకుండా, ఇక్కడ జరిగే పని గురించి మాత్రమే మెసేజ్‌లు పంపించేవాళ్లం. నాణ్యత ఎలా ఉందో చూడమని కమిటీ సభ్యులందరికీ తొలుత కిట్లు ఇచ్చాం. వాళ్లు బాగుందన్న తరువాత తొలి కిట్‌ తీసుకవెళ్లి ఓ కార్మికుడి కుటుంబానికి అందించాం. ఆ విషయాన్ని చిరంజీవి గారు అందరికీ గొప్పగా చెప్పారు. వెంటనే నాగర్జున గారు మరికొంతమంది హీరోలు ఫోన్లు చేసి అభినందించారు. కానీ పాతిక కిట్ల పంపిణీతో అయిపోదు కదా! మళ్లీ రేపటికి సిద్ధమవ్వాలి. ప్రణాళిక, సమన్వయం... రెండూ పక్కాగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. 


40 వేల కిట్ల పంపిణీ...  

ఆ చివర ఒకరు... ఈ చివర ఒకరు. ఒక్కోళ్లు ఒక్కో ప్రాంతం. ఈ సమయంలో నా స్నేహితులు కూడా కొంతమంది వచ్చి వాళ్ల కార్లలో తీసుకువెళ్లి సినీ కార్మికులకు కిట్లు అందించారు. వాలంటీర్లంటే సామాన్యం కాదు కదా! వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. అందరూ పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నారు. వాళ్ల వాహనాలు పోలీసులు లాక్కున్నారు. వారిలో నేను తప్ప చిత్ర రంగానికి సంబంధించిన వారెవరూ లేరు. అలా ఇప్పటి వరకు 40 వేల కిట్లు ఇచ్చాం. ఒక్కో కిట్టూ సుమారు అన్నీ కలిపి 45 కిలోల వరకు బరువు ఉంటుంది. పంపిన వారికి అందాయా లేదా తెలుసుకోవడానికి ఫీడ్‌బ్యాక్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఒక్కో కిట్‌ విలువ సుమారు రూ.3,400. ట్రాన్స్‌పోర్ట్‌, లేబర్‌ ఖర్చులు రెట్టింపు అవుతాయి. అవి ఇందులో కలపలేదు. ఇళ్లకెళితే ఒక్కోరిదీ ఒక్కో కథ. వింటుంటే కళ్ల వెంట నీళ్లు వస్తాయి. అంత అవసరంలో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడం నిజంగా ఎంతో సంతృప్తినిచ్చింది. 


ఏడున్నర కోట్ల నిధులు... 

‘సీసీసీ’కి మొత్తం సుమారు రూ.7.5 కోట్ల నిధులు సమకూరాయి. ఇప్పటి వరకు మూడుసార్లు కిట్లు ఇచ్చాం. మేము లెక్క వేసింది నెలకే కానీ... ఒక కిట్‌ అంత కంటే ఎక్కువ రోజులే వస్తుంది. ఇచ్చినవి అక్టోబర్‌ 10 వరకు సరిపోతాయి. ఇవి కాకుండా నేను పోగు చేసిన డబ్బులు రూ.25 లక్షలయ్యాయి. చిరంజీవి గారు ‘అవి ఇందులో కలపద్దు. మీది మీరే ఉంచుకోండి’ అన్నారు. దీంతో మా అసోసియేషన్‌లో అవసరమన్న వాళ్ల బ్యాంక్‌ ఖాతాకు రూ.5 వేల చొప్పున జమ చేశాం.     

ఎంతో సంతృప్తి...

ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు కూడా మొదలవుతున్నాయి. కార్మికుల పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. మనం ఇవ్వడం గొప్ప కాదు. కానీ అత్యవసరంలో అందించాం. అది ముఖ్యం. ఒకావిడైతే గర్భవతి. తింటానికి ఏమీ లేవు. బయట కొనలేరు. పక్కింటి వారిని అడగలేరు. అదే సమయంలో మేం తీసుకువెళ్లి కిట్టు ఇస్తే ఆమె ప్రాణం లేచివచ్చింది. ఆ కళ్లల్లో పట్టరాని ఆనందం. ఇది చిరంజీవి గారి సంకల్పం. మిగిలిన హీరోలందరూ పెద్ద మనసుతో స్పందించారు. ఎవర్నీ అడగలేదు. అంతా స్వచ్ఛందంగా ఇచ్చినవారే. ఆపత్కాలంలో ఈ పని విజయవంతంగా పూర్తిచేయగలగడం ఎంతో సంతృప్తిగా ఉంది. దేవుడు మాకు ఇంత శక్తినిచ్చినందుకు సంతోషంగా ఉంది. 




అమితాబ్‌ అభినందన... 

ఈ విషయం బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ గారికి తెలిసి, ఆయన చిరంజీవి గారికి ఫోన్‌ చేసి... ‘మీరు అద్భుతంగా చేస్తున్నార’ని అన్నారు. తరువాత ఆయన కొంత డబ్బు సేకరించి, దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు కొన్ని ఫుడ్‌ కూపన్లు పంపించారు. ఒక్కోటి రూ.1,500. మనకు 12 వేల కూపన్లు వచ్చాయి. అవి కూడా కార్మికులకు ఇచ్చాం. ‘సురభి’ రంగస్థల కళాకారులకూ పంపించాం. చిరంజీవి గారు... ‘ఇలా షూటింగ్‌లు మొదలయ్యే వరకు మనం ఇస్తూనే ఉండాలి. డబ్బు గురించి ఆలోచించద్దు. ఇవి చాలకపోతే నాకు ఇస్తామని పరిశ్రమకు సంబంధంలేని వారు చాలామంది అంటున్నారు. కానీ ముందు సినిమావాళ్లంతా స్పందించాలి’’ అన్నారు. ఆయన ఒక బస్తీని దత్తత తీసుకున్నారు. వినాయకచవితి పండుగకు ప్రత్యేకంగా ఒక కిట్‌ ఇచ్చాం. అలా ఆంధ్రాలో ఉన్నవారికి కూడా పంపించాం. భారత్‌లోనే ఇలా కార్మికుల కోసం స్పందించిన సందర్భం లేదు. 


Updated Date - 2020-09-30T06:29:01+05:30 IST